
ఫిబ్రవరి రిటైల్ అమ్మకాల్లో 7 శాతం క్షీణత
ఫాడా వెల్లడి
న్యూఢిల్లీ: వాహనాలకు డిమాండ్ తగ్గిన నేపథ్యంలో ఫిబ్రవరిలో ప్యాసింజర్ వాహనాలు, టూ వీలర్లు సహా ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు 7 శాతం క్షీణించినట్లు ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. గతేడాది ఫిబ్రవరిలో 20,46,328 వాహన విక్రయాలు నమోదు కాగా తాజాగా గత నెల 18,99,196 యూనిట్లకు తగ్గాయి. ప్యాసింజర్ వాహనాల రిటైల్ విక్రయాలు 10 శాతం క్షీణించి 3,03,398 యూనిట్లకు పరిమితమయ్యాయి.
టూ వీలర్ల విక్రయాలు 6 శాతం క్షీణించి 14,44,674 నుంచి 13,53,280 యూనిట్లకు తగ్గాయి. వాణిజ్య వాహనాలు 9 శాతం క్షీణించి 82,763 యూనిట్లకు, ట్రాక్టర్ల విక్రయాలు 14 శాతం తగ్గి 65,574 యూనిట్లకు పడిపోయాయి. నిల్వలపరంగా సమతౌల్యత లేకపోవడం, ధరలపరంగా మార్పులు, వినియోగదారుల్లో బలహీన సెంటిమెంట్, ఎంక్వైరీలు తగ్గిపోవడం, రుణ లభ్యత పరిమిత స్థాయిలోనే ఉండటం తదితర అంశాలు అమ్మకాల క్షీణతకు కారణమైనట్లు ఫాడా పేర్కొంది.
ఎంట్రీ లెవెల్ కేటగిరీలో మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉండటం, కొనుక్కోవాలనుకునే ఆలోచన కొనుగోలు రూపం దాల్చడంలో జాప్యం జరుగుతుండటం, అలవికాని లక్ష్యాలు డీలర్లకు సమస్యాత్మకంగా ఉంటున్నాయని ఫాడా ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు. ఇదే విషయాన్ని తయారీ సంస్థలకు తెలియజేశారని, తమపై భారీ నిల్వల భారం మోపడాన్ని నివారించాలని కోరారని వివరించారు. మార్చిలో అమ్మకాలపై ఆశావహంగా ఉన్నప్పటికీ డీలర్లు కాస్త ఆచి తూచి వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం 50–52 రోజులకు సరిపడే నిల్వలు ఉంటున్నాయని పేర్కొన్నారు.