
అతిపెద్ద దిగుమతిదారుగా ఆఫ్రికా
ఐ10 మోడల్ వేరియంట్లదే హవా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుండై మోటార్ ఇండియా 37 లక్షల యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను భారత్ నుంచి ఎగుమతి చేసి సరికొత్త మైలురాయిని అధిగమించింది. దేశం నుంచి 1999లో కంపెనీ ఎగుమతులు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం 60 దేశాలకు వివిధ మోడళ్ల కార్లను సరఫరా చేస్తోంది. 2024లో సంస్థకు సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, చిలీ, పెరూ అతిపెద్ద ఎగుమతి మార్కెట్లుగా అవతరించాయి. గత ఏడాది హ్యుండై 1,58,686 యూనిట్లు ఎగుమతి చేసి భారత్‌లో ప్యాసింజర్ వెహికిల్స్‌కు అతిపెద్ద ఎగుమతిదారుగా నిలిచింది. ఇక మన దేశం నుంచి హ్యుండై కార్లకు అతిపెద్ద దిగుమతిదారుగా ఆఫ్రికా తొలి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు మొత్తం 10 లక్షలకుపైగా వాహనాలను ఆఫ్రికా అందుకుంది.
తొలి స్థానంలో ఐ10..
గడిచిన 25 ఏళ్లలో భారత్ నుంచి 150కిపైగా దేశాలకు వాహనాలను సరఫరా చేసినట్టు హ్యుండై తెలిపింది. తమిళనాడులో కంపెనీకి తయారీ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం ఎగుమతుల్లో ఐ10 మోడల్ ఫ్యామిలీ 15 లక్షల యూనిట్లను దాటి టాప్–1లో నిలిచింది. వెర్నా సిరీస్‌లో 5,00,000 యూనిట్లు నమోదయ్యాయి. దక్షిణ కొరియా వెలుపల హ్యుండై అతిపెద్ద ఎగుమతి కేంద్రంగా భారత్‌ను నిలపాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని హ్యుండై మోటార్ ఇండియా ఎండీ ఉన్సూ కిమ్ వెల్లడించారు. ఇటీవల దక్షిణాఫ్రికాకు ఎక్స్‌టర్ మోడల్‌ను ఎగుమతి చేయడం ప్రారంభించామని, అక్కడి మార్కెట్లో భారత్‌లో తయారు చేసిన ఎనిమిదవ వాహనంగా ఈ మోడల్ గుర్తింపు పొందిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment