coronary stent
-
అత్యవసర ఔషధాల జాబితాలో కరోనరీ స్టెంట్లు
న్యూఢిల్లీ: కరోనరీ స్టెంట్లను అత్యవసర ఔషధాల జాతీయ జాబితా(ఎన్ఎల్ఈఎం–2022)లో చేరుస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. మెటల్ సెంట్లు(బీఎంఎస్), మందు పూత పూసిన స్టెంట్లు(డీఈఎస్)ను ఈ జాబితాలో చేర్చారు. ఇన్నాళ్లూ ‘పరికరాల’ జాబితాలో ఉన్న స్టెంట్లను ఔషధాలుగా అత్యవసర ఔషధాల జాబితాలో చేర్చడం వల్ల ఎంబీఎస్, డీఈఎస్‌తోపాటు బీవీఎస్, బయోడిగ్రేడబుల్ సెంట్ల ధరలు తగ్గనున్నాయి. ధరలపై నేషనల్ ఫార్మాస్యూటికల్, ప్రైసింగ్ అథారిటీ(ఎన్పీపీఏ) తుది నిర్ణయం తీసుకోనుంది. దేశంలో కరోనరీ ఆర్టరీ వ్యాధులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో స్టెంట్ల ధరల తగ్గుదల వల్ల బాధితులకు ఎంతో ఉపశమనం కలుగనుంది. అత్యవసర ఔషధాల జాతీయ జాబితాలో 2015లో 376 ఔషధాలు ఉండేవి. ఇప్పుడు వీటి సంఖ్య 384కు చేరింది. ఎన్ఎల్ఈఎంలో ఉన్న మందులను ఎన్పీపీఏ నిర్దేశించిన ధర కంటే ఎక్కువ ధరకు విక్రయించడానికి వీల్లేదు. -
హైదరాబాద్‌కు భారీగా పెట్టుబడులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో రూ. 250 కోట్ల పెట్టుబడితో గుండె సంబంధిత స్టెంట్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటుచేసేందుకు ఎస్ఎంటీ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చింది. సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైజెస్ పార్కులో ఈ మేరకు ప్లాంటును ఏర్పాటుచేయనున్నారు. ఇందుకోసం తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌తో సంస్థ ప్రతినిధులు మంగళవారం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటుతో 2200మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు, అందుబాటులో అత్యుత్తమ మౌలిక వసతులు ఉండటం వల్లే హైదరాబాద్‌ను ఎంచుకున్నామని వారు చెప్పారు. మంత్రి కేటీఆర్‌తో కంపెనీ ప్రతినిధులు భేటీ అయ్యారు. -
మన స్టెంట్లూ మంచివే!
న్యూఢిల్లీ: విదేశాల్లో తయారయ్యే ఖరీదైన కరొనరీ స్టెంట్లు బాగా పనిచేస్తాయని దేశంలోని చాలామంది వైద్యులు, రోగుల్లో ఒక నమ్మకం ఉంది. దీంతోపాటు దేశీయ కంపెనీలు తక్కువ ధరకే మార్కెట్లోకి తెచ్చే స్టెంట్లు సమర్ధంగా పనిచేయవనే అపోహ ఉంది. అయితే, సామర్ధ్యం, నాణ్యత విషయంలో ఖరీదైన విదేశీ స్టెంట్లతో పోటీ పడగలిగే స్థాయిలో దేశీయంగా తయారైన స్టెంట్లు ఉన్నాయని అంతర్జాతీయ అధ్యయనంలో తాజాగా నిరూపితమయింది. న్యూఢిల్లీలోని బాత్రా హార్ట్ సెంటర్‌కు చెందిన ప్రముఖ ప్రొఫెసర్ ఉపేందర్ కౌల్, నెదర్లాండ్స్ ప్రొఫెసర్ పాట్రిక్ సెర్రుస్‌తో కలిసి ప్రపంచ ప్రఖ్యాత క్లినికల్ రీసెర్చి ఆర్గనైజేషన్(సీఆర్వో) సాయంతో టాలెంట్ పేరుతో ఓ సర్వే నిర్వహించారు. ఆ ఫలితాలను ఇటీవల అమెరికాలోని శాన్‌డియాగోలో జరిగిన నాన్ సర్జికల్ కార్డియాక్ ఇంటర్వెన్షన్స్–టీసీటీ (ట్రాన్స్ క్యాథెటర్ ఇంటర్వెన్షన్స్)లో వెల్లడించారు. సర్వేలో భాగంగా యూరోపియన్ దేశాలకు చెందిన బహుళజాతి సంస్థల స్టెంట్లు అమర్చిన 1,500 మంది రోగులను పరిశీలించారు. దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడయ్యే అబాట్ సంస్థ తయారీ ఎక్సియన్స్ స్టెంట్‌తో, భారత్‌లో ఎస్ఎంటీ సంస్థ రూపొందించే సుప్రాఫ్లెక్స్ స్టెంట్లను పోల్చి చూశారు. పనితనం, సురక్షితం విషయంలో ఎక్సియన్స్‌తో సుప్రాఫ్లెక్స్ ఏమాత్రం తీసిపోదని ధ్రువపరిచారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న స్టెంట్ల కంటే భారత్‌లో తయారైనవి అంత సురక్షితం, సమర్ధవంతం కావని వైద్యులు, రోగుల్లో ఉన్న అపోహ తప్పని తేల్చారు. దేశంలో తయారయ్యే స్టెంట్లు అంత సమర్ధవంతంగా పనిచేయవన్న అపోహలను తొలగించేందుకే అంతర్జాతీయంగా పేరున్న సంస్థలతో విదేశాల్లో సర్వే చేపట్టినట్లు డాక్టర్ కౌల్ వివరించారు. దేశీ, విదేశీ స్టెంట్లను వాడిన రోగులపై ఏడాదిపాటు జరిపిన అధ్యయనంలో భాగంగా కార్డియాక్ డెత్, టార్గెట్ వెస్సల్ ఎంఐ వంటి అంశాలు కూడా సమానంగా ఉన్నట్లు తేలిందన్నారు. గత ఏడాది కేంద్రం విదేశీ తయారీ కరొనరీ స్టెంట్ల ధరలపై పరిమితి విధించింది. ఫలితంగా రూ.1.30లక్షల వరకు ఉన్న విదేశీ స్టెంట్ల ధర రూ.35 వేలకు తగ్గిపోయింది. అంతేకాకుండా దేశీయ కంపెనీలు తయారు చేసిన స్టెంట్ల వినియోగం బాగా పెరిగిందని డాక్టర్ కౌల్ తెలిపారు. బహుళ జాతి సంస్థలు తయారు చేసే స్టెంట్ల ధర భారాన్ని మోయలేని దేశాల వారికి ఈ అధ్యయనం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ అధ్యయనం పూర్తి వివరాలు లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితం కానున్నాయన్నారు. మిగతా భారతీయ కంపెనీలు కూడా ఇటువంటి అధ్యయనాలు చేపట్టి.. విదేశీ తయారీ స్టెంట్లతో పోలిస్తే తమ స్టెంట్లు తీసిపోవని నిరూపించుకోవాలని కోరారు. గుండెలో మూసుకుపోయిన కరోనరీ ధమనుల్లో స్టెంట్లను అమర్చి రక్త ప్రవాహం సజావుగా సాగేలా చేస్తారు. -
స్టెంట్ల ధరలు 85 శాతం తగ్గింపు
-
స్టెంట్ల ధరలు 85 శాతం తగ్గింపు
హృద్రోగులకు కేంద్రం తీపికబురు ► మెటల్ స్టెంట్ రూ. 7,260గా, డ్రగ్ స్టెంట్ రూ. 29,600గా నిర్ణయం ► సవరించిన ధరలు తక్షణం అమల్లోకి న్యూఢిల్లీ: లక్షలాది మంది హృద్రోగులకు ఊరట నిచ్చేలా స్టెంట్ల ధరలు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గుండె శస్త్ర చికిత్సలో ఎంతో కీలమైన కరోనరీ స్టెంట్ల ధరల్ని 85 శాతం మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బేర్ మెటల్ స్టెంట్ (బీఎంఎస్) ధరను రూ. 7,260గా, డ్రగ్ ఎలుటింగ్ స్టెంట్ (డీఈఎస్) ధరను రూ. 29,600గా నిర్ణయిం చామని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంత్ కుమార్ మంగళవారం తెలిపారు. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించారు. వ్యాట్, స్థానిక పన్నులతో కలిపి గరిష్టంగా బీఎంఎస్ రూ.7,623కు, డీఈఎస్ రూ.31,080కు దొరుకుతుం దని చెప్పారు. ఇప్పటివరకు బీఎంఎస్ ధర గరిష్టంగా రూ. 45 వేలు ఉండగా, డీఈఎస్ రూ. 1.21 లక్షల వరకూ ఉండేది. ప్రస్తుతం కంపెనీల వద్ద ఉన్న స్టెంట్ల నిల్వలకు కూడా సవరించిన ధరల్ని అమలు చేయాలని, ఒకవేళ రోగుల నుంచి ఎక్కువ వసూలు చేస్తే... ఆస్పత్రులు, స్టెంట్ల సరఫరా దారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అనంత్ కుమార్ హెచ్చరించారు. రూ. 4,450 కోట్ల మేర తగ్గనున్న భారం ‘పలు ఆస్పత్రుల్లో కరోనరీ స్టెంట్ల ధరలు భారీగా ఉండడంపై కొనసాగుతున్న ఆందోళనకు ముగింపు పలకాలనుకున్నాం. ఎంతో జాగ్రత్తగా ఆలోచించి, వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకున్న అనంతరం జాతీయ ఫార్మాస్యూటికల్ ధరల సంస్థ (ఎన్ పీపీఏ) స్టెంట్ల గరిష్ట ధరను నిర్ణయించింది’ అని మంత్రి చెప్పారు. ఈ తగ్గింపుతో ఏడాదికి రూ. 4,450 కోట్ల మేర గుండె సంబంధిత రోగులపై భారం తగ్గుతుందన్నారు. స్టెంట్ల సరఫరాలోని వివిధ దశల్లో ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నట్లు కనుగొన్నామని ఎన్ పీపీఏ పేర్కొంది. దీంతో ఆర్థికంగా రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, వారికి ఊరటనిచ్చేలా కరోనరీ స్టెంట్ల గరిష్ట ధరల్ని తక్షణం సవరించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ప్రభుత్వ ప్రకటనను పలు వైద్య విభాగాలు స్వాగతించాయి. కొన్ని ఆస్పత్రుల అనైతిక చర్యలకు ఈ నిర్ణయంతో చెక్ పెట్టారంటూ ఆలిండియా డ్రగ్ యాక్షన్ నెట్వర్క్, డాక్టర్స్ ఆఫ్ ఎథికల్ హెల్త్‌కేర్‌లు ప్రశంసించాయి.