తక్కువ ధరకు కేన్సర్ మందు
తక్కువ ధరకు కేన్సర్ మందు
Published Mon, Sep 19 2016 5:00 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
- అందుబాటులోకి తెచ్చేందుకు ఐఐసీటీ యత్నం
హైదరాబాద్: పలు రకాల కేన్సర్లను సమర్థంగా నయం చేయగల ఓ మందును పేదలకూ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అన్నీ సవ్యంగా సాగితే మరో రెండేళ్లలో ఈ మందును ప్రస్తుత ధరలో మూడో వంతుకే అందించవచ్చునని ఐఐసీటీ డెరైక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ తెలిపారు. రసాయన పరిశోధనల రంగంలో సహజ వనరుల ఉపయోగం తీరుతెన్నులపై సోమవారం ఐఐసీటీలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కేన్సర్ చికిత్సకు సంబంధించి ఐఐసీటీ రెండు ఉత్పత్తులపై పనిచేస్తోందని, వేప నుంచి సేకరించిన నింబొలాయిడ్ అనే రసాయన మూలకంపై పేటెంట్ కూడా సాధించామని తెలిపారు.
సముద్రపు స్పాంజ్ నుంచి సేకరించిన హీలోకాండ్రియన్ అనే మూలకంతో జపనీస్ ఫార్మా కంపెనీ ఒకటి రకరకాల కేన్సర్లకు విరుగుడు మందును తయారు చేసిందని, అయితే ఇది చాలా ఖరీదైందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో ఆ మందుపై 2018 నాటికి పేటెంట్ హక్కులు చెల్లిపోతాయి కాబట్టి ఆ వెంటనే దీన్ని అందరికీ అందుబాటు ధరలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. జపనీస్ కంపెనీ మందుకు ఇప్పటికే అన్ని అనుమతులు ఉన్నందున తాము అభివృద్ది చేసే మందుకు క్లినికల్ ట్రయల్స్ అవసరముండదని అన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బెడాక్విలిన్‌ను సరికొత్త పద్దతి ద్వారా చౌకగా తయారు చేసేందుకూ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
పైకప్పులకు చల్లటి పెయింట్...
ఇళ్లలో ఉష్ణోగ్రతలను మూడు నుంచి ఎనిమిది డిగ్రీల వరకూ తగ్గించగలిగే సామర్థ్యమున్న వినూత్న రసాయనాన్ని తాము అభివృద్ది చేశామని, మరికొన్ని పరీక్షలు నిర్వహించిన తరువాత దీన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని ఐఐసీటీ డెరైక్టర్ తెలిపారు. పరిశోధన శాలలో జరిపిన ప్రయోగాల్లో ఈ రసాయనం సమర్థంగా పనిచేసిందని, నిజజీవిత పరిస్థితుల్లోనూ దీని పనితీరును మదింపు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. కాంక్రీట్ పైకప్పులతో మాత్రమే కాకుండా... పేదలు ఎక్కువగా వాడే అల్యూమినియం, ఆస్‌బెస్టాస్ షీట్లతోనూ ఇది బాగా పనిచేస్తుందని, కేవలం అర మిల్లీమీటర్ మందపు పూతతో ఇంటిలోపలి ఉష్ణోగ్రతలను గణనీయంగా తగ్గించవచ్చునని చెప్పారు.
Advertisement