న్యూఢిల్లీ: ప్రముఖ కేన్సర్ ఔషధం డినుటుక్సిమాబ్‌ను వ్యక్తులు దిగుమతి చేసుకుంటే దానిపై 12 శాతం ఐజీఎస్‌టీని మినహాయించే ప్రతిపాదనను జీఎస్‌టీ కౌన్సిల్ పరిశీలించనుంది. ఈ నెల 11న సమావేశం కానున్న జీఎస్‌టీ కౌన్సిల్ దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది.
అలాగే, మల్టీప్లెక్స్‌లలో ఆహారం, పానీయాల విక్రయాలపై 5 శాతం జీఎస్‌టీ అంశాన్ని కూడా తేల్చనుంది. 18 శాతం కాకుండా రెస్టారెంట్ సర్వీస్ మాదిరే 5 శాతం పన్నును అమలు చేయాలని ఫిట్‌మెంట్ కమిటీ సిఫారసు చేయడం గమనార్హం. ప్రస్తుతం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా రేటు అమలు చేస్తుండడం గమనించొచ్చు. యుటిలిటీ వాహనాలపై 22 శాతం కాంపన్సేషన్ సెస్సు వేటికి వర్తించనుందనేది కూడా స్పష్టత రానుంది.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్‌టీ కౌన్సిల్, ప్రైవేటు సంస్థలు ప్రారంభించే శాటిలైట్ సేవలపై జీఎస్‌టీ మినహాయింపు ప్రతిపాదనపైనా నిర్ణయం తీసుకోనుంది. అరుదైన
వ్యాధుల చికిత్సలో భాగంగా దిగుమతి చేసుకునే ప్రత్యేక ఔషధాలు, ఔషధాల తయారీలో వినియోగించే ఆహారం (ఎఫ్‌ఎస్‌ఎంపీ)పై ప్రస్తుతం ఇంటెగ్రేటెడ్ జీఎస్‌టీ (ఐజీఎస్‌టీ) 5–12 శాతం మధ్య ఉంది. ఇవి ఖరీదైన మందులు కావడంతో రోగులపై ఎంతో భారం పడుతోంది. దీంతో ఐజీఎస్‌టీని మినహాయించాలనే అభ్యర్థన కౌన్సిల్ ముందుకు రానుంది. కేంద్ర, రాష్ట్రాల పన్నుల అధికారులతో కూడిన ఫిట్‌మెంట్ కమిటీ ఈ అంశాలపై కౌన్సిల్‌కు మంగళవారం నాటి సమావేశంలో స్పష్టత ఇవ్వనుంది. ఆన్‌లైన్ గేమింగ్‌పై మంత్రుల గ్రూప్ నివేదిక, అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటుపైనా కౌన్సిల్ చర్చించనుంది. 11 పర్వత ప్రాంతాల రాష్ట్రాలకు బడ్జెటరీ మద్దతు కింద సీజీఎస్‌టీని పూర్తి మేర, ఐజీఎస్‌టీలో 50 శాతం రీయింబర్స్‌మెంట్ (తిరిగి చెల్లించడం) ఇవ్వాలనే డిమాండ్‌పై చర్చించనున్నట్టు తెలుస్తోంది.
కార్లపై స్పష్టత
ప్రస్తుతం స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్‌యూవీ)పై 28 శాతం జీఎస్‌టీకి అదనంగా 22 శాతం కాంపెన్సేషన్ సెస్సు అమల్లో ఉంది. కానీ, అన్ని రకాల యుటిలిటీ వాహనాలు అంటే..ఎస్‌యూవీలతోపాటు మల్టీ యుటిలిటీ వెహికల్స్ (ఎంయూవీ), క్రాసోవర్ యుటిలిటీ వెహికల్స్ (ఎక్స్‌యూవీ)పైనా 22 శాతం కాంపెన్సేషన్ సెస్సు అమలు చేయాలంటూ ఫిట్‌మెంట్ కమిటీ సిఫారసు చేసింది. 4 మీటర్ల పొడవు, 1,500సీసీకి మించిన ఇంజన్ సామర్థ్యం, 170ఎంఎం కంటే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న వాటికి ఈ సెస్సును అమలు చేయాలని సూచించింది.
డినుటుక్సిమ్యాబ్ ఔషధం ఖరీదు రూ.36 లక్షలుగా ఉండడంతో, రోగులు క్రౌడ్‌ఫండింగ్ సాయం ద్వారా దిగుమతి చేసుకోవాల్సి వస్తుందంటూ, ఐజీఎస్‌టీని మినహాయించాలని ఫిట్‌మెంట్ కమిటీ సిఫారసు చేసింది.
ప్రభుత్వరంగ సంస్థలైన ఇస్రో, యాంత్రిక్స్ కార్పొరేషన్ (ఏసీఎల్), న్యూ స్పేస్ ఇండియా (ఎన్‌ఎస్‌ఐఎల్)ను జీఎస్‌టీ నుంచి మినహాయించి, ప్రైవేటు సంస్థలు చేసే శాటిలైట్ ప్రయోగ సేవలపై 18 శాతం జీఎస్‌టీ విధించాలనే ప్రతిపాదన కూడా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment