‘స్టెంట్ల’ లాభాలు వింటే గుండె ఆగాల్సిందే
‘స్టెంట్ల’ లాభాలు వింటే గుండె ఆగాల్సిందే
Published Tue, Jan 24 2017 3:37 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM
గతంలోకన్నా ఇప్పుడు గుండె జబ్బులు పెరిగాయో, లేదో గానీ ఛాతి నొప్పంటూ ఆస్పత్రికి వెళితే చాలు ఎడా పెడా ‘స్టెంట్లు’ వేసేస్తున్నారు డాక్టర్లు. స్టెంట్లలో లాభాల మార్జిన్ ఎక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. వాటి తయారీ కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు, ఆస్పత్రులకు లేదా డాక్టర్లకు స్టెంట్లలో వచ్చే లాభం ఎంతో తెలిస్తే ఆరోగ్యంగా ఉన్న వాళ్లకు కూడా గుండెపోటు రావాల్సిందే.
స్టెంట్లు డిస్ట్రిబ్యూటర్ దగ్గరి నుంచి రోగి వద్దకు వెళ్లేసరికి ఉత్పాదక ధర నుంచి 892 శాతం పెరుగుతోంది. ఇందులో ఆస్పత్రులకు లభించే మార్జినే 654 శాతం అంటే అవి ఎంతటి దారుణ వ్యాపారం చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఔషధాన్ని విడుదల చేసే స్టెంట్లలో (డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్) ఒక్కదాన్ని తయారు చేసేందుకు ఉత్పత్తిదారుడికి 40,820 రూపాయలు అవుతుంటే అది ఆస్పత్రిలో రోగికి 1,98,000 రూపాయలకు చేరుతోంది. అది ఎలాగంటే ఉత్పత్తిదారుడికి ఒక్కో స్టెంట్‌కు 40,820 రూపాయలు పడుతుంటే అది డిస్ట్రిబ్యూటర్ వద్దకు 1,01,000 రూపాయలకు, అక్కడి నుంచి ఆస్పత్రులకు 1,70,000 రూపాయలకు, అక్కడి నుంచి రోగికి 1,98,000 రూపాయలకు చేరుతోంది.
అడ్డూ అదుపు లేకుండా సాగుతున్న ఈ స్టెంట్ల వ్యాపారాన్ని నియంత్రించేందుకు ‘ధరల నియంత్రణా వ్యవస్థ’ పరిధిలోకి వీటిని తీసుకురావాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఇందులో స్టేక్ హోల్డర్లకు కేంద్ర ఫార్మాస్యూటికల్స్ విభాగం గత డిసెంబర్ నెలలోనే నోటిఫికేషన్ జారీచేసింది. ఇప్పటికే నెల రోజులు గడుస్తున్నా ఇంకా ఈ అంశం ఓ కొలిక్కి రాలేదు. స్టెంట్ల ధరను తమ వద్ద నియంత్రించే బదులు ఆస్పత్రుల వద్దనే నియంత్రించాలని ఉత్పత్తిదారులు వాదిస్తున్నారు. అందరి వాదనలు విన్న తర్వాత ఫార్మాస్యూటికల్స్ విభాగం ఓ నిర్ణయం తీసుకోనుంది. ధరల నియంత్రణ జరగాలంటే మరో నెల రోజులపాటు నిరీక్షించాల్సిందే. స్టెంట్లకు గరిష్ట ధరను నిర్ణయించాలంటే ఇవి బహిరంగ మార్కెట్లో లభించవు. ఉత్పత్తిదారుడి నుంచి పంపిణీదారుడి ద్వారా నేరుగా కార్డియోలజిస్టులకు లేదా ఆస్పత్రులకు వెళతాయి. ఈ కారణంగానే ప్రైవేటు ఆస్పత్రులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.
Advertisement
Advertisement