న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ వినియోగం నెమ్మదించింది. ఫిబ్రవరిలో గరిష్ట స్థాయి అమ్మకాలు నమోదు కాగా, మార్చి మొదటి 15 రోజుల్లో డిమాండ్ తగ్గినట్టు విక్ర,య గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది. వ్యవసాయ రంగం, రవాణా రంగాల నుంచి భారీ డిమాండ్ రావడంతో ఫిబ్రవరిలో రికార్డు స్థాయి అమ్మకాలు నమోదయ్యాయి. సాధారణంగా మార్చి నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. ఈ సమయంలో డిమాండ్ తగ్గడం సహజంగా కనిపిస్తుంటుంది.
పెట్రోల్ అమ్మకాలు క్రితం ఏడాది మార్చి 1–15 కాలంతో పోల్చినప్పుడు.. ఈ ఏడాది అదే కాలంలో 1.4 శాతం తగ్గి 1.22 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. నెలవారీగా ఫిబ్రవరి గణాంకాలో పోల్చి చూస్తే 0.5 శాతం తగ్గాయి. డీజిల్ అమ్మకాలు 3.18 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 3.54 మిలియన్ టన్నులతో పోలిస్తే 10.2 శాతం తగ్గాయి. నెలవారీగా చూస్తే ఈ డిమాండ్ 4.6 శాతం క్షీణించింది.
ఫిబ్రవరి నెల మొదటి భాగంలో పెట్రోల్ అమ్మకాలు వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 18 శాతం, డీజిల్ అమ్మకాలు 25 శాతం చొప్పున పెరగడం గమనార్హం. విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు 19.2 శాతం పెరిగి మార్చి మొదటి 15 రోజుల్లో 2,94,900 టన్నులుగా ఉన్నాయి. 2021 మార్చి మొదటి 15 రోజులతో పోలిస్తే 35 శాతం అధికం కాగా, 2020 మార్చి 15 రోజులతో పోలిస్తే 8.2 శాతం తక్కువ కావడం గమనించొచ్చు. దేశీ ఎయిర్ ట్రాఫిక్ కరోనా ముందు నాటి స్థాయికి చేరుకోగా, విదేశీ ఎయిర్ ట్రాఫిక్ మాత్రం పలు దేశాల్లో ఆంక్షల కారణంగా ఇంకా పుంజుకోవాల్సి ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇక వంటగ్యాస్ (ఎల్‌పీజీ) విక్రయాలు 9.7 శాతం తగ్గి 1.18 మిలియన్ టన్నులుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment