మే నెలలో విక్రయాలు అంతంతే
సార్వత్రిక ఎన్నికల ప్రభావం
గతంలో భారీ వృద్ధీ కారణమే
న్యూఢిల్లీ: ప్రయాణికుల వాహన హోల్‌సేల్ అమ్మకాలు గత నెల(మే)లో మందగించాయి. కంపెనీల నుంచి డీలర్లకు సగటున వాహన పంపిణీ(హోల్‌సేల్) 4 శాతమే పుంజుకుంది. మొత్తం 3,50,257 యూనిట్లకు చేరాయి. ఏడాది క్రితం(2023) ఇదే నెలలో హోల్‌సేల్ అమ్మకాలు 3,35,436 యూనిట్లుగా నమోదయ్యాయి.
ఇందుకు ప్రధానంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో డిమాండ్ నీరసించడం, అంతక్రితం అధిక వృద్ధి నమోదుకావడం(బేస్ ఎఫెక్ట్) కారణమయ్యాయి. కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా మొత్తం దేశీ అమ్మకాలు నామమాత్రంగా పెరిగి 1,44,002 యూనిట్లను తాకాయి. గతేడాది మే నెలలో 1,43,708 వాహనాలు విక్రయించింది.
ఎంట్రీలెవల్(చిన్న కార్లు), కాంపాక్ట్ కార్ల అమ్మకాలు వెనకడుగు వేశాయి. వీటి అమ్మకాలు 12,236 యూనిట్ల నుంచి 9,902కు తగ్గాయి. అయితే యుటిలిటీ వాహనాలు బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఎరి్టగా, ఎస్‌క్రాస్, ఎక్స్‌ఎల్6 విక్రయాలు 46,243 యూనిట్ల నుంచి 54,204కు ఎగశాయి. చిన్నకార్ల విభాగానికి దన్నునిచ్చేందుకు ఆల్టో కే10, ఎస్‌ప్రెస్సో, సెలెరియో మోడళ్లలో లిమిటెడ్ ఎడిషన్‌లను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్ధో బెనర్జీ పేర్కొన్నారు.
ఇతర దిగ్గజాల తీరిలా..
⇥ హ్యుందాయ్ మోటార్ ఇండియా వాహనాల దేశీ పంపిణీ(హోల్‌సేల్) స్వల్పంగా 1 శాతం పుంజుకుని 49,151 వాహనాలకు చేరింది. 2023 మే నెలలో 48,601 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల మందగమనం కొనసాగవచ్చని భావిస్తున్నట్లు కంపెనీ సీవోవో తరుణ్ గార్గ్ అంచనా వేశారు.
⇥ ఎలక్ట్రిక్ వాహనాలుసహా ఇతర ప్యాసిజంర్ వాహన అమ్మకాలు దేశీయంగా 2 శాతం బలపడి 47,705కు చేరినట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. గతంలో 45,984 యూనిట్లు
విక్రయించింది.
⇥ మహీంద్రా అండ్ మహీంద్రా వాహన విక్రయాలు 31 శాతం జంప్‌చేశాయి. 43,218 యూ నిట్లను తాకాయి. 2023 మే నెలలో 32,886 వాహనాలు మాత్రమే డీలర్లకు పంపిణీ చేసింది.
⇥ టయోటా కిర్లోస్కర్ సైతం గత నెలలో హోల్‌సేల్‌గా 24 శాతం వృద్ధితో మొత్తం 25,273 వాహన విక్రయాలను సాధించింది.
⇥ కియా ఇండియా 4 శాతం అధికంగా 19,500 యూనిట్లను డీలర్లకు పంపిణీ చేసింది. గతేడాది మే నెలలో 18,766 వాహనాలు విక్రయించింది. ఈ ఏడాది పోటీకి అనుగుణంగా పలు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టినట్లు కంపెనీ సీనియర్ వీపీ, సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ వెల్లడించారు.
⇥ ఎంజీ మోటార్ ఇండియా వాహన హోల్‌సేల్ అమ్మకాలు గత నెలలో 5 శాతం క్షీణించి 4,769 యూనిట్లకు పరిమితమయ్యాయి. 2023 మే నెలలో డీలర్లకు 5,006 వాహనాలు పంపిణీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment