సాక్షి, న్యూఢిల్లీ : బహుళజాతి కంపెనీలు రూపొందించే స్టెంట్‌లతో పోలిస్తే దేశీయంగా తయారయ్యే కరోనరీ స్టెంట్‌లే మేలైనవని తాజా అథ్యయనం వెల్లడించింది. అమెరికాలోని శాండియాగోలో నాన్ సర్జికల్ కార్డియాక్ ఇంటర్‌వెన్షన్స్‌పై ఇటీవల జరిగిన సదస్సులో అథ్యయన వివరాలు సమర్పించారు. యూరప్ సహా పలు దేశాల్లోని 1500 మంది రోగులపై నిర్వహించిన ఈ అథ్యయనాన్ని ప్రపంచ ప్రఖ్యాత క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఆర్‌ఓ) పర్యవేక్షించింది.
విదేశాల్లో తయారయ్యే స్టెంట్లలో ఉండే నాణ్యత, సామర్థ్యం భారత్‌లో తయారయ్యే దేశీయ స్టెంట్లకు లేదని చాలా మంది డాక్టర్లు, రోగుల్లో ఉండే అపోహలను ఈ అథ్యయనం పటాపంచలు చేసింది. గుండె ధమనుల్లో పూడికలకు చికిత్స అందించే క్రమంలో లోహంతో తయారయ్యే కరోనరీ స్టెంట్లపై పాలిమర్స్‌తో ఔషధపు పూత ఉంటుంది. దీర్ఘకాలం సరైన సామర్థ్యంతో పనిచేసేలా వీటిని తయారుచేస్తారు.
యూరప్, అమెరికాల్లో తయారయ్యే అబాట్ వాస్కులర్ కంపెనీకి చెందిన జిన్స్ స్టెంట్‌తో పోలిస్తే భారత్‌లో రూపొందే ఎస్‌ఎంటీకి చెందిన సుప్రాఫ్లెక్స్ స్టెంట్ మెరుగైనదని రాండమ్ ట్రయల్‌లో పలువురు పేర్కొన్నారు. దేశీయ స్టెంట్‌లు చవకగా అందుబాటులో ఉండటంతో తాజా అథ్యయనం నేపథ్యంలో వీటి వాడకం పెరుగుతుందని అథ్యయనంలో చురుకైన పాత్ర పోషించిన ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్ ఉపేంద్ర కౌల్ పేర్కొన్నారు. దేశీయ పరిజ్ఞానంతో తయారయ్యే స్టెంట్‌లు మెరుగైనవని సర్వేలో వెల్లడవడంస్వాగతించదగిందని చెప్పారు.