నాట్కో ’క్యాన్సర్’ ఔషధానికి ఎఫ్‌డీఏ ఆమోదం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బెండామస్టీన్ హైడ్రోక్లోరైడ్ పౌడర్ జనరిక్ వెర్షన్ తయారీకి అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ అనుమతులు లభిం చినట్లు నాట్కో ఫార్మా వెల్లడించింది. తీవ్రమైన లింఫోసైటిక్ ల్యూకేమియా తదితర క్యాన్సర్స్ చికిత్సలో ఉపయోగించే ఇంజెక్షన్లలో ఈ పౌడర్ వినియోగిస్తారు. దీంతో 2019 నవంబర్ 1 లేదా అంతకన్నా ముందే ఈ ఔషధాన్ని అమెరికా మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ పేర్కొంది.
మార్కెటింగ్ భాగస్వామి బ్రెకెన్‌రిడ్జ్ ఫార్మాస్యూటికల్‌తో కలిసి దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు నాట్కో వివరించింది. ప్రస్తుతం ట్రెయాండా పేరుతో సెఫలాన్ సంస్థ (2011లో టెవా దీన్ని కొనుగోలు చేసింది) దీన్ని అమెరికా మార్కెట్లో విక్రయిస్తోంది. నవంబర్‌తో ముగిసిన పన్నెండు నెలల కాలంలో ఈ ఔషధ విక్రయాలు సుమారు 133 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఎఫ్‌డీఏ అనుమతులతో శుక్రవారం బీఎస్‌ఈలో నాట్కో ఫార్మా షేరు ధర దాదాపు నాలుగు శాతం పెరుగుదలతో రూ. 624 వద్ద ముగిసింది.