
న్యూఢిల్లీ: నాలుగు నెలలుగా వరుసగా పెరుగుతూ వచి్చన విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు తాజాగా దాదాపు 6 శాతం తగ్గాయి. అయితే, వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ (19 కేజీలు) రేటు రూ. 101.5 మేర పెరిగింది. గృహావసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ (14.2 కేజీలు) ధర మాత్రం యధాతథంగా రూ. 903 (ఢిల్లీలో) వద్దే ఉంది. ప్రభుత్వ రంగ ఇంధన రిటైలింగ్ సంస్థలు బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏటీఎఫ్ రేటు కిలోలీటరుకు రూ. 6,954.25 మేర (5.79 శాతం) తగ్గి రూ. 1,18,199.17కి దిగి వచి్చంది. జూలై నుంచి చూస్తే నాలుగు నెలల్లో విమాన ఇంధనం ధర రూ. 29,391 మేర పెరిగింది.
ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయాల్లో ఇంధనం వాటా దాదాపు 40 శాతం ఉంటున్న నేపథ్యంలో తాజా తగ్గింపుతో విమానయాన సంస్థలకు కాస్త ఊరట లభించనుంది. మరోవైపు, సవరించిన రేట్ల ప్రకారం 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 1,833గా ఉంటుంది. వాణిజ్య సిలిండర్ ధరను పెంచడం ఇది రెండోసారి. అక్టోబర్ 1న రేటును ఏకంగా రూ. 209 మేర ఇంధన కంపెనీలు పెంచాయి. ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) సంస్థలు .. అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా ప్రతి నెల 1న వంట గ్యాస్, ఏటీఎఫ్ ధరలను సవరిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment