WPI falls to single digit in Oct at 19-month low of 8.39% - Sakshi
Sakshi News home page

సామాన్యులకు ఊరట.. ధరలు దిగొచ్చాయ్‌!

Published Tue, Nov 15 2022 9:08 AM | Last Updated on Tue, Nov 15 2022 12:07 PM

Wpi Prices Downfalls To Single Digit In October With 19 Months Lowest - Sakshi

న్యూఢిల్లీ: వినియోగదారునిపై ధరల మంట కొంత తగ్గింది. రిటైల్, టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) శాంతించాయి. రిటైల్‌ ద్రవ్యోల్బణం మూడు నెలల కనిష్ట స్థాయి 6.77 శాతానికి దిగి రాగా, టోకు ద్రవ్యోల్బణం 19 నెలల కనిష్ట స్థాయి అయిన 8.39 శాతానికి అక్టోబర్‌లో క్షీణించింది. ఆహారం, ఇంధనం, వస్తు తయారీ ధరలు తగ్గడం ఇందుకు అనుకూలించింది. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం వరుసగా ఐదో నెలలోనూ తగ్గినట్టయింది.

ముఖ్యంగా ఏడాదిన్నర విరామం తర్వాత ఒక అంకెకు దిగొచ్చింది. మినరల్‌ ఆయిల్స్, బేసిక్‌ మెటల్స్, ఫ్యాబ్రికేటెడ్‌ మెటల్‌ ఉత్పత్తులు, టెక్స్‌టైల్స్, తదితర ఉత్పత్తుల ధరలు తగ్గడం టోకు ద్రవ్యోల్బణం ఉపశమించడానికి అనుకూలించినట్టు కేంద్ర వాణిజ్య శాఖ పేర్కొంది. ఇప్పటికీ రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ గరిష్ట నియంత్రిత స్థాయి 6 శాతానికి పైనే ఉండడాన్ని గమనించాలి. దీన్ని బట్టి చూస్తుంటే తదుపరి సమీక్షలో రేట్ల పెంపు ఖాయమే అని తెలుస్తోంది. రిటైల్‌ ద్రవ్యోల్బణం అక్టోబర్‌ నెలకు 7 శాతంలోపునకు దిగొస్తుందన్న ఆశాభావాన్ని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ గత శనివారం వ్యక్తం చేయడం గమనార్హం. ముఖ్యంగా గరిష్ట పరిమితి 6 శాతంపైన 9 నెలలపాటు చలిస్తుండడంతో, ఆర్‌బీఐ తన చర్యల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది.  
చదవండి: కేం‍ద్రం భారీ షాక్‌: పది లక్షల రేషన్‌ కార్డులు రద్దు, కారణం ఏంటంటే..

రిటైల్‌ ధరలు ఇలా...  
► సెప్టెంబర్‌ నెలకు రిటైల్‌ ద్రవ్యోల్బణం 7.41 శాతంగా ఉండగా, అక్టోబర్‌లో 6.77 శాతంగా నమోదైంది. అంతకుముందు ఆగస్ట్‌ నెలలో 6.71 శాతంగా ఉండడం గమనార్హం.   
► ఆర్‌బీఐ గరిష్ట పరిమితి 6 శాతానికి పైన రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదు కావడం వరుసగా పదో నెలలోనూ (ఈ ఏడాది జనవరి నుంచి) జరిగింది. 
► ఆహార ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 8.6 శాతంగా ఉంటే, అక్టోబర్‌కు 7.01గా నమోదైంది. 
► కూరగాయలకు సంబంధించి 7.7 శాతానికి దిగొచ్చింది.  
► ఇంధన ద్రవ్యోల్బణం 9.93 శాతంగా ఉంది.  
► డిసెంబర్‌ త్రైమాసికంలో 6.5 శాతం, మార్చి త్రైమాసికంలో 5.8 శాతానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుతుందని ఆర్‌బీఐ అంచనాగా ఉంది.  

టోకు ద్రవ్యోల్బణం – 8.39 శాతం 
► ఆహారోత్పత్తుల టోకు ద్రవ్యోల్బణం 11.03 శాతం నుంచి 8.33 శాతానికి తగ్గింది.  
► కూరగాయలు, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, పండ్లు, గుడ్లు, మాంసం, చేపల టోకు ధరలు తగ్గాయి. సెప్టెంబర్‌లో కూరగాయలపై ద్రవ్యోల్బణం 39.66 శాతంగా ఉంటే, అక్టోబర్‌కు 17.61 శాతానికి తగ్గింది. 
► వరి, గోధుమ, ఇతర ధాన్యాల ధరలు పెరిగాయి.
► నూనె గింజలకు సంబంధించి ద్రవ్యోల్బణం మైనస్‌ 5.36 శాతంగా, మినరల్స్‌కు సంబంధించి 3.86 శాతంగా ఉంది. 
► ఇంధనం, విద్యుత్‌ ద్రవ్యోల్బణం 23.17 శాతానికి పరిమితం కాగా, తయారీ ఉత్పత్తులపై టోకు ద్రవ్యోల్బణం 4.42 శాతంగా ఉంది.

చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్‌: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement