గుండె తన పూర్తి సామర్థ్యాన్ని కనబరచకుండా అది విఫలమయ్యే కండిషన్‌ను ‘హార్ట్ ఫెయిల్యూర్’గా చెబుతారు. హార్ట్ ఫెయిల్యూర్‌తో బాధపడేవారు... తాము కొద్దిగా నడవగానే వారికి ఊపిరి సరిగా అందకపోవడం, తీవ్రంగా ఆయాసం రావడం వంటి సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. హార్ట్‌ఫెయిల్యూర్ బాధితులు ఈ కింద సూచించిన జీవనశైలి మార్పులు చేసుకోవడం చాలా మంచిది.
ద్రవాహారానికి దూరంగా ఉండటం: హార్ట్ ఫెయిల్యూర్ బాధితుల్లో ఒంట్లోకి నీరు చేరుతుంటే వాళ్లు ద్రవాహారం తీసుకోవడం తగ్గించాలి. ఒంట్లోకి నీరు చేరనివాళ్లు మాత్రం రోజు లీటరున్నర వరకు ద్రవాహారాలు తీసుకోవచ్చు.
ఉప్పు బాగా తగ్గించడం : ఒంట్లో నీరు చేరడం, ఆయాస పడటం, ఊపిరి అందక΄ోవడం వంటి లక్షణాలు కనబడితే ఉప్పు వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి. రోజుకు 2.5 గ్రాములు (అరచెంచా) కంటే తక్కువే తీసుకోవాలి. వీళ్లు తినే వంటల్లో ఉప్పు వేయకపోవడం మేలు. పచ్చళ్లు, బేకరీ ఐటమ్స్, బయటి చిరుతిండ్లను పూర్తిగా మానేయాలి.
డ్రైఫ్రూట్స్, పండ్లు, పాలు : బాదాం, జీడిపప్పు, ఆక్రోటు వంట్ నట్స్, పాలు, పండ్ల వంటివి తీసుకోవచ్చు. వీటిల్లో ఆరోగ్యానికి చేటు చేసే లవణాలు తక్కువ.
విశ్రాంతి : హార్ట్ ఫెయిల్యూర్‌తో బాధపడేవారు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని చాలామందిలో ఓ అపోహ. అయితే ఇది సరికాదు. వైఫల్యం తీవ్రంగా ఉంటే తప్ప... శరీరం సహకరించినంత మేరకు, ఆయాసం రానంత వరకు శరీరాన్ని మరీ కష్టపెట్టకుండా శ్రమ చేయవచ్చు. తేలికపాటి నడక, మెట్లు ఎక్కడం వంటి వ్యాయామాలూ చేయవచ్చు.
మానసికంగా ప్రశాంతంగా ఉండటం: హార్ట్ ఫెయిల్యూర్‌తో బాధపడేవారు తమ సమస్య కారణంగా చాలా మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశాలెక్కువ. ఒక్కోసారి తీవ్రమైన భావోద్వేగాలకూ లోనుకావచ్చు. వారు ఒత్తిళ్లకు దూరంగా ఉంటూ మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఇందుకు యోగా, ధ్యానం వంటివి చేయడం మంచిది.
ఈ మందులు వద్దు : హార్ట్‌ఫెయిల్యూర్‌తో బాధపడేవారు కొన్ని మందులకు... ముఖ్యంగా నొప్పి నివారణ కోసం వాడే... ఇబూప్రొఫేన్, డైక్లోఫెనాక్ వంటి ఎన్‌ఎస్‌ఏఐడీ రకం మందులకు దూరంగా ఉండాలి. స్టెరాయిడ్స్ కూడా వాడకూడదు. ఇవి ఒంట్లోకి నీరు చేరేందుకు దోహదం చేస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.
నాటు మందుల్లో ఏ పదార్థాలు ఉంటాయో, అవి గుండె మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియదు. కాబట్టి వాటికి దూరంగా ఉండటం మేలు. ఇంకా చెప్పాలంటే కార్డియాలజిస్ట్‌కు చెప్పకుండా ఎలాంటి మందులూ వాడకపోడమే మంచిది. ఇక నొప్పులు మరీ భరించలేనంతగా ఉన్నప్పుడు అవి తగ్గేందుకు డాక్టర్‌ను ఒకసారి సంప్రదించి పారాసిటమాల్ వంటి సురక్షిత మందుల్ని వాడుకోవచ్చు. ∙
వైద్యపరమైన జాగ్రత్తలు
బాధితులు తమ గుండె వైఫల్యానికి వాడుతున్న మందులతోనూ అప్పుడప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. అందుకే ఎప్పటికప్పుడు డాక్టర్ ఫాలో అప్‌లో ఉంటూ, అవసరాన్ని బట్టి వాటి మోతాదుల్లో మార్పులు చేసుకోవడం లేదా మందులను మార్చడం వంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అందుకే తరచూ గుండెవైద్య నిపుణులను సంప్రదిస్తూ, వారు చెప్పే సూచనలు, జాగ్రత్తలు అనుసరించాలి.
(చదవండి: మై లిటిల్ మార్ఫీ..! చిన్నారులు హాయిగా నిద్రపోయేలా..!)
Comments
Please login to add a commentAdd a comment