స్టెంట్ వేశాక మళ్లీ పూడుకుపోతే..? | Treatment For Heart Arteries Clog Even After Stent | Sakshi
Sakshi News home page

Heart Arteries Clog: స్టెంట్ వేశాక మళ్లీ పూడుకుపోతే..?

Published Sun, Sep 11 2022 1:02 PM | Last Updated on Sun, Sep 11 2022 2:15 PM

Treatment For Heart Arteries Clog Even After Stent - Sakshi

అన్ని అవయవాలకు అందినట్లే గుండెకు కూడా రక్తం నిరంతరం అందుతుండాలి. ఒక్కోసారి గుండెకు రక్తాన్ని చేరవేసే ధమనుల్లో పూడిక చేరినప్పుడు స్టెంట్లు వేసి, గుండె కండరానికి రక్తం నిరంతరాయంగా అందేలా చూస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇలా స్టెంట్లు వేసినప్పటికీ... అవి మళ్లీ పూడుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా జరిగినప్పుడు అందుకు కారణాలను కనుగొని, స్టెంట్లలో ఏర్పడ్డ పూడికలను తొలగించి, ఆ రక్తనాళాలు మళ్లీ పూడుకుపోకుండా చేసేందుకు అందుబాటులో ఉన్న చికిత్సల గురించి కథనమిది.

గుండెకు రక్తాన్ని చేరవేసే ప్రధాన ధమనుల్లో ఎక్కడైనా పూడికలు ఏర్పడినప్పుడు... సాధారణంగా యాంజియోప్లాస్టీ అనే చికిత్స ప్రక్రియ ద్వారా స్టెంట్‌ వేసి, సన్నబడ్డ రక్తనాళాన్ని మళ్లీ విచ్చుకునేలా చేస్తారు. అయితే స్టెంట్‌ వేశాక... మళ్లీ ఆ రక్తనాళం పూడుకుపోకుండా డాక్టర్లు కొన్ని జాగ్రత్తలు సూచిస్తారు.

ఉదాహరణకు మధుమేహాన్ని, అధికరక్తపోటును అదుపులో పెట్టుకోవడం, స్మోకింగ్, మద్యం అలవాట్లను పూర్తిగా మానేయడం, తేలికపాటి వ్యాయామాలు చేయడం, మళ్లీ కొవ్వు పేరుకోడాన్ని నివారించేందుకుగాను కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే సమతులాహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు  చెబుతారు. అయితే స్టెంట్‌ వేశాక కొంతమంది బాధితులు ఈ నియమాలన్నింటినీ పాటించరు. దాంతో... నియమాలు పాటించని వారిలో మళ్లీ పూడికలు వచ్చే అవకాశం ఉంటుంది. 

తీవ్రమైన లక్షణాలు

  • హఠాత్తుగా ఛాతీలో నొప్పి 
  • చెమటలు పట్టడం 
  • వాంతులు

దీర్ఘకాలికమై లక్షణాలు

  • శ్వాసలో ఇబ్బంది 
  • ఛాతీలో అసౌకర్యం 
  • నడక, కదలికల సమయంలో ఆయాసం 
  • తమ కదలికలు కేవలం కొద్ది దూరాలకు మాత్రమే పరిమితమైపోవడం.

నిర్ధారణ పరీక్షలు

  • ఈసీజీ 
  • ఎకోకార్డియోగ్రామ్‌ 
  • కరొనరీ యాంజియోగ్రామ్‌

పూడికలు ఎక్కడ వస్తాయంటే...?
ఒక్కోసారి ఇలా వేసిన స్టెంట్‌లోనే మళ్లీ పూడిక రావచ్చు. లేదా స్టెంట్‌కు పరిసర ప్రాంతాల్లో రెండోసారి పూడికలు రావచ్చు. స్టెంట్‌ వేశాక కూడా ఇలా రక్తనాళాలు తిరిగి మూసుకుపోవడానికి 3 నుంచి 5 శాతం వరకు అవకాశాలుంటాయి. 

ఇన్‌స్టెంట్‌ స్టెనోసిస్‌ అంటే... 
స్టెంట్‌ వేశాక ఏర్పడే పూడిక... స్టెంట్‌ లోపలగానీ లేదా దానికి 5 మిల్లీమీటర్ల పరిధిలోగానీ, స్టెంట్‌ అంచుల్లోగానీ ఏర్పడితే దాన్ని ఇన్‌స్టెంట్‌ స్టెనోసిస్‌ అంటారు. ఈ  పూడికను కరొనరీ ఇమేజింగ్‌ పద్ధతుల ద్వారా దాన్ని కనిపెట్టాల్సి ఉంటుంది. కరొనరీ ఇమేజింగ్‌ అంటే ‘ఇంట్రావాస్క్యులార్‌ అల్ట్రాసౌండ్‌’ లేదా ‘ఆప్టికల కొహరెన్స్‌ టోమోగ్రఫీ’ అనే ఇమేజింగ్‌ ప్రక్రియలు.

ఇలా స్టెంట్‌ లోపలగానీ లేదా చుట్టుపక్కల గానీ, అంచుల్లోగానీ పూడికలు మళ్లీ ఏర్పడటానికి కారణం... స్టెంట్‌ అవసరమైనంత మేరకు వ్యాకోచించకపోవడం అన్నమాట. ఇలా జరగడాన్ని ‘స్టెంట్‌ అండర్‌–ఎక్స్‌ప్యాన్షన్‌’ అంటారు. అలాగే స్టెంట్‌ ఫ్రాక్చర్‌కు గురికావచ్చు కూడా. స్టెంట్‌ పొడవు 30 మిల్లీమీటర్లకు మించినప్పుడు అది తిరిగి పూడుకుపోయే అవకాశాలు కొంతమేర ఎక్కువ. అలాగే ఒకటికి మించి... రెండు స్టెంట్లు వేసిన సందర్భాల్లోనూ ఒకదాని పైకి ఒకటి వచ్చేలా (ఓవర్‌ల్యాప్‌ చేస్తున్నట్లుగా) వేసిన సందర్భాల్లోనూ ఇలా మరోసారి పూడిక చేరేందుకు అవకాశాలు ఎక్కువ. 

అలాగే స్టెంట్‌ వేసినప్పుడు, అందులో ఎముకల తాలూకు అవశేషాలు పేరుకుని ఉన్నట్లయితే, స్టెంట్‌ అవసరమైన మేరకు వ్యాకోచించడానికి అది అడ్డంకిగా మారవచ్చు. అలాంటిప్పుడు దాన్ని సరిచేయకపోతే... ఆ తర్వాతి కాలంలో తిరగి పూడికలు ఏర్పడేందుకు అవకాశాలు ఎక్కువ. 

స్టెంట్‌ లోపల మరో స్టెంట్‌... 
ఈ ప్రక్రియను వైద్యులు చివరి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. సాధారణంగా స్టెంట్‌లోపల మరోస్టెంట్‌ వేయడం వల్ల రక్తనాళం మరింత ఇరుగ్గా మారిపోయే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా రక్తనాళం తిరిగి పూడుకుపోయే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి మిగతా ఏ విధానాలూ పనిచేయని సందర్భాల్లో మాత్రమే అరుదుగా ఇలా రీస్టెంటింగ్‌ ప్రక్రియను చివరగా ఉపయోగిస్తారు. 

డ్రగ్‌ ఎల్యూటింగ్‌ స్టెంట్స్‌... 
స్టెంట్లలో రెండురకాలు ఉంటాయి. అవి... బేర్‌ మెటల్‌ స్టెంట్స్, డ్రగ్‌ ఎల్యూటింగ్‌ స్టెంట్స్‌.  ప్రస్తుతం బేర్‌ మెటల స్టెంట్లు అందుబాటులో లేవు. అయితే ఈ బేర్‌ మెటల్‌ స్టెంట్లు తిరిగి పూడుకుపోయేందుకు అవకాశాలు ఎక్కువ. వీటిలో కణజాలం పెరగకుండా నిరోధించడం అసాధ్యం. అందుకే బేర్‌ మెటల్‌ స్టెంట్లకు బదులుగా డ్రగ్‌ ఎల్యూటింగ్‌ స్టెంట్లు వాడుకలోకి వచ్చాయి.

ఈ స్టెంట్లలో ఉండే ఔషధ పదార్థం (డ్రగ్‌) మూడు నెలల నుంచి ఆరు నెలల పాటు విడుదలవుతూ... స్టెంట్‌లోపల కణజాలం పెరుగుదలను నియంత్రిస్తుంది. తద్వారా ఇది చాలాకాలంపాటు పూడుకుపోకుండా ఉంటుంది. ఇలాంటి డ్రగ్‌ ఎల్యూటింగ్‌ స్టెంట్లు వేయించుకున్న రోగుల్లో, తిరిగి పూడికలు ఏర్పడే అవకాశాలు కేవలం 3 నుంచి 5 శాతం మేరకే ఉంటాయి. కానీ బేర్‌ మెటల్‌ స్టెంట్లు వేయించుకున్నవారిలో తిరిగి పూడికలు ఏర్పడే అవకాశాలు 30 శాతం వరకు ఉంటాయి. అందుకే ఇవి అంతగా ప్రాచుర్యం పొందలేదు.

లేజర్‌తో పూడిక తొలగింపు.... 
స్టెంట్‌లో కణజాలం మళ్లీ పెరిగి. అవి మళ్లీ పూడుకుపోయే కండిషన్‌ను ‘టిష్యూ హైపర్‌ప్లేసియా’ అంటరు. ఇలాంటి కండిషన్‌ను లేజర్‌తో చక్కదిద్దవచ్చు. తొలత లేజర్లను ఉపయోగించి పూడికను తొలగించాక... ఆ తర్వాత డ్రగ్‌ పైపూతగా ఉన్న బెలూన్ల సహాయంతో స్టెంట్‌ లోపలి పొరల్లోకి ఔషధపదార్థాన్ని పంపుతారు. ఇందుకోసం ‘పాక్లిటాక్సెల లేదా ‘సిరోలిమస్‌’ అనే ఔషధాలను (డ్రగ్స్‌)ను వైద్యులు ఉపయోగిస్తారు.

ఇన్‌స్టెంట్‌ స్టెనోసిస్‌కు చికిత్స ఇలా... 
కరొనరీ ఇమేజింగ్‌ ద్వారా స్టెంట్‌ తగినంతగా వ్యాకోచించలేదని గుర్తిస్తే... అప్పుడు ఆ స్టెంట్‌ తాలూకు అండర్‌–ఎక్స్‌ప్యాన్షన్‌ కండిషన్‌కు చికిత్స చేసి, సరిదిద్దాల్సి ఉంటుంది. అంతే తప్ప పాత స్టెంట్‌ స్థానంలో కొత్త స్టెంట్‌ ఏర్పటు చేయడం సరికాదు. కాబట్టి స్టెంట్‌ అండర్‌–ఎక్స్‌ప్యాన్షన్‌కు తగిన కారణాలను కనిపెట్టి, వాటిని సరిదిద్దాల్సి ఉంటుంది.

చాలా సందర్భాల్లో స్టెంట్‌ చుట్టూరా క్యాల్షియమ్‌ లేదా దృఢ కణజాలం పేరుకుపోయి స్టెంట్‌ తగినంతగా వ్యాకోచించడానికి అడ్డుపడవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ ఒత్తిడితో కూడిన బెలూన్ల సహాయంతో స్టెంట్‌ను తిగిరి వ్యాకోచించేలా చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో రొటాబ్లేషన్, కటింగ్‌ బెలూన్ల వంటి ప్రక్రియలతో స్టెంట్‌ను తగినంతగా వ్యాకోచించేలా చేయవచ్చు. -డాక్టర్‌ ఎ. శరత్‌రెడ్డి, సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement