Aviation Fuel
-
ఏటీఎఫ్ ధర 6 శాతం తగ్గింపు..
న్యూఢిల్లీ: నాలుగు నెలలుగా వరుసగా పెరుగుతూ వచి్చన విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు తాజాగా దాదాపు 6 శాతం తగ్గాయి. అయితే, వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ (19 కేజీలు) రేటు రూ. 101.5 మేర పెరిగింది. గృహావసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ (14.2 కేజీలు) ధర మాత్రం యధాతథంగా రూ. 903 (ఢిల్లీలో) వద్దే ఉంది. ప్రభుత్వ రంగ ఇంధన రిటైలింగ్ సంస్థలు బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏటీఎఫ్ రేటు కిలోలీటరుకు రూ. 6,954.25 మేర (5.79 శాతం) తగ్గి రూ. 1,18,199.17కి దిగి వచి్చంది. జూలై నుంచి చూస్తే నాలుగు నెలల్లో విమాన ఇంధనం ధర రూ. 29,391 మేర పెరిగింది. ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయాల్లో ఇంధనం వాటా దాదాపు 40 శాతం ఉంటున్న నేపథ్యంలో తాజా తగ్గింపుతో విమానయాన సంస్థలకు కాస్త ఊరట లభించనుంది. మరోవైపు, సవరించిన రేట్ల ప్రకారం 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 1,833గా ఉంటుంది. వాణిజ్య సిలిండర్ ధరను పెంచడం ఇది రెండోసారి. అక్టోబర్ 1న రేటును ఏకంగా రూ. 209 మేర ఇంధన కంపెనీలు పెంచాయి. ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) సంస్థలు .. అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా ప్రతి నెల 1న వంట గ్యాస్, ఏటీఎఫ్ ధరలను సవరిస్తాయి. -
మార్చిలో పెట్రోల్, డీజిల్ విక్రయాల్లో క్షీణత
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ వినియోగం నెమ్మదించింది. ఫిబ్రవరిలో గరిష్ట స్థాయి అమ్మకాలు నమోదు కాగా, మార్చి మొదటి 15 రోజుల్లో డిమాండ్ తగ్గినట్టు విక్ర,య గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది. వ్యవసాయ రంగం, రవాణా రంగాల నుంచి భారీ డిమాండ్ రావడంతో ఫిబ్రవరిలో రికార్డు స్థాయి అమ్మకాలు నమోదయ్యాయి. సాధారణంగా మార్చి నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. ఈ సమయంలో డిమాండ్ తగ్గడం సహజంగా కనిపిస్తుంటుంది. పెట్రోల్ అమ్మకాలు క్రితం ఏడాది మార్చి 1–15 కాలంతో పోల్చినప్పుడు.. ఈ ఏడాది అదే కాలంలో 1.4 శాతం తగ్గి 1.22 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. నెలవారీగా ఫిబ్రవరి గణాంకాలో పోల్చి చూస్తే 0.5 శాతం తగ్గాయి. డీజిల్ అమ్మకాలు 3.18 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 3.54 మిలియన్ టన్నులతో పోలిస్తే 10.2 శాతం తగ్గాయి. నెలవారీగా చూస్తే ఈ డిమాండ్ 4.6 శాతం క్షీణించింది. ఫిబ్రవరి నెల మొదటి భాగంలో పెట్రోల్ అమ్మకాలు వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 18 శాతం, డీజిల్ అమ్మకాలు 25 శాతం చొప్పున పెరగడం గమనార్హం. విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు 19.2 శాతం పెరిగి మార్చి మొదటి 15 రోజుల్లో 2,94,900 టన్నులుగా ఉన్నాయి. 2021 మార్చి మొదటి 15 రోజులతో పోలిస్తే 35 శాతం అధికం కాగా, 2020 మార్చి 15 రోజులతో పోలిస్తే 8.2 శాతం తక్కువ కావడం గమనించొచ్చు. దేశీ ఎయిర్ ట్రాఫిక్ కరోనా ముందు నాటి స్థాయికి చేరుకోగా, విదేశీ ఎయిర్ ట్రాఫిక్ మాత్రం పలు దేశాల్లో ఆంక్షల కారణంగా ఇంకా పుంజుకోవాల్సి ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇక వంటగ్యాస్ (ఎల్పీజీ) విక్రయాలు 9.7 శాతం తగ్గి 1.18 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. -
రికార్డు స్థాయికి ఏటీఎఫ్ రేటు..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఎగిసిన నేపథ్యంలో దేశీయంగా విమాన ఇంధన (ఏటీఎఫ్) రేట్లు రికార్డు స్థాయికి పెరిగాయి. ప్రభుత్వ రంగ ఇంధనాల మార్కెటింగ్ సంస్థలు ఏటీఎఫ్ రేటును ఆదివారం 3.22 శాతం పెంచాయి. దీంతో ఢిల్లీలో కిలోలీటరు ధర రూ. 3,649.13 మేర పెరిగి రూ. 1,16,851.46 (లీటరు రేటు రూ. 116.8)కి చేరింది. ఏటీఎఫ్ రేట్లను పెంచడం ఈ ఏడాది వరుసగా ఇది తొమ్మిదోసారి. ముంబైలో కిలో లీటరు ధర రూ. 1,15,617.24కి, కోల్‌కతాలో రూ. 1,21,430.48కి, చెన్నైలో రూ. 1,20,728.03కి చేరింది. స్థానిక పన్నుల ఆధారంగా రాష్ట్రాన్ని బట్టి రేట్లు మారతాయి. మరోవైపు, పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 25వ రోజూ యధాతథంగానే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రేట్లను బట్టి విమాన ఇంధనం ధరలను ప్రతి నెలా పదిహేను రోజులకోసారి, పెట్రోల్..డీజిల్ రేట్లను రోజువారీ సవరిస్తారు. -
జీఎస్టీలోకి సహజవాయువు, ఏటీఎఫ్?
న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏటీఎఫ్), సహజవాయువు(సీఎన్జీ)ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని ఈ వారంలో జరిగే జీఎస్టీ మండలి సమావేశంలో పరిశీలించనున్నారు. గతేడాది జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రాగా, క్రూడాయిల్, సహజవాయువు, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్‌ను మాత్రం దీన్నుంచి మినహాయించారు. జీఎస్టీలోకి చేరిస్తే కేంద్ర, రాష్ట్రాలకు జరిగే ఆదాయ నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని అప్పట్లో మినహాయించారు. అయితే, సహజవాయువు, ఏటీఎఫ్‌ను జీఎస్టీలోకి తీసుకురావడం అనుకూలమేనన్న ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ ఈ నెల 21న జరిగే సమావేశంలో పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. అయితే, ప్రస్తుతం జీఎస్టీలో గరిష్ట పన్ను రేటు 28గా ఉంది. ఈ నేపథ్యంలో ఏటీఎఫ్‌ను ఈ శ్లాబులోకి తీసుకొస్తే కేంద్ర, రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే కేంద్రం, రాష్ట్రాల పన్నులు కలిపి ఏటీఎఫ్‌పై 39–44 శాతం స్థాయిలో ఉన్నాయి. జీఎస్టీ రేటుకు అదనంగా రాష్ట్రాలు వ్యాట్‌ను లెవీగా విధించుకునే అవకాశం కల్పించడమే మార్గమని ఆ వర్గాలు పేర్కొన్నాయి. సహజవాయువు విషయంలోనూ ఇబ్బంది ఉంది. జీఎస్టీలో చేర్చి 12 శాతం పన్ను రేటు విధిస్తే ఆదాయ లోటును ప్రభుత్వాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 18 శాతం విధిస్తే విద్యుత్తు, ఎరువుల పరిశ్రమలకు ఉత్పత్తి వ్యయాలు పెరుగుతాయి. -
విమాన ఇంధన రేట్ల తగ్గింపు
12.5% తగ్గిన ఏటీఎఫ్ ధర న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు రేట్లు అయిదేళ్ల కనిష్టానికి తగ్గిన నేపథ్యంలో విమాన ఇంధనం (ఏటీఎఫ్), సబ్సిడీయేతర వంట గ్యాస్ (ఎల్పీజీ) ధరలను చమురు కంపెనీలు తగ్గించాయి. ఏటీఎఫ్ ధరను 12.5 శాతం, ఎల్పీజీ రేటును సిలిండరుకు రూ. 43.50 మేర తగ్గించినట్లు, ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని సంస్థలు గురువారం ప్రకటించాయి. దీంతో ఢిల్లీలో కిలో లీటరు ఏటీఎఫ్ రేటు రూ. 7,520.52 తగ్గి రూ. 52,422.92కి దిగి వచ్చింది. అలాగే 14.2 కిలోల సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్ ధర రూ752 నుంచి రూ. 708.50కి తగ్గినట్లవుతుంది.విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో 40 శాతం వాటా ఏటీఎఫ్లదే ఉంటుంది. ఎయిర్‌లైన్స్‌కి తాజా పరిణామం ఊరట కలిగించనుంది. మరోవైపు, ఏటీఎఫ్ ధరలను తగ్గించడాన్ని విమానయాన సంస్థలు స్వాగతించాయి. అయితే, విమాన ప్రయాణ చార్జీలను తక్షణమే తగ్గించే యోచనేదీ లేదని స్పష్టం చేశాయి. నిర్వహణ వ్యయాలు చాలా అధికంగా ఉన్నందున ఏటీఎఫ్ రేట్ల తగ్గింపు ఎయిర్‌లైన్స్‌కి ఊరటనిచ్చే చర్యని స్పైస్‌జెట్ సీవోవో సంజీవ్ కపూర్ తెలిపారు.