cancer medicine
-
జీఎస్టీ తగ్గింపు.. కౌన్సిల్ కీలక నిర్ణయాలు
జీఎస్టీ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొన్ని క్యాన్సర్ మందులపై రేట్లను తగ్గించాలని కౌన్సిల్ నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక వైద్య ఆరోగ్య బీమాపై రేటు తగ్గింపు అంశం వాయిదా పడింది. నవంబర్‌లో జరిగే తదుపరి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆమె తెలిపారు.జీఎస్టీ కౌన్సిల్ 54వ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సీతారామన్.. కొన్ని క్యాన్సర్ ఔషధాలపై జీఎస్టీ రేట్లను 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించినట్లు చెప్పారు. అలాగే నామ్కీన్ స్నాక్స్పైన కూడా జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించినట్లు వెల్లడించారు. రీసెర్చ్ ఫండ్‌పై జీఎస్టీ మినహాయిస్తూ నిర్ణయం తీసుకోగా కారు సీట్లపై జీఎస్టీని 18 నుంచి 28 శాతానికి పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది.గత ఆరు నెలల్లో ఆన్లైన్ గేమింగ్ ద్వారా వచ్చే ఆదాయం 412 శాతం పెరిగి రూ. 6,909 కోట్లకు చేరుకుందని ఆర్థిక మంత్రి తెలిపారు. దీంతో పాటు గత ఆరు నెలల్లో క్యాసినోల ద్వారా ఆదాయం 34 శాతం పెరిగిందన్నారు. ఆరోగ్య బీమాపై జీఎస్టీ రేటు తగ్గింపుపై కొత్త మంత్రివర్గ కమిటీ ఏర్పాటు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిందని, ఇది అక్టోబర్ చివరి నాటికి తమ నివేదికను సమర్పిస్తుందని సీతారామన్ చెప్పారు. -
GST Council : సినిమా హాళ్లలో తినుబండారాలపై జీఎస్టీ మోత!
న్యూఢిల్లీ: ప్రముఖ కేన్సర్ ఔషధం డినుటుక్సిమాబ్ను వ్యక్తులు దిగుమతి చేసుకుంటే దానిపై 12 శాతం ఐజీఎస్టీని మినహాయించే ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ పరిశీలించనుంది. ఈ నెల 11న సమావేశం కానున్న జీఎస్టీ కౌన్సిల్ దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. అలాగే, మల్టీప్లెక్స్‌లలో ఆహారం, పానీయాల విక్రయాలపై 5 శాతం జీఎస్టీ అంశాన్ని కూడా తేల్చనుంది. 18 శాతం కాకుండా రెస్టారెంట్ సర్వీస్ మాదిరే 5 శాతం పన్నును అమలు చేయాలని ఫిట్మెంట్ కమిటీ సిఫారసు చేయడం గమనార్హం. ప్రస్తుతం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా రేటు అమలు చేస్తుండడం గమనించొచ్చు. యుటిలిటీ వాహనాలపై 22 శాతం కాంపన్సేషన్ సెస్సు వేటికి వర్తించనుందనేది కూడా స్పష్టత రానుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్, ప్రైవేటు సంస్థలు ప్రారంభించే శాటిలైట్ సేవలపై జీఎస్టీ మినహాయింపు ప్రతిపాదనపైనా నిర్ణయం తీసుకోనుంది. అరుదైన వ్యాధుల చికిత్సలో భాగంగా దిగుమతి చేసుకునే ప్రత్యేక ఔషధాలు, ఔషధాల తయారీలో వినియోగించే ఆహారం (ఎఫ్ఎస్ఎంపీ)పై ప్రస్తుతం ఇంటెగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) 5–12 శాతం మధ్య ఉంది. ఇవి ఖరీదైన మందులు కావడంతో రోగులపై ఎంతో భారం పడుతోంది. దీంతో ఐజీఎస్టీని మినహాయించాలనే అభ్యర్థన కౌన్సిల్ ముందుకు రానుంది. కేంద్ర, రాష్ట్రాల పన్నుల అధికారులతో కూడిన ఫిట్మెంట్ కమిటీ ఈ అంశాలపై కౌన్సిల్‌కు మంగళవారం నాటి సమావేశంలో స్పష్టత ఇవ్వనుంది. ఆన్లైన్ గేమింగ్‌పై మంత్రుల గ్రూప్ నివేదిక, అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటుపైనా కౌన్సిల్ చర్చించనుంది. 11 పర్వత ప్రాంతాల రాష్ట్రాలకు బడ్జెటరీ మద్దతు కింద సీజీఎస్టీని పూర్తి మేర, ఐజీఎస్టీలో 50 శాతం రీయింబర్స్మెంట్ (తిరిగి చెల్లించడం) ఇవ్వాలనే డిమాండ్‌పై చర్చించనున్నట్టు తెలుస్తోంది. కార్లపై స్పష్టత ప్రస్తుతం స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ)పై 28 శాతం జీఎస్టీకి అదనంగా 22 శాతం కాంపెన్సేషన్ సెస్సు అమల్లో ఉంది. కానీ, అన్ని రకాల యుటిలిటీ వాహనాలు అంటే..ఎస్‌యూవీలతోపాటు మల్టీ యుటిలిటీ వెహికల్స్ (ఎంయూవీ), క్రాసోవర్ యుటిలిటీ వెహికల్స్ (ఎక్స్‌యూవీ)పైనా 22 శాతం కాంపెన్సేషన్ సెస్సు అమలు చేయాలంటూ ఫిట్మెంట్ కమిటీ సిఫారసు చేసింది. 4 మీటర్ల పొడవు, 1,500సీసీకి మించిన ఇంజన్ సామర్థ్యం, 170ఎంఎం కంటే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న వాటికి ఈ సెస్సును అమలు చేయాలని సూచించింది. డినుటుక్సిమ్యాబ్ ఔషధం ఖరీదు రూ.36 లక్షలుగా ఉండడంతో, రోగులు క్రౌడ్‌ఫండింగ్ సాయం ద్వారా దిగుమతి చేసుకోవాల్సి వస్తుందంటూ, ఐజీఎస్టీని మినహాయించాలని ఫిట్మెంట్ కమిటీ సిఫారసు చేసింది. ప్రభుత్వరంగ సంస్థలైన ఇస్రో, యాంత్రిక్స్ కార్పొరేషన్ (ఏసీఎల్), న్యూ స్పేస్ ఇండియా (ఎన్ఎస్ఐఎల్)ను జీఎస్టీ నుంచి మినహాయించి, ప్రైవేటు సంస్థలు చేసే శాటిలైట్ ప్రయోగ సేవలపై 18 శాతం జీఎస్టీ విధించాలనే ప్రతిపాదన కూడా ఉంది. చదవండి : విడుదల కాకుండానే..మెటా ‘థ్రెడ్స్’కు ఎదురు దెబ్బ! -
కేన్సర్ ఔషధాల ధరల తగ్గింపు!
సాక్షి, హైదరాబాద్: యాంటి కేన్సర్ ఔషధాల ధరలను మరోసారి తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు నేషనల్ ఫార్మస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఈ ఏడాది మార్చి, మే నెలల్లో రెండు దఫాల్లో 399 రకాల కేన్సర్ ఔషధాల ధరలను భారీగా తగ్గించింది. ఒక్కో మందు ధర 60–87 శాతానికి తగ్గింది. ఇప్పుడు ఈ జాబితాలో మరిన్ని మందులను చేర్చాలని కేంద్రం నిర్ణయించింది. త్వరలోనే ధరలు తగ్గనున్న మందుల జాబితాను విడుదల చేయనున్నట్టు ఎన్పీపీఏ అధికారులు తెలిపారు. ఇటీవల కీమో థెరఫీ చికిత్సలో వినియోగించే 9 రకాల డ్రగ్స్ ధరలను ఎన్పీపీఏ తగ్గించగా, కొత్త ధరకు పాత ధరకు భారీ వ్యత్యాసం కనిపించింది. ఇందులో ఊపిరితిత్తుల కేన్సర్‌కు సంబంధించిన ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. కొత్త ధరల ప్రకారం పెమెట్రెక్సెడ్ 500ఎంజీ ఇంజక్షన్ రూ.2,800లకు లభిస్తోంది. గతంలో దీని ధర రూ.22,000 ఉండేది. 100 ఎంజీ ఇంజక్షన్ ధర రూ.7,700 నుంచి రూ.800లకు తగ్గింది. ఎపిక్లర్ బ్రాండ్ 10 ఎంజీ ఇంజెక్షన్ ధర రూ.561 నుంచి రూ.276కు.. 50 ఎంజీ ఇంజెక్షన్ ధర రూ.2,662 నుంచి రూ.960కు దిగింది. దీంతో పాటు ఎర్లో టినిబ్ 100 ఎంజీ టాబ్లెట్స్ (30 టాబ్లెట్ల ప్యాక్) ధర రూ.6,600 నుంచి రూ.1,840కు.. 150ఎంజీ ట్యాబ్లెట్ రూ.8,800 నుంచి రూ.2400లకు తగ్గింది. లానోలిమస్ బ్రాండ్ సైతం రూ.726 నుంచి రూ.406కు దిగివచ్చింది. మరిన్ని రకాల ఔషధాల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. -
చైనా మనసు మార్చిన సినిమా..!
బీజింగ్ : ఓ సినిమా చైనా అధికారుల మనసు మార్చినట్టు కనబడుతోంది. చైనాలో ఇటీవల విడుదలైన డైయింగ్ టు సర్వైవ్ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. అంతేకాకుండా ఫార్మా దిగుమతుల్లో చైనా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో మార్పులకు కారణమైంది. చైనా ప్రభుత్వ తాజా ప్రకటనే ఇందుకు నిదర్శనం. భారత్‌లో తయారుచేసే మెడిసిన్‌ను దిగుమతి చేసుకునేందుకు మార్గం సుగమం చేసుకోవాలని భావిస్తున్నట్టు చైనా సోమవారం ప్రకటించింది. ముఖ్యంగా భారత్ నుంచి దిగుమతి చేసుకునే క్యాన్సర్ నిరోధక మందులకు విస్తృత మార్కెట్ కల్పించనున్నట్టు తెలిపింది. కాగా, డైయింగ్ టు సర్వైవ్ చిత్రంలో లూకేమియాతో బాధపడుతున్న ఓ పేషెంట్ భారత్ నుంచి తక్కువ ధరకు దొరికే జౌషధాలు దిగుమతి చేసుకోవాల్సిన అవసరాన్ని చెప్పారు. చైనా విదేశాంగ అధికార ప్రతినిధి హువా చునింగ్ మాట్లాడుతూ.. మెడిసిన్ దిగుమతులపై పన్నులను తగ్గించడానికి చైనా, భారత్‌ల మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. ఫార్మా దిగుమతులను పెంచుకోవడం, వాటిపై పన్నుల భారాన్ని తగ్గించడం ద్వారా తమ మార్కెట్లో భారత్‌తో పాటు ఇతర దేశాలకు మంచి ఆవకాశం కల్పించినట్టు అవుతోందని పేర్కొన్నారు. అంతేకాకుండా చైనీస్ మూవీ డైయింగ్ టు సర్వైవ్ మూవీని ఆమె ప్రస్తావించారు. కాగా తమ మార్కెట్లో మెడిసిన్‌ను విక్రయించడానికి భారత కంపెనీలకు చైనా అనుమతిస్తుందనే విషయంలో మాత్రం ఆమె స్పష్టతనివ్వలేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే చైనా సెంట్రల్ టెలివిజన్ లెక్కల ప్రకారం చైనాలో ఏడాదికి 43 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. చైనా మిత్ర దేశాలు సరఫరా చేస్తున్న క్యాన్సర్ నిరోధక మందులతో పొల్చినప్పుడు తక్కువ ధరకు లభ్యమయ్యే భారత మెడిసిన్‌కు చైనాలో అధిక డిమాండ్ ఉంది. -
నాట్కో ’క్యాన్సర్’ ఔషధానికి ఎఫ్‌డీఏ ఆమోదం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బెండామస్టీన్ హైడ్రోక్లోరైడ్ పౌడర్ జనరిక్ వెర్షన్ తయారీకి అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ అనుమతులు లభిం చినట్లు నాట్కో ఫార్మా వెల్లడించింది. తీవ్రమైన లింఫోసైటిక్ ల్యూకేమియా తదితర క్యాన్సర్స్ చికిత్సలో ఉపయోగించే ఇంజెక్షన్లలో ఈ పౌడర్ వినియోగిస్తారు. దీంతో 2019 నవంబర్ 1 లేదా అంతకన్నా ముందే ఈ ఔషధాన్ని అమెరికా మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ పేర్కొంది. మార్కెటింగ్ భాగస్వామి బ్రెకెన్రిడ్జ్ ఫార్మాస్యూటికల్తో కలిసి దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు నాట్కో వివరించింది. ప్రస్తుతం ట్రెయాండా పేరుతో సెఫలాన్ సంస్థ (2011లో టెవా దీన్ని కొనుగోలు చేసింది) దీన్ని అమెరికా మార్కెట్లో విక్రయిస్తోంది. నవంబర్‌తో ముగిసిన పన్నెండు నెలల కాలంలో ఈ ఔషధ విక్రయాలు సుమారు 133 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఎఫ్‌డీఏ అనుమతులతో శుక్రవారం బీఎస్ఈలో నాట్కో ఫార్మా షేరు ధర దాదాపు నాలుగు శాతం పెరుగుదలతో రూ. 624 వద్ద ముగిసింది. -
తక్కువ ధరకు కేన్సర్ మందు
- అందుబాటులోకి తెచ్చేందుకు ఐఐసీటీ యత్నం హైదరాబాద్: పలు రకాల కేన్సర్లను సమర్థంగా నయం చేయగల ఓ మందును పేదలకూ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అన్నీ సవ్యంగా సాగితే మరో రెండేళ్లలో ఈ మందును ప్రస్తుత ధరలో మూడో వంతుకే అందించవచ్చునని ఐఐసీటీ డెరైక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ తెలిపారు. రసాయన పరిశోధనల రంగంలో సహజ వనరుల ఉపయోగం తీరుతెన్నులపై సోమవారం ఐఐసీటీలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కేన్సర్ చికిత్సకు సంబంధించి ఐఐసీటీ రెండు ఉత్పత్తులపై పనిచేస్తోందని, వేప నుంచి సేకరించిన నింబొలాయిడ్ అనే రసాయన మూలకంపై పేటెంట్ కూడా సాధించామని తెలిపారు. సముద్రపు స్పాంజ్ నుంచి సేకరించిన హీలోకాండ్రియన్ అనే మూలకంతో జపనీస్ ఫార్మా కంపెనీ ఒకటి రకరకాల కేన్సర్లకు విరుగుడు మందును తయారు చేసిందని, అయితే ఇది చాలా ఖరీదైందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో ఆ మందుపై 2018 నాటికి పేటెంట్ హక్కులు చెల్లిపోతాయి కాబట్టి ఆ వెంటనే దీన్ని అందరికీ అందుబాటు ధరలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. జపనీస్ కంపెనీ మందుకు ఇప్పటికే అన్ని అనుమతులు ఉన్నందున తాము అభివృద్ది చేసే మందుకు క్లినికల్ ట్రయల్స్ అవసరముండదని అన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బెడాక్విలిన్ను సరికొత్త పద్దతి ద్వారా చౌకగా తయారు చేసేందుకూ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. పైకప్పులకు చల్లటి పెయింట్... ఇళ్లలో ఉష్ణోగ్రతలను మూడు నుంచి ఎనిమిది డిగ్రీల వరకూ తగ్గించగలిగే సామర్థ్యమున్న వినూత్న రసాయనాన్ని తాము అభివృద్ది చేశామని, మరికొన్ని పరీక్షలు నిర్వహించిన తరువాత దీన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని ఐఐసీటీ డెరైక్టర్ తెలిపారు. పరిశోధన శాలలో జరిపిన ప్రయోగాల్లో ఈ రసాయనం సమర్థంగా పనిచేసిందని, నిజజీవిత పరిస్థితుల్లోనూ దీని పనితీరును మదింపు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. కాంక్రీట్ పైకప్పులతో మాత్రమే కాకుండా... పేదలు ఎక్కువగా వాడే అల్యూమినియం, ఆస్బెస్టాస్ షీట్లతోనూ ఇది బాగా పనిచేస్తుందని, కేవలం అర మిల్లీమీటర్ మందపు పూతతో ఇంటిలోపలి ఉష్ణోగ్రతలను గణనీయంగా తగ్గించవచ్చునని చెప్పారు.