ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ ప్రతిపాదన
న్యూఢిల్లీ: ఫార్మా రంగానికి ఉన్న ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో దాని కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది. దీని గురించి ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నట్లు ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంత్ కుమార్ గురువారం తెలిపారు. కొత్త శాఖ ఫార్మా పరిశ్రమ బాగోగులు చూడటంతో పాటు నియంత్రణ సంస్థగా కూడా పనిచేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు.
నైపుణ్యాల అభివృద్ధి కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసినట్లే ఫార్మా కోసం కూడా ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరనున్నట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం దేశీ ఫార్మా రంగం విలువ దాదాపు రూ. 1.8 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. కొత్త ఔషధాలు, క్లినికల్ ట్రయల్స్, ఫార్మా దిగుమతులు మొదలైన వాటిని ఆమోదించడం తదితర అంశాలను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీసీఎస్‌వో), డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) పర్యవేక్షిస్తున్నాయి.
ఇవి రెండూ ఆరోగ్య శాఖ పరిధిలో ఉన్నాయి. వీటితో పాటు ఔషధాల ధరల నియంత్రణకు సంబంధించి నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) ఉంది. ఈ మూడింటిని కూడా కొత్త శాఖ కిందకు చేర్చే అవకాశం ఉందని, వైద్య పరికరాల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పర్చిన పక్షంలో దాన్ని కూడా ఇందులోకే తేవొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఔషధాలపై యాప్..: ఔషధాల ధరలు, లభ్యత తదితర అంశాల గురించి సమాచారం అందించడానికి, అలాగే కొనుగోలుదారుల ఫిర్యాదుల పరిష్కారానికి కొత్త యాప్‌ను ప్రవేశపెట్టనున్నట్లు అనంత్ కుమార్ వివరించారు. ఔషధ కొనుగోలుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ‘ఫార్మా జన సమాధాన్’ వెబ్ పోర్టల్‌ను ఆవిష్కరించిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు.
ఫార్మా కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ!
Published Fri, Mar 13 2015 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 10:43 PM
Advertisement
Advertisement