క్యాన్సర్ బాధితులకు శుభవార్త. త్వరలో వారికి ఈ వ్యాధి నుంచి విముక్తి లభించనుంది. క్యాన్సర్ డ్రగ్ డోస్టార్‌లిమాబ్‌కు అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) బ్రేక్‌త్రూ థెరపీ హోదాను మంజూరు చేసింది. దీంతో ఈ ఔషధం త్వరలోనే క్యాన్సర్ బాధితులకు అందుబాటులోకి రానుంది.
అత్యుత్తమ ఆశాజనక ఫలితాలను అందించిన డోస్టార్‌లిమాబ్‌ను విరివిగా మార్కెట్‌లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. డోస్టార్‌లిమాబ్ (బ్రాండ్ పేరు జెంపెర్లి)కు గత జూన్‌లో నిర్వహించిన ట్రయల్స్‌లో వందశాతం ఆశాజనక ఫలితాలు వచ్చాయని ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో పేర్కొన్నారు. ఈ డోస్టార్‌లిమాబ్ ఔషధం ప్రోగ్రామ్ చేసిన డెత్ రిసెప్టర్-1 (పీడీ-1)-బ్లాకింగ్ యాంటీబాడీ, శస్త్రచికిత్స, రేడియేషన్ చికిత్స లేదా కీమోథెరపీ అవసరం లేకుండా పేగు క్యాన్సర్ (Rectal Cancer)కణితులను పూర్తిగా నిర్మూలించింది. ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న ఇమ్యునోథెరపీ పేగు క్యాన్సర్ బాధితులను ఇతరత్రా సమస్యలకు గురిచేస్తోంది. సంతానోత్పత్తిని దెబ్బతీయడం లాంటి ప్రతికూల ఫలితాలు ఎదురవుతున్నాయి.
100 శాతం విజయవంతమైన ఫలితాలు
క్యాన్సర్ ఔషధం డోస్టార్‌లిమాబ్ క్లినికల్ ట్రయల్స్(Clinical trials)లో 100శాతం విజయవంతమైన ఫలితాలను అందించింది. దీర్ఘకాలిక ప్రతికూలతలను ఎదుర్కొనేందుకు అనువైన ఔషధంగానూ నిరూపితమయ్యింది. ఇప్పటివరకూ పేగు క్యాన్సర్ బాధితులకు అందిస్తున్న చికిత్స నమూనాను మార్చడంలో, సమర్థవంతమైన ఫలితాలను అందించడంలో డోస్టార్‌లిమాబ్ ఉత్తమంగా పనిచేస్తున్నదని గ్లాక్సో స్మిత్‌క్లైన్‌లోని పరిశోధన, అభివృద్ధి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హేషమ్ అబ్దుల్లా పేర్కొన్నారు.
ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు 1,516 అభ్యర్థనలు
క్యాన్సర్ చికిత్సపై పరిశోధనలు సాగిస్తున్న అమెరికాకు చెందిన గ్లాక్సో స్మిత్‌క్లైన్ (జీఎస్‌కే) ఇటీవల ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం క్యాన్సర్‌కు ఇక చికిత్స అందించలేని తీవ్రమైన పరిస్థితుల్లో ఉపయుక్తమయ్యేందుకు అనువైన ఔషధాల ఉత్పత్తికి సంబంధించి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు 1,516 అభ్యర్థనలు వచ్చాయి. వీటిని పరిశీలించిన అసంతరం 587 ఔషధ నమూనాలకు అనుమతి మంజూరయ్యింది. 30 నుంచి 40% అభ్యర్థనలకు ఆమోదం లభ్యమయ్యింది.
ఆంకాలజిస్టుల పర్యవేక్షణలో పరిశోధనలు
మెమోరియల్ స్లోన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్‌లో పేగు క్యాన్సర్ బాధితులపై డోస్టార్‌లిమాబ్ ఔషధ ప్రయోగాలు నిర్వహించారు. దీనిని ఆంకాలజిస్టులు నిశితంగా పరిశీలించారు. ఈ ఔషధం బాధితునిలోని క్యాన్సర్ కణితులను 100 శాతం నిర్మూలించిందని గుర్తించారు. ప్రారంభంలో 24 మంది రోగులపై ఈ ఔషధ ప్రయోగాలు చేశారు. క్లినికల్ ట్రయల్‌లో భాధితులలోని ప్రతీ ఒక్కరిపై ఈ ఔషధం అద్భుతంగా పనిచేసిందని ఎంఎస్‌కే గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఆంకాలజిస్ట్(Gastrointestinal Oncologist) ఆండ్రియా తెలిపారు. ఇప్పటివరకు మొత్తంగా 42 మంది బాధితులకు డోస్టార్‌లిమాబ్‌తో చికిత్స అందించగా,చికిత్స అనంతరం వారిలో వ్యాధికి సంబంధించిన ఆనవాళ్లు దూరమయ్యాయన్నారు. డోస్టార్‌లిమాబ్ వినియోగం వలన వచ్చే దుష్ప్రభావాలు చాలా తేలికపాటివి.. తట్టుకోగలిగేవని అన్నారు. ఈ నూతన చికిత్స అద్భుత ఫలితాలను అందించిదని తెలిపారు.
ఏడాది వ్యవధిలోనే క్యాన్సర్ నుండి విముక్తి
డోస్టార్‌లిమాబ్ ట్రయల్‌లో పాల్గొన్న బాధితుల్లోని చాలామంది ఏడాది వ్యవధిలోనే క్యాన్సర్ నుండి పూర్తి విముక్తి పొందారని, ఈ ట్రయల్స్ వందశాతం విజయమంతమయ్యాయని ఆంకాలజిస్ట్ ఆండ్రియా పేర్కొన్నారు. కాగా బ్రేక్‌త్రూ స్టేటస్ అనేది దోస్టార్‌లిమాబ్‌కు రెండవ ఎఫ్‌డీఏ హోదా. ఈ ఔషధం 2023, జనవరిలోనే ఫాస్ట్ ట్రాక్ హోదాను పొందింది. ఇప్పుడు డోస్టార్‌లిమాబ్ ట్రయల్ తదుపరి హోదాను కూడా దక్కించుకుంది. అమెరికాలో ప్రతీయేటా 46,220 మంది పేగు క్యాన్సర్ బారిపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి: Vikram Sarabhai: భారత అంతరిక్ష పరిశోధనలకు ఆద్యునిగా..
Comments
Please login to add a commentAdd a comment