వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో రాకపోకలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలను చైనా తిప్పికొట్టింది.
బీజింగ్: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో రాకపోకలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలను చైనా తిప్పికొట్టింది. ఆ జలాల్లో స్వేచ్ఛా యానం ఎప్పుడూ సమస్య కాలేదని, దీనిపై సమస్యలున్న వాళ్లు సంబంధిత పక్షాలతో చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చునని వ్యాఖ్యానించింది. భారత పర్యటన సందర్భంగా ఒబామా ఈ అంశాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే.
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో భారత్ కీలక పాత్ర పోషించాలని, స్వేచ్ఛా యానంపై వివాదాలు పరిష్కారం కావాలని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో చైనా ఘాటుగా స్పందించింది. ‘సాధారణంగా దక్షిణ చైనా సముద్రంలో పరిస్థితి ఎప్పుడూ నిలకడగా ఉంటుంది. అక్కడ శాంతి పరిరక్షణకు సంయుక్తంగా కృషి చేయాలని ఆసియా న్ దేశాలు, చైనాకు మధ్య అవగాహన ఉంది. స్వేచ్ఛా నౌకాయానం, గగనతల విహారం విషయంలో ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు.’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ వెల్లడించారు.