భారత్‌ వృద్ధికి ఫిచ్‌ కోత | Fitch Ratings cuts India growth forecast to 7.2% | Sakshi
Sakshi News home page

భారత్‌ వృద్ధికి ఫిచ్‌ కోత

Published Fri, Dec 7 2018 4:35 AM | Last Updated on Fri, Dec 7 2018 4:35 AM

Fitch Ratings cuts India growth forecast to 7.2%  - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థలో మళ్లీ మందగమన సంకేతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం ఫిచ్‌ తాజాగా దేశ జీడీపీ వృద్ధి అంచనాల్లో భారీగా కోత విధించటం దీనికి బలం చేకూరుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి (2018–19) సంబంధించి ముందుగా వెలువరించిన వృద్ధి రేటు అంచనాలను ఏకంగా 7.2 శాతానికి కుదిస్తున్నట్లు ఫిచ్‌ పేర్కొంది. గురువారం విడుదల చేసిన ప్రపంచ ఆర్థిక అంచనాల నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. వృద్ధి రేటు 7.8 శాతంగా ఉండొచ్చంటూ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఫిచ్‌ పేర్కొంది. జూన్‌లో 7.4 శాతంగా ఉండొచ్చని అంచనా వేసి... సెప్టెంబర్లో దాన్ని పెంచటం గమనార్హం. అధిక భారం, రుణ లభ్యత తగ్గుమఖం పట్టడం వంటివి వృద్ధి అంచనాలను తగ్గించడానికి ప్రధాన కారణాలుగా రేటింగ్‌ దిగ్గజం తెలియజేసింది.  

2017–18లో వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. కాగా, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 8.2 శాతానికి ఎగబాకగా... తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం రెండో త్రైమాసికంలో 7.1 శాతానికి పడిపోయింది. రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఈ ఏడాది వృద్ధి రేటు 7.4 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. దీనికంటే తక్కువగానే ఫిచ్‌ అంచనాలుండటం గమనార్హం. ఇక 2019–20 ఏడాదికి వృద్ధి రేటు 7 శాతం, 2020–21లో 7.1 శాతంగా ఉండొచ్చని లెక్కగట్టింది. సెప్టెంబర్‌లో అంచనా వేసిన 7.3 శాతంతో పోలిస్తే వచ్చే రెండేళ్లకు కూడా కోత పడింది.

నివేదికలోని ఇతర ముఖ్యాంశాలివీ...
► ఈ ఏడాది క్యూ2 వృద్ధి రేటు భారీగా పడిపోవడం ఆర్థిక వ్యవస్థలో ప్రతికూలతలకు నిదర్శనం.
► వినియోగం రేటు 8.6 శాతం నుంచి 7 శాతానికి బలహీనపడినప్పటికీ.. ఇంకా మెరుగ్గానే కనబడుతోంది. పెట్టుబడులు పుంజుకుంటున్నాయి. 2016–17ద్వితీయార్థం నుంచీ పెరుగుతున్నాయి.
► దిగుమతుల అంతకంతకూ పెరిగిపోవడంతో వాణిజ్య లోటు మరింత ఎగబాకవచ్చు.
► వచ్చే ఏడాదిలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వృద్ధికి ఊతమిచ్చే విధంగానే కేంద్ర ప్రభుత్వం ద్రవ్య విధానాలు కొనసాగించాల్సిన       అవసరం ఉంది.
► 2019 చివరినాటికి డాలరుతో రూపాయి మారకం విలువ 75 స్థాయికి పడిపోవచ్చు(ప్రస్తుతం 71 స్థాయిలో కదలాడుతోంది).
► ప్రభుత్వం వ్యయాలను పెంచడం ద్వారా.. ప్రధానంగా మౌలిక సదుపాయాలకు భారీగా నిధులను వెచ్చిండం వల్ల జీడీపీలో పెట్టుబడుల నిష్పత్తి పడిపోకుండా అడ్డుకట్ట పడింది. మరోపక్క, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
► బ్యాంకింగ్‌ రంగం ఇంకా అధిక మొండిబకాయిల(ఎన్‌పీఏ) సమస్యల్లోనే కొట్టుమిట్టాడుతోంది. మరోపక్క ఐఎల్‌అండ్‌ఎఫ్‌సీ డిఫాల్ట్‌ తర్వాత బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(ఎన్‌బీఎఫ్‌సీ)లకు ద్రవ్య సరఫరా తగ్గి.. ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
► రానున్న నెలల్లో ద్రవ్యోల్బణం కొద్దిగా పెరిగే అవ కాశాలున్నాయి. ఇటీవలి కాలంలో తగ్గిన ఆహారోత్పత్తుల ధరలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడం, రూపాయి పతనం కారణంగా దిగుమతుల భారం కావడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు.
► ప్రపంచవ్యాప్తంగా వడ్డీరేట్లు పెరుగుతుండటం రూపాయి క్షీణతకు మరింత ఆజ్యం పోస్తాయి. దీనివల్ల కరెంట్‌ అకౌంట్‌ లోటు(క్యాడ్‌) కూడా ఎగబాకవచ్చు.


ప్రపంచ వృద్ధి అంచనాలు యథాతథం..
ఈ ఏడాది (2018) ప్రపంచ వృద్ధి అంచనాలను యథాతథంగా 3.3 శాతంగా కొనసాగిస్తున్నట్లు ఫిచ్‌ పేర్కొంది. వచ్చే ఏడాది( 2019) అంచనాల్లోనూ (3.1%) మార్పులు చేయలేదు. మరోపక్క, చైనా వృద్ధి రేటు ఈ ఏడాది 6.6 శాతం, వచ్చే ఏడాది 6.1 శాతం చొప్పున ఉండొచ్చని అంచనా వేసింది. గత అంచనాలను కొనసాగించింది. ఇక ఒపెక్‌ దేశాలు క్రూడ్‌ ఉత్పత్తిలో కొంత కోతకు అంగీకరించే అవకాశం ఉందని... దీనివల్ల ప్రస్తుత స్థాయి నుంచి ముడిచమురు ధరలు కొంత పుంజుకోవచ్చని ఫిచ్‌ అభిప్రాయపడింది. ‘2018 ఏడాదికి సగటు క్రూడ్‌(బ్రెంట్‌) బ్యారెల్‌ ధర 72.5 డాలర్లుగా ఉండొచ్చు. వచ్చే ఏడాది అంచనా 65 డాలర్లలో మార్పులేదు. 2020 అంచనాలను మాత్రం 57.5 డాలర్ల నుంచి 62.5 డాలర్లకు పెంచుతున్నాం’అని ఫిచ్‌ తెలిపింది. కాగా, అక్టోబర్‌ ఆరంభంలో భారత్‌ దిగుమతి చేసుకునే ముడిచమురు రేటు 85 డాలర్ల నుంచి నవంబర్‌ ఆఖరి నాటికి 60 డాలర్ల దిగువకు పడిపోయిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement