![Indian Govt Considers Tax Cut On Cooking Oil To Reduce Prices - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/25/Cooking_oil_Prices_Down.jpg.webp?itok=71MWSzdf)
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: దేశంలో అధిక వినియోగంలో ఉన్న సన్‌ఫ్లవర్(పొద్దు తిరుగుడు) తోపాటు సోయాబీన్ ఆయిల్ ధరలు తగ్గించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. రాబోయే రెండేళ్ల కాలానికి ఈ దిగుమతులపై కస్టమ్ డ్యూటీ, అగ్రిసెస్‌ను మినహాయిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. అమాంతం పెరిగిన నూనె ధరలకు కళ్లెం వేయడంలో భాగంగానే వంట నూనెల దిగుమతిపై విధిస్తున్న కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం తొలగించింది. ప్రభుత్వ తాజా చర్యతో దేశీయంగా వంటనూనెల ధరలు రాబోయే రోజుల్లో తగ్గుముఖం పట్టనున్నాయి.
ఏడాదికి 20 లక్షల మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు పువ్వు (సన్‌ఫ్లవర్) నూనె, మరో 20 లక్షల మెట్రిక్ టన్నుల సోయాబీన్ నూనెల దిగుమతిపై ఇప్పటి వరకు విధిస్తున్న కస్టమ్స్ సుంకం, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్‌ను తొలగించింది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ముడి సోయాబీన్ నూనె, ముడి పొద్దుతిరుగుడు పువ్వు నూనెల దిగుమతికి ఈ మినహాయింపు వర్తిస్తుందని ఆర్థికశాఖ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
అయితే, దిగుమతుల కోటా కోసం ఈ నెల 27 నుంచి జూన్ 18లోపు ఆయా సంస్థలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఈ గడువు మించితే మాత్రం గతంలోని సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది.
కాగా, దేశీయంగా పంచదార ధరలు పెరగకుండా చూసేందుకు ఎగుమతులకు పరిమితులు విధించింది. ప్రస్తుత సంవత్సరంలో చక్కెర ఎగుమతులను 10 మిలియన్ టన్నులకే ప్రభుత్వం పరిమితం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 35 లక్షల టన్నుల ముడి సోయాబీన్ నూనె, 16-18 లక్షల టన్నుల ముడి సన్‌ఫ్లవర్ నూనెలను దిగుమతి చేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment