
ప్రతీకాత్మక చిత్రం
బీజింగ్ : ఓ సినిమా చైనా అధికారుల మనసు మార్చినట్టు కనబడుతోంది. చైనాలో ఇటీవల విడుదలైన డైయింగ్ టు సర్‌వైవ్ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. అంతేకాకుండా ఫార్మా దిగుమతుల్లో చైనా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో మార్పులకు కారణమైంది. చైనా ప్రభుత్వ తాజా ప్రకటనే ఇందుకు నిదర్శనం. భారత్‌లో తయారుచేసే మెడిసిన్‌ను దిగుమతి చేసుకునేందుకు మార్గం సుగమం చేసుకోవాలని భావిస్తున్నట్టు చైనా సోమవారం ప్రకటించింది. ముఖ్యంగా భారత్ నుంచి దిగుమతి చేసుకునే క్యాన్సర్ నిరోధక మందులకు విస్తృత మార్కెట్ కల్పించనున్నట్టు తెలిపింది. కాగా, డైయింగ్ టు సర్‌వైవ్ చిత్రంలో లూకేమియాతో బాధపడుతున్న ఓ పేషెంట్ భారత్ నుంచి తక్కువ ధరకు దొరికే జౌషధాలు దిగుమతి చేసుకోవాల్సిన అవసరాన్ని చెప్పారు.
చైనా విదేశాంగ అధికార ప్రతినిధి హువా చునింగ్ మాట్లాడుతూ.. మెడిసిన్ దిగుమతులపై పన్నులను తగ్గించడానికి చైనా, భారత్‌ల మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. ఫార్మా దిగుమతులను పెంచుకోవడం, వాటిపై పన్నుల భారాన్ని తగ్గించడం ద్వారా తమ మార్కెట్‌లో భారత్‌తో పాటు ఇతర దేశాలకు మంచి ఆవకాశం కల్పించినట్టు అవుతోందని పేర్కొన్నారు. అంతేకాకుండా చైనీస్ మూవీ డైయింగ్ టు సర్‌వైవ్ మూవీని ఆమె ప్రస్తావించారు.
కాగా తమ మార్కెట్‌లో మెడిసిన్‌ను విక్రయించడానికి భారత కంపెనీలకు చైనా అనుమతిస్తుందనే విషయంలో మాత్రం ఆమె స్పష్టతనివ్వలేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే చైనా సెంట్రల్ టెలివిజన్ లెక్కల ప్రకారం చైనాలో ఏడాదికి 43 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. చైనా మిత్ర దేశాలు సరఫరా చేస్తున్న క్యాన్సర్ నిరోధక మందులతో పొల్చినప్పుడు తక్కువ ధరకు లభ్యమయ్యే భారత మెడిసిన్‌కు చైనాలో అధిక డిమాండ్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment