కష్టకాలంలో ఆదుకున్నారు
గుండెకు బైపాస్ సర్జరీ చేయాలన్నారు. నా భర్త ఆటో డ్రైవర్. రోజువారి సంపాదన కుటుంబ పోషణకు సరిపోతుంది. బైపాస్ సర్జరీ అంటే బయట అప్పులు చేయాలని భయపడ్డాను. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ చేయిస్తుందని చెప్పారు. ఫిబ్రవరిలో ఆపరేషన్ చేశారు. అనంతరం విశ్రాంత సమయానికి రూ. 9,500 భృతిని ఆరోగ్య ఆసరా కింద ఇచ్చారు. చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టకుండా ఆపరేషన్ పూర్తి అయింది. పేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధకు నాలాంటి ఎంతోమంది ప్రాణాలను నిలుపుకుని సంతోషంగా ఉంటున్నారు. కష్టకాలంలో సీఎం జగన్ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంది.
– అల్లంశెట్టి రాజ్యలక్ష్మి, ఒంగోలు, ప్రకాశం జిల్లా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 1.42 కోట్ల కుటుంబాలకు సంజీవని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆయా కుటుంబాల వారికి ఏదైనా అనారోగ్యం వస్తే రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం లభిస్తుంది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఈ పథకం అమలుపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తొలి నుంచి ప్రత్యేక దృష్టి పెడుతూ వస్తోంది. సంతృప్తకర స్థాయిలో ప్రజలకు సేవలు అందించేలా విప్లవాత్మక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పథకం కింద చికిత్స పొందిన రోగుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. చికిత్స పొందిన రోగుల్లో సుమారు వంద శాతం సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అతి కొద్ది మంది మాత్రమే సేవల్లో సమస్యలను ప్రస్తావించారు. ఈ స్వల్ప సమస్యలను కూడా సరిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది.
99.71 శాతం మంది సంతృప్తి
ఆరోగ్యశ్రీ సేవల్లో లోటుపాట్లు ఏమైనా ఉంటే వాటిని సర్దుబాటు చేసి ప్రజలకు వంద శాతం సంతృప్తికరంగా సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా గతేడాది ఆగస్టు 16 నుంచి ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన రోగుల నుంచి అభిప్రాయ సేకరణను ప్రారంభించారు. రోగి ఆస్పత్రి నుంచి డిశ్చార్జయి ఇంటికి వెళ్లిన వారం నుంచి 10 రోజుల్లో ఏఎన్‌ఎం సంబంధిత రోగి ఇంటికి వెళ్లి రోగి ఆరోగ్య పరిస్థితులపై వాకబు చేస్తున్నారు. అలాగే ఆరోగ్యశ్రీ సేవలపైనా అభిప్రాయం సేకరిస్తున్నారు.
ఇందుకోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించారు. ఇప్పటి వరకూ పథకం కింద చికిత్స పొందిన 15,43,831 మంది నుంచి అభిప్రాయాలు తీసుకోగా.. 15,39,506 మంది అంటే 99.71 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం 0.29 శాతం మంది మాత్రమే సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదురైనట్టు చెప్పారు. ఈ సమస్యలను క్రమశిక్షణ కమిటీల ద్వారా విచారించి, కారణాలను అన్వేషించి బాధ్యులపై అధికారులు చర్యలు తీసుకున్నారు.
డబ్బు వసూళ్లకు పాల్పడ్డారా?
నెట్‌వర్క్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని డిశ్చార్జయిన రోగి చిరునామా ఆధారంగా సంబంధిత ఏఎన్‌ఎంకు యాప్ ద్వారా వివరాలు వెళతాయి. చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితిపై ఏఎన్‌ఎం ఆరా తీసి.. యాప్‌లో రూపొందించిన పలు ప్రశ్నలపై సమాధానాలు రాబడతారు. చికిత్స కోసం నెట్‌వర్క్ ఆస్పత్రికి వెళ్లినప్పుడు డబ్బు డిమాండ్ చేశారా? వైద్య సేవలు, సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి? ఆరోగ్యమిత్ర సహకారం ఎలా ఉంది? మందులు ఉచితంగా ఇచ్చారా? లేదా? తదితర ప్రశ్నలకు సమాధానం రాబడతారు.
ఇలా సేకరించిన అభిప్రాయాన్ని యాప్‌లో నమోదు చేస్తారు. రోగులు ఎవరైనా సమస్యలు తెలియజేసినట్లయితే.. సంబంధిత జిల్లా కో–ఆర్డినేటర్‌ల లాగిన్‌కు వెళతాయి. కో–ఆర్డినేటర్ విచారణ చేపట్టి కారణాలను అన్వేషించాల్సి ఉంటుంది. రోగుల నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడిన సందర్భాల్లో రూ. 20 వేలలోపు డబ్బు వసూళ్ల ఆరోపణల్లో జిల్లా స్థాయిలో, ఆపైన వసూళ్ల కేసులను రాష్ట్ర స్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజారోగ్యానికి భరోసా
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజల ఆరోగ్యాలకు సీఎం జగన్ ప్రభుత్వం భరోసాగా ఉంటోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 1,059 ప్రొసీజర్లు ఈ పథకంలో అందుబాటులో ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య ఏకంగా 3,257కు పెంచారు. 2019 నుంచి ఈ ఏడాది ఆగస్టు నెలాఖరు నాటికి 46.12 లక్షల మందికి ఉచితంగా వైద్యం అందించారు. ఏకంగా రూ. 9,193.61 కోట్లు ఖర్చు చేశారు. చికిత్స అనంతరం విశ్రాంత సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కార్యక్రమం కింద ఆర్థికంగా చేయూత ఇస్తున్నారు. ఇలా రూ. వెయ్యి కోట్లకుపైగా ప్రభుత్వం రోగులకు సాయం చేసింది.
104కు ఫిర్యాదు చేయవచ్చు
ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు ఈ పథకం కింద పూర్తి ఉచితంగా అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆ మేరకు చర్యలు చేపడుతున్నాం. రోగుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టి అవకతవకలకు పాల్పడిన ఆస్పత్రులపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. ప్రజలు 104కు ఫిర్యాదు చేయవచ్చు.
– ఎం.ఎన్. హరేంధిరప్రసాద్, సీఈవో, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ
జవాబుదారీతనం పెరుగుతుంది
చికిత్స అనంతరం రోగుల నుంచి అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే ప్రజలు ఫిర్యాదు చేయడానికి వీలుంటుంది. ఇది మంచి పరిణామం. ఈ తరహా విధానాలతో నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాల్లో జవాబుదారీతనం పెరుగుతుంది. రోగులకు ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
– డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, ఏపీ ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment