Hua chunying
-
చర్చలు జరుగుతున్నాయి: చైనా
బీజింగ్: సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయేలా భారత్‌తో చర్చలు కొనసాగిస్తున్నామని చైనా పేర్కొంది. ఉద్రిక్తతలు చల్లారిపోయేలా ఇరు దేశాలు సంప్రదింపులు జరుపుతున్నాయని, త్వరలోనే ఇందుకు పరిష్కారం కనుగొంటామని తెలిపింది. ఈ మేరకు చైనా విదేశాంగ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ మాట్లాడుతూ.. ‘‘ చైనా- భారత్‌ల మధ్య దౌత్యపరమైన, మిలిటరీ స్థాయి చర్చలు జరుగుతున్నాయి. సరిహద్దు పరిస్థితులను చక్కదిద్దేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయి. ఇరు వర్గాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాల అమలుపై తదుపరి విధివిధానాలు ఆధారపడి ఉంటాయి’’అని పేర్కొన్నారు.(చదవండి: సరిహద్దుల్లో డ్రాగన్ మరో కుట్ర) కాగా ఈ ఏడాది జూన్‌లో గల్వాన్ లోయలో డ్రాగన్ ఆర్మీ దురాగతానికి సుమారు 20 మంది భారత జవాన్లు అమరులైన విషయం విదితమే. వాస్తవాధీన రేఖ వెంబడి యథాతథ స్థితిని మార్చేందుకు చైనా సైనికులు ప్రయత్నించగా, కల్నల్ సంతోష్ బాబు నేతృత్వంలోని భారత బృందం వారిని అడ్డుకుంది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో వీరు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆనాటి నుంచి తూర్పు లదాఖ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే 8 సార్లు మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయి. నవంబరు 6న చివరిసారిగా ఇరు దేశాల కార్‌్ప్స కమాండర్ స్థాయి అధికారులు భేటీ అయ్యారు. -
చైనా మనసు మార్చిన సినిమా..!
బీజింగ్ : ఓ సినిమా చైనా అధికారుల మనసు మార్చినట్టు కనబడుతోంది. చైనాలో ఇటీవల విడుదలైన డైయింగ్ టు సర్వైవ్ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. అంతేకాకుండా ఫార్మా దిగుమతుల్లో చైనా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో మార్పులకు కారణమైంది. చైనా ప్రభుత్వ తాజా ప్రకటనే ఇందుకు నిదర్శనం. భారత్‌లో తయారుచేసే మెడిసిన్‌ను దిగుమతి చేసుకునేందుకు మార్గం సుగమం చేసుకోవాలని భావిస్తున్నట్టు చైనా సోమవారం ప్రకటించింది. ముఖ్యంగా భారత్ నుంచి దిగుమతి చేసుకునే క్యాన్సర్ నిరోధక మందులకు విస్తృత మార్కెట్ కల్పించనున్నట్టు తెలిపింది. కాగా, డైయింగ్ టు సర్వైవ్ చిత్రంలో లూకేమియాతో బాధపడుతున్న ఓ పేషెంట్ భారత్ నుంచి తక్కువ ధరకు దొరికే జౌషధాలు దిగుమతి చేసుకోవాల్సిన అవసరాన్ని చెప్పారు. చైనా విదేశాంగ అధికార ప్రతినిధి హువా చునింగ్ మాట్లాడుతూ.. మెడిసిన్ దిగుమతులపై పన్నులను తగ్గించడానికి చైనా, భారత్‌ల మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. ఫార్మా దిగుమతులను పెంచుకోవడం, వాటిపై పన్నుల భారాన్ని తగ్గించడం ద్వారా తమ మార్కెట్లో భారత్‌తో పాటు ఇతర దేశాలకు మంచి ఆవకాశం కల్పించినట్టు అవుతోందని పేర్కొన్నారు. అంతేకాకుండా చైనీస్ మూవీ డైయింగ్ టు సర్వైవ్ మూవీని ఆమె ప్రస్తావించారు. కాగా తమ మార్కెట్లో మెడిసిన్‌ను విక్రయించడానికి భారత కంపెనీలకు చైనా అనుమతిస్తుందనే విషయంలో మాత్రం ఆమె స్పష్టతనివ్వలేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే చైనా సెంట్రల్ టెలివిజన్ లెక్కల ప్రకారం చైనాలో ఏడాదికి 43 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. చైనా మిత్ర దేశాలు సరఫరా చేస్తున్న క్యాన్సర్ నిరోధక మందులతో పొల్చినప్పుడు తక్కువ ధరకు లభ్యమయ్యే భారత మెడిసిన్‌కు చైనాలో అధిక డిమాండ్ ఉంది. -
సీతారామన్ ‘పర్యటన’పై చైనా అభ్యంతరం
బీజింగ్: భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరుదేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్న ప్రాంతంలో ఆమె పర్యటన వల్ల శాంతికి విఘాతం కలుగుతుందని వ్యాఖ్యానించింది. బలగాల సన్నద్ధతను తెల్సుకునేందుకు ఆ రాష్ట్రంలోని అంజా జిల్లాలోని సైనికస్థావరాలను ఆదివారం నిర్మల సందర్శించారు. ఈ విషయమై చైనా విదేశాంగ అధికార ప్రతినిధి హువా చునింగ్ మీడియాతో మాట్లాడుతూ..‘అరుణాచల్‌ప్రదేశ్‌లో భారత రక్షణ మంత్రి పర్యటిస్తున్నారు అంటే అక్కడ చైనా స్థానమేంటో మీరు స్పష్టంగా తెల్సుకోవాలి. భారత్–చైనాల మధ్య తూర్పు సరిహద్దు వివాదాస్పద ప్రాంతంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. -
అమెరికా తటస్థంగా ఉండాలి: చైనా
బీజింగ్: దక్షిణ చైనా సముద్రం విషయంలో తటస్థంగా ఉండాలని అమెరికాకు చైనా సూచించింది. చైనా విదేశాంగ అధికార ప్రతినిథి చున్యింగ్ మాట్లాడుతూ.. సముద్రజలాలకు సంబంధించి పొరుగుదేశాలతో చైనాకు ఉన్నటువంటి విభేదాల విషయంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తటస్థంగా ఉండాలని కోరారు. సమస్య పరిష్కారంలో అమెరికా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని చున్యింగ్ అభ్యర్థించారు. దక్షిణ చైనా సముద్రం విషయంలో హేగ్‌లోని పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేజ్ వెల్లడించిన తీర్పును సమర్థిస్తూ.. దానికి కట్టుబడాలని ఒబామా గురువారం స్పష్టం చేసిన నేపథ్యంలో చైనా ఈ ప్రకటన చేయడం విశేషం. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కొనసాగేందుకు అమెరికా నుంచి సానుకూల, నిర్మాణాత్మకమైన ప్రయత్నాలను చైనా ఆశిస్తుందని చున్యింగ్ తెలిపారు. దక్షిణ చైనా సముద్రం విషయంలో జులైలో ఫిలిప్పీన్స్‌కు అనుకూలంగా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేజ్ ఇచ్చిన తీర్పును చెల్లనిదిగా, చట్ట వ్యతిరేకమైనదిగా చైనా అభివర్ణించింది. అసలు ఈ వివాదం కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేజ్ పరిధిలోనిది కాదని చైనా వాదిస్తోంది. ప్రాదేశిక వివాదాల్లో సంబంధిత దేశాల మధ్య చర్చలకే అమెరికా మద్దతిస్తుందని గతంలో అమెరికా అధికారులు వెల్లడించిన విషయాన్ని ఈ సందర్భంగా చున్యుంగ్ గుర్తుచేశారు. -
దక్షిణ చైనా సముద్రంలో అంతా ప్రశాంతమే
బీజింగ్: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో రాకపోకలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలను చైనా తిప్పికొట్టింది. ఆ జలాల్లో స్వేచ్ఛా యానం ఎప్పుడూ సమస్య కాలేదని, దీనిపై సమస్యలున్న వాళ్లు సంబంధిత పక్షాలతో చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చునని వ్యాఖ్యానించింది. భారత పర్యటన సందర్భంగా ఒబామా ఈ అంశాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో భారత్ కీలక పాత్ర పోషించాలని, స్వేచ్ఛా యానంపై వివాదాలు పరిష్కారం కావాలని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో చైనా ఘాటుగా స్పందించింది. ‘సాధారణంగా దక్షిణ చైనా సముద్రంలో పరిస్థితి ఎప్పుడూ నిలకడగా ఉంటుంది. అక్కడ శాంతి పరిరక్షణకు సంయుక్తంగా కృషి చేయాలని ఆసియా న్ దేశాలు, చైనాకు మధ్య అవగాహన ఉంది. స్వేచ్ఛా నౌకాయానం, గగనతల విహారం విషయంలో ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు.’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ వెల్లడించారు.