డీజిల్ అమ్మకాలు నవంబర్‌లో 7.5 శాతం మేర క్షీణించాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఉన్న 7.33 మిలియన్ టన్నుల నుంచి 6.78 మిలియన్ టన్నుల విక్రయాలకు పరిమితమయ్యాయి. దీపావళి సందర్భంగా కొందరు ట్రక్ డ్రైవర్లు విరామం తీసుకుని, ఇళ్లకు వెళ్లిపోవడం వల్లే ఈ పరిణామం చోటు చేసుకున్నట్టు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఈ నెలలో విక్రయాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయని పేర్కొన్నారు. పెట్రోల్ ఇంధన అమ్మకాల్లో డీజిల్ వాటా 40 శాతం మేర ఉంటుంది. 70 శాతం మేర డీజిల్‌ను రవాణా రంగం వినియోగిస్తుంటుంది. మూడు ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థల ద్వారా పెట్రోల్ అమ్మకాలు నవంబర్ నెలలో 7.5 శాతం పెరిగి 2.86 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. పండుగల సమయంలో వ్యక్తిగత వాహనాల వినియోగం పెరగడం ఇందుకు మద్దతుగా నిలిచింది. డీజిల్ డిమాండ్ నవంబర్ మొదటి 15 రోజుల్లో 12.1 శాతం క్షీణించగా, ఆ తర్వాత తిరిగి కోలుకుంది. అక్టోబర్‌లో మొదటి అర్ధభాగంలో పెట్రోల్ డిమాండ్ 9 శాతం తగ్గగా, అదే కాలంలో డీజిల్ అమ్మకాలు 3.2 శాతం క్షీణించాయి. ఆ తర్వాత దుర్గా పూజ, దసరా నవరాత్రుల సమయంలో డిమాండ్ మళ్లీ పుంజుకోవడం గమనార్హం. ఇక నెలవారీగా చూస్తే, అక్టోబర్ కంటే నవంబర్‌లో డీజిల్ అమ్మకాలు 3.6 శాతం అధికంగా నమోదయ్యాయి. ఏటా వర్షాకాలంలో మూడు నెలల పాటు డీజిల్ అమ్మకాలు క్షీణించడం సాధారణంగా కనిపిస్తుంటుంది. వర్షాకాలం ముగిసిన తర్వాత అమ్మకాలు తిరిగి పుంజుకోవడాన్ని గమనించొచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో 6.7 శాతం, మే నెలలో 9.3 శాతం మేర డీజిల్ అమ్మకాలు పెరిగినట్టు గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది.
ఏటీఎఫ్ అమ్మకాల్లోనూ సానుకూలత
ఇక విమానయాన ఇంధన అమ్మకాలు (ఏటీఎఫ్) నవంబర్ నెలలో 6,20,000 టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలతో పోలిస్తే 6.1 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. 2021 నవంబర్ నెల అమ్మకాలతో పోలిస్తే 31.6 శాతం పెరిగాయి. కరోనా ముందు సంవత్సరం 2019 నవంబర్ నెలలో అమ్మకాలు 6,70,000 టన్నులతో పోలిస్తే ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో ఏటీఎఫ్ అమ్మకాలు 6,11,300 టన్నులుగా ఉన్నాయి. ఎల్‌పీజీ (వంటగ్యాస్) విక్రయాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 0.9 శాతం తక్కువగా 2.57 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. అక్టోబర్‌లో నమోదైన 2.52 మిలియన్ టన్నులతో పోలిస్తే 2 శాతం పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment