న్యూఢిల్లీ: విదేశాల్లో తయారయ్యే ఖరీదైన కరొనరీ స్టెంట్లు బాగా పనిచేస్తాయని దేశంలోని చాలామంది వైద్యులు, రోగుల్లో ఒక నమ్మకం ఉంది. దీంతోపాటు దేశీయ కంపెనీలు తక్కువ ధరకే మార్కెట్‌లోకి తెచ్చే స్టెంట్లు సమర్ధంగా పనిచేయవనే అపోహ ఉంది. అయితే, సామర్ధ్యం, నాణ్యత విషయంలో ఖరీదైన విదేశీ స్టెంట్లతో పోటీ పడగలిగే స్థాయిలో దేశీయంగా తయారైన స్టెంట్లు ఉన్నాయని అంతర్జాతీయ అధ్యయనంలో తాజాగా నిరూపితమయింది.
న్యూఢిల్లీలోని బాత్రా హార్ట్ సెంటర్‌కు చెందిన ప్రముఖ ప్రొఫెసర్ ఉపేందర్ కౌల్, నెదర్లాండ్స్ ప్రొఫెసర్ పాట్రిక్ సెర్రుస్‌తో కలిసి ప్రపంచ ప్రఖ్యాత క్లినికల్ రీసెర్చి ఆర్గనైజేషన్(సీఆర్‌వో) సాయంతో టాలెంట్ పేరుతో ఓ సర్వే నిర్వహించారు. ఆ ఫలితాలను ఇటీవల అమెరికాలోని శాన్‌డియాగోలో జరిగిన నాన్ సర్జికల్ కార్డియాక్ ఇంటర్వెన్షన్స్–టీసీటీ (ట్రాన్స్ క్యాథెటర్ ఇంటర్వెన్షన్స్)లో వెల్లడించారు. సర్వేలో భాగంగా యూరోపియన్ దేశాలకు చెందిన బహుళజాతి సంస్థల స్టెంట్లు అమర్చిన 1,500 మంది రోగులను పరిశీలించారు.
దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడయ్యే అబాట్ సంస్థ తయారీ ఎక్సియన్స్ స్టెంట్‌తో, భారత్‌లో ఎస్‌ఎంటీ సంస్థ రూపొందించే సుప్రాఫ్లెక్స్ స్టెంట్లను పోల్చి చూశారు. పనితనం, సురక్షితం విషయంలో ఎక్సియన్స్‌తో సుప్రాఫ్లెక్స్ ఏమాత్రం తీసిపోదని ధ్రువపరిచారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న స్టెంట్ల కంటే భారత్‌లో తయారైనవి అంత సురక్షితం, సమర్ధవంతం కావని వైద్యులు, రోగుల్లో ఉన్న అపోహ తప్పని తేల్చారు.
దేశంలో తయారయ్యే స్టెంట్లు అంత సమర్ధవంతంగా పనిచేయవన్న అపోహలను తొలగించేందుకే అంతర్జాతీయంగా పేరున్న సంస్థలతో విదేశాల్లో సర్వే చేపట్టినట్లు డాక్టర్ కౌల్ వివరించారు. దేశీ, విదేశీ స్టెంట్లను వాడిన రోగులపై ఏడాదిపాటు జరిపిన అధ్యయనంలో భాగంగా కార్డియాక్ డెత్, టార్గెట్ వెస్సల్ ఎంఐ వంటి అంశాలు కూడా సమానంగా ఉన్నట్లు తేలిందన్నారు. గత ఏడాది కేంద్రం విదేశీ తయారీ కరొనరీ స్టెంట్ల ధరలపై పరిమితి విధించింది. ఫలితంగా రూ.1.30లక్షల వరకు ఉన్న విదేశీ స్టెంట్ల ధర రూ.35 వేలకు తగ్గిపోయింది.
అంతేకాకుండా దేశీయ కంపెనీలు తయారు చేసిన స్టెంట్ల వినియోగం బాగా పెరిగిందని డాక్టర్ కౌల్ తెలిపారు. బహుళ జాతి సంస్థలు తయారు చేసే స్టెంట్ల ధర భారాన్ని మోయలేని దేశాల వారికి ఈ అధ్యయనం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ అధ్యయనం పూర్తి వివరాలు లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితం కానున్నాయన్నారు. మిగతా భారతీయ కంపెనీలు కూడా ఇటువంటి అధ్యయనాలు చేపట్టి.. విదేశీ తయారీ స్టెంట్లతో పోలిస్తే తమ స్టెంట్లు తీసిపోవని నిరూపించుకోవాలని కోరారు. గుండెలో మూసుకుపోయిన కరోనరీ ధమనుల్లో స్టెంట్లను అమర్చి రక్త ప్రవాహం సజావుగా సాగేలా చేస్తారు.
మన స్టెంట్లూ మంచివే!
Published Mon, Oct 1 2018 3:37 AM | Last Updated on Mon, Oct 1 2018 3:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment