- 192 రకాల మందులు తగ్గించిన ఎన్‌పీపీఏ
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా భారీగా మందుల ధరలను తగ్గిస్తూ ఎన్‌పీపీఏ (నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ) తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు ధరలు తగ్గించిన మందుల జాబితాను పంపించింది. మందుల ధరలు ఆకాశాన్ని తాకుతుండటం, ఇప్పటి వరకూ జనరిక్ డ్రగ్‌స అందరికీ అందుబాటులోకి రాకపోవడం వంటి కారణాలతో పేద రోగులు విలవిల్లాడుతున్నారు. ముఖ్యంగా బ్రాండెడ్ డ్రగ్‌స పరిస్థితి దారుణంగా ఉంది. దీంతో ఎన్‌పీపీఏ ధరల తగ్గింపు నిర్ణయం తీసుకుంది. మొత్తం 192 రకాల మందుల ధరలను తగ్గించింది. ఫలానా మందు ఇంత ధరకే అమ్మాలని ధరల సీలింగ్‌ను నిర్ణయించింది. ఈ నిర్ణయం 45 రోజుల్లోగా అమల్లోకి రావాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసింది.
తగ్గించిన ధరలను అందుబాటులోకి తెచ్చే బాధ్యత రాష్ట్రాల ఔషధ నియంత్రణ శాఖలదేనని సూచించింది. ఎక్కువ మందులు 20 నుంచి 30 శాతం తగ్గాయి. జాతీయ మందుల ధరల నియంత్రణ సంస్థ తగ్గించిన మందుల్లో ఎక్కువగా యాంటీబయోటిక్స్, ఐవీఫ్లూయిడ్స్ మందులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కువగా వినియోగంలో ఉన్నది కూడా ఈ మందులే. క్యాన్సర్ నివారణ, యాంటీ ఫంగల్ మందుల ధరలు కూడా భారీగా తగ్గాయి. దేశవ్యాప్తంగా డయాబెటిక్ రోగుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో యాంటీ డయాబెటిక్ మందుల ధరలనూ తగ్గించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుమారు 60 వేల వరకూ మందుల షాపులున్నాయి. వీటన్నిటిలోనూ ఎన్‌పీపీఏ తగ్గించిన మందుల ధరలను అందుబాటులోకి తేవాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాల ఔషధ నియంత్రణ శాఖలే చూసుకోవాలి.