ఒక్క మెడిసిన్ రిజెక్ట్ అయినందుకు ఏకంగా 75% ఉద్యోగులను తొలగించింది ఓ అమెరికన్ ఔషధ సంస్థ. లైకోస్ థెరప్యూటిక్స్ అనే కంపెనీ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ చికిత్సలో ఉపయోగించే సైకోథెరపీ డ్రగ్ ఎండీఎంఏను తయారు చేసింది. దీన్ని యూఎస్ ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ ఆమోదానికి పంపగా తిరస్కరించింది.
ఎఫ్‌డీఏ ఎండీఎంఏ ఔషధాన్ని తిరస్కరించిన వారం రోజుల్లోనే తమ సిబ్బందిలో 75% మందిని తొలగిస్తున్నట్లు, కంపెనీ వ్యవస్థాపకుడు బోర్డు నుంచి వైదొలుగుతున్నట్లు లైకోస్ థెరప్యూటిక్స్ ప్రకటించింది. "మేము ఎఫ్‌డీఏ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాం. ఈ సరికొత్త ఔషధాన్ని మార్కెట్లోకి తీసుకురావడానికి మరింత కృషి చేస్తాం" అని బోర్డు ఛైర్మన్ జెఫ్ జార్జ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఎఫ్‌డీఏ తిరస్కరణ నిర్ణయాన్ని సీరియస్‌గా తీసుకున్న కంపెనీ తమ ఔషధానికి మళ్లీ ఎఫ్‌డీఏ ఆమోదం పొందేలా తీవ్ర ప్రయత్నాలను చేపట్టింది. క్లినికల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, ఏజెన్సీతో సమన్వయం సహా ఆ ప్రయత్నాలను పర్యవేక్షించడానికి జాన్సన్ & జాన్సన్ మాజీ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ హగ్‌ని నియమించింది. ఇప్పుడు లైకోస్‌లో సీనియర్ మెడికల్ అడ్వైజర్ అయిన హగ్, 17 ఏళ్లకు పైగా జాన్సన్ & జాన్సన్‌లో ఉన్నారు.
ఎఫ్‌డీఏ ఆమోదం కోసం తమ ఎండీఎంఏ ఔషధాన్ని మళ్లీ సమర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లైకోస్ తెలిపింది. అయితే ఇది ఎంత సమయం పడుతుందో అంచనా వేయలేదు. మరొక ఫేజ్ 3 అధ్యయనాన్ని నిర్వహించాలని ఎఫ్‌డీఏ కోరిందని కంపెనీ గతంలో చెప్పింది. సాధారణంగా ఇది పూర్తి చేయడానికి చాలా సంవత్సరాలు పడుతుంది.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ వెటరన్స్ అఫైర్స్ ప్రకారం, 2020లో దాదాపు 13 మిలియన్ల అమెరికన్లు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్‌ను కలిగి ఉన్నారు. దీని చికిత్స కోసం అతి తక్కువ ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. ఎఫ్‌డీఏ ఆమోదించిన రెండు మందులు ఉన్నప్పటికీ కొంత మంది రోగులకు అవి ప్రభావవంతంగా పనిచేయడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment