న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అసాధారణ సవాళ్ల మధ్య భారత్ బలమైన రికవరీ బాటలో నడవడానికి దేశ స్థూల ఆర్థిక నిర్వహణ అద్భుతంగా ఉండడమేనని కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక తెలిపింది. ఇతర దేశాలకు ఇదొక ఉదాహరణగా పేర్కొంది. మౌలిక సదుపాయాల సరఫరా వైపు చేసిన పెట్టుబడులతో భారత్ దీర్ఘకాలం పాటు స్థిరమైన వృద్ధిని నమోదు చేయగలదని అంచనా వేసింది. ‘‘గడిచిన కొన్నేళ్లలో అంతర్జాతీయంగా ఊహించని సవాళ్లు నెలకొన్నాయి. దీనికితోడు భారత బ్యాంకింగ్, నాన్ ఫైనాన్షియల్ కార్పొరేట్ రంగంలో బ్యాలన్స్ షీటు సమస్యలు వెలుగు చూశాయి. అయినా కానీ, భారత్ స్థూల ఆర్థిక నిర్వహణ ఎంతో మెరుగ్గా ఉండడం వీటిని అధిగమించేలా చేసింది’’అని కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక వెల్లడించింది.
గత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు అంతక్రితం ఆర్థిక సంవత్సంతో పోలిస్తే తగ్గడాన్ని ప్రస్తావించింది. ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు తగ్గించేందుకు ప్రభుత్వం సుంకాలు తగ్గించి, సంక్షేమంపై వ్యయాలను పెంచొచ్చని పేర్కొంది. అలాగే, గరిష్ట స్థాయిలో మూలధన వ్యయాలను కొనసాగించొచ్చని అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో సానుకూల పనితీరు ప్రభావం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగుతుందని, ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయని వివరించింది. గత ఆర్థిక సంవత్సరంలో ముందుగా వేసిన అంచనా 7 శాతం మించి, 7.2 శాతం జీడీపీ వృద్ధి నమోదు కావడానికి, చివరి త్రైమాసికంలో బలమైన పనితీరును కారణంగా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment