అమెరికా తటస్థంగా ఉండాలి: చైనా
బీజింగ్: దక్షిణ చైనా సముద్రం విషయంలో తటస్థంగా ఉండాలని అమెరికాకు చైనా సూచించింది. చైనా విదేశాంగ అధికార ప్రతినిథి చున్‌యింగ్ మాట్లాడుతూ.. సముద్రజలాలకు సంబంధించి పొరుగుదేశాలతో చైనాకు ఉన్నటువంటి విభేదాల విషయంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తటస్థంగా ఉండాలని కోరారు. సమస్య పరిష్కారంలో అమెరికా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని చున్‌యింగ్ అభ్యర్థించారు. దక్షిణ చైనా సముద్రం విషయంలో హేగ్‌లోని పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేజ్ వెల్లడించిన తీర్పును సమర్థిస్తూ.. దానికి కట్టుబడాలని ఒబామా గురువారం స్పష్టం చేసిన నేపథ్యంలో చైనా ఈ ప్రకటన చేయడం విశేషం.
దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కొనసాగేందుకు అమెరికా నుంచి సానుకూల, నిర్మాణాత్మకమైన ప్రయత్నాలను చైనా ఆశిస్తుందని చున్యింగ్ తెలిపారు. దక్షిణ చైనా సముద్రం విషయంలో జులైలో ఫిలిప్పీన్స్‌కు అనుకూలంగా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేజ్ ఇచ్చిన తీర్పును చెల్లనిదిగా, చట్ట వ్యతిరేకమైనదిగా చైనా అభివర్ణించింది. అసలు ఈ వివాదం కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేజ్ పరిధిలోనిది కాదని చైనా వాదిస్తోంది. ప్రాదేశిక వివాదాల్లో సంబంధిత దేశాల మధ్య చర్చలకే అమెరికా మద్దతిస్తుందని గతంలో అమెరికా అధికారులు వెల్లడించిన విషయాన్ని ఈ సందర్భంగా చున్‌యుంగ్ గుర్తుచేశారు.