దశాబ్దాల నిర్లక్ష్యానికి చికిత్స 'ప్రజారోగ్య విప్లవం' | Free Health treatment for above 59 lakh people across Andhra Pradesh | Sakshi
Sakshi News home page

దశాబ్దాల నిర్లక్ష్యానికి చికిత్స 'ప్రజారోగ్య విప్లవం'

Published Wed, Nov 15 2023 3:41 AM | Last Updated on Wed, Nov 15 2023 3:43 AM

Free Health treatment for above 59 lakh people across Andhra Pradesh - Sakshi

పల్నాడు జిల్లా యండ్రాయి, ధరణికోట గ్రామాల నుంచి సాక్షి ప్రతినిధి వడ్డే బాలశేఖర్‌:
ఈ ఫొటోలోని షేక్‌ రిహానాకు ఏడేళ్లు. పల్నాడు జిల్లా అమరావతి మండలం యండ్రాయి గ్రామం. తండ్రి జానీ చిరు వ్యాపారి, తల్లి ఫాతిమా గృహిణి. రిహానాకు పుట్టుకతో గుండె సమస్య ఉంది. దీనికి తోడు రెండేళ్ల వయస్సు వచ్చినా మాటలు రాలేదు. గుండె సమస్య కారణంగా మాటలు రావడం లేదని తొలుత తల్లిదండ్రులు భావించారు. కొద్ది రోజులకు గుంటూరు ఆస్పత్రిలో చూపించగా, పుట్టుకతో వినికిడి లోపం సమస్య కూడా ఉందని తేలింది. పాపకు మూడేళ్లు వచ్చాక గుండెకు సర్జరీ చేయించారు.

వినికిడి లోపం సమస్యకు చికిత్స చేయించాలంటే ఎంత ఖర్చు అవుతుందోనని భయపడి ఆగిపోయారు. డబ్బు సమకూర్చుకున్నాక వైద్యం చేయిద్దామనుకున్నారు. ఇలా రోజులు గడుస్తూ పాపకు ఏడేళ్లు వచ్చాయి. అందరు పిల్లలు గలగలా మాట్లాడుతుంటే రీహానా మాత్రం మౌనంగా ఉండటం చూసి తల్లిదండ్రులు ఆవేదనకు గురవ్వని రోజంటూ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం వీరికి కలిసొచ్చింది. గత నెల 6వ తేదీన గ్రామంలో సురక్ష క్యాంప్‌ నిర్వహించారు. తల్లి ఫాతిమా.. రిహానాను ఆ క్యాంప్‌నకు తీసుకెళ్లింది.

వైద్యులు పరీశీలించి గుంటూరు జీజీహెచ్‌కు రెఫర్‌ చేశారు. అక్కడ పలు పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చారు. అవి వాడాక వాస్తే మరికొన్ని పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఫలితాల ఆధారంగా స్పీచ్‌ థెరఫీ ఇవ్వడం లేదంటే కాక్లియర్‌ ఇంప్లాంటేషన్‌ సర్జరీ నిర్వహించడమో చేస్తామని తెలిపారు. ‘నా బిడ్డ మాట్లాడలేని స్థితిలో ఉండటం చూసి ఏడుపు వస్తోంది. సురక్ష క్యాంప్‌లో వైద్యులు చెప్పారని జీజీహెచ్‌కు వెళ్లొచ్చాను. పాపకు చికిత్స చేసి మాటలొచ్చేలా చేస్తామన్నారు.

నా బిడ్డకు మాటలొస్తే చాలు అంతకు మించి ఏమీ వద్దు’ అని ఫాతిమా అంటోంది. ‘మీరు అధైర్యపడొద్దు. వైద్య పరీక్షలకు వెళ్లండి. ఆశా వర్కర్‌ను మీకు తోడుగా పంపుతాను. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. ప్రభుత్వమే ఉచితంగా పాపకు మాటలు వచ్చేలా చికిత్స చేయిస్తుంది. ఆరోగ్యశ్రీ కింద రూ.12 లక్షల ఖరీదైన రెండు చెవులకు కాక్లియర్‌ ఇంప్లాంటేషన్‌ సర్జరీని ప్రభుత్వం ఉచితంగా చేయిస్తోంది’ అని అత్తలూరు పీహెచ్‌సీ డాక్టర్‌ రవిబాబు ఫాతిమాకు ధైర్యం చెప్పారు. ఇలా రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్యానికి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కొండంత అండగా నిలుస్తోంది.  
 

సీఎం జగన్‌ సర్కార్‌ ఆరోగ్య భరోసా
అనారోగ్య సమస్యలున్నప్పటికీ సుదూర ప్రాంతంలో ఉండే ఆస్పత్రులకు వెళ్లి చూపించుకోలేక కొందరు, నిర్లక్ష్యంతో మరికొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ప్రాణం విలువ తెలిసిన సీఎం వైఎస్‌ జగన్‌.. రాష్ట్రంలో ఏ ఒక్కరూ వైద్య సాయం అందక ఇబ్బంది పడటానికి వీల్లేకుండా ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించారు.

అయినప్పటికీ ఇంకా ఎవరైనా ప్రజలు వైద్యం అందక ఇబ్బంది పడుతున్నారేమోనని మరో అడుగు ముందుకు వేసి ప్రతి ఇంటిని జల్లెడ పట్టి.. ప్రజల ఆరోగ్య సమస్యలు, అవసరాలను గుర్తించి ఉచిత చికిత్సలు చేపట్టి, వైద్య పరంగా చేయి పట్టి నడిపించడం కోసం ఆరోగ్య సురక్షకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో అనేక సత్ఫలితాలు కనిపిస్తున్నాయి.

ఉన్న ఊళ్లోనే 59.30 లక్షల మందికి వైద్యం
ఏఎన్‌ఎం, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ (సీహెచ్‌వో) నేతృత్వంలోని వైద్య బృందాలు 1.44 కోట్లకు పైగా గృహాలను సందర్శించి ప్రజలను స్క్రీనింగ్‌ చేపట్టాయి. బీపీ, షుగర్, హెచ్‌బీ, మలేరియా, డెంగ్యూ వంటి ఏడు రకాల పరీక్షలను 6.50 కోట్ల మేర నిర్వహించారు. తద్వారా వివిధ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారిని గుర్తించి సురక్ష శిబిరాలకు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 9వ తేదీ నాటికి గ్రామాల్లో 9,982, పట్టణాల్లో 2,258 సురక్ష శిబిరాలను ప్రభుత్వం నిర్వహించింది.

ఒక్కో శిబిరంలో సగటున 485 చొప్పున 59,30,972 మందికి సొంత ఊళ్లలోనే వైద్య సేవలు అందించారు. ప్రతి శిబిరంలో జనరల్‌ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్, ఆప్తమాలజిస్ట్‌ వంటి స్పెషలిస్ట్‌ వైద్యులు అందుబాటులో ఉండి ప్రజలకు వైద్య సేవలు అందించారు. ప్రతి శిబిరం వద్ద ర్యాపిడ్‌ టెస్ట్‌లతో పాటు, ఈసీజీ, ఇతర వైద్య పరీక్షలు నిర్వహణతోపాటు, 172 రకాల మందులను అందుబాటులో ఉంచారు.  

ఖరీదైన వైద్యం పూర్తిగా ఉచితం
సురక్ష క్యాంప్‌లకు వచ్చిన వివిధ అనారోగ్య బాధితుల్లో మెరుగైన వైద్యం అవసరం ఉన్న వారిని ఆస్పత్రులకు రెఫర్‌ చేశారు. ఇలా 86,108 మందిని ఇప్పటి వరకు రెఫర్‌ చేయగా వీరందరికీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స చేపడుతోంది. గుండె, కిడ్నీ, మెదడు సంబంధిత జబ్బులు, క్యాన్సర్, ఇతర వ్యాధులకు ఖరీదైన చికిత్సలను పూర్తి ఉచితంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆఖరికి వీరు ఆస్పత్రులకు పోయి, రావడానికి అయ్యే ప్రయాణ చార్జీలు కూడా ప్రభుత్వమే అందిస్తోంది.

ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఇస్తోంది. ప్రతి రెఫరల్‌ కేసును స్థానిక పీహెచ్‌సీ వైద్యుడు, ఏఎన్‌ఎం, సీహెచ్‌వోల ద్వారా పర్యవేక్షిస్తూ వైద్యం అందించేలా చూస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ 19,934 మంది ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు వెళ్లగా, 1,634 మందికి అడ్మిషన్‌ అవసరం ఉందని వైద్యులు నిర్ధారించారు. మిగిలిన వారికి మెడికేషన్‌ అందించారు. అడ్మిషన్‌ అవసరం ఉన్న వారిలో 1,060 మందికి సర్జరీలు, చికిత్సలు పూర్తయ్యాయి. చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వారి ఆరోగ్యంపై వైద్య శాఖ నిరంతరం వాకబు చేస్తోంది. కాలానుగుణంగా ఎప్పటికప్పుడు అవసరమైన మందులు, వైద్య సేవలు అందించేలా చర్యలు చేపడుతోంది. 

ఈ ఫోటోలో వైద్యుడు రవిబాబు పరిశీలిస్తున్న ఉషారాణిది యండ్రాయి గ్రామమే. చిన్నపాటి పాడి రైతు. కొద్ది నెలల క్రితం కాలికి సర్జరీ చేయించుకుంది. అనంతరం కాలు వాపు రావడంతో పాటు, గాయాలు మొదలయ్యాయి. సర్జరీ కారణంగా ఇన్‌ఫెక్షన్‌ వచ్చిందేమోనని గుంటూరులోని పలు ఆస్పత్రుల్లో చూపించుకుంది. మందులు వాడినా సమస్య తగ్గలేదు. ఆరోగ్య సురక్షలో భాగంగా వైద్య సిబ్బంది ఇటింటి సర్వే నిర్వహించినప్పుడు ఆమె తన సమస్య వివరించింది. ఈ క్రమంలో సురక్ష శిబిరానికి హాజరవ్వమని సిబ్బంది సూచించారు.

గత నెల 6వ తేదీన శిబిరానికి హాజరైంది. స్పెషలిస్ట్‌ వైద్యులు ఆమెను పరిశీలించి బోద వ్యాధి లక్షణాలున్నాయని, అమరావతి సీహెచ్‌సీకి రెఫర్‌ చేశారు. వైద్య సిబ్బంది సహాయంతో ఆమె అక్కడికి వెళ్లింది. వైద్య పరీక్షల అనంతరం తెనాలిలోని ప్రభుత్వ ఫైలేరియా సెంటర్‌కు రెఫర్‌ చేశారు. అక్కడ బోద వ్యాధిగా నిర్ధారించారు. ఉచితంగా మందులు అందించారు. ఈ క్రమంలో ఉషారాణి మాట్లాడుతూ.. ‘ఊళ్లో ఆరోగ్య సురక్ష క్యాంప్‌ పెట్టి ప్రభుత్వం నాకు ఎంతో మేలు చేసింది. లేకుంటే నా సమస్యను ఇంకా నిర్లక్ష్యం చేసేదాన్ని.

నేను ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే వరకు వైద్య సిబ్బంది రోజు ఫాలోఅప్‌ చేశారు’ అని సంతోషం వ్యక్తం చేస్తోంది.1250 మంది జనాభా ఉన్న యండ్రాయి గ్రామంలో నిర్వహించిన సురక్ష క్యాంప్‌నకు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న 350 మంది హాజరయ్యారు. వీరిలో 88 మంది కంటి సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. మిగిలిన వారు గ్యాస్ట్రిక్, బీపీ, షుగర్‌ వంటి ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. కంటి సమస్యలున్న వారిలో 74 మందికి ఆప్తమాలజిస్ట్‌ సూచన మేరకు కళ్లద్దాల పంపిణీ చేపడుతున్నారు.

ఇక రిహాన, ఉషారాణి తరహాలో పలు తీవ్రమైన సమస్యలున్న నలుగురిని ఇతర ఆస్పత్రులకు రెఫర్‌ చేశారు. స్పెషలిస్ట్‌ వైద్య సేవల కోసం ఈ గ్రామస్తులు 25 కి.మీ దూరంలో ఉండే గుంటూరు జీజీహెచ్‌కు వెళ్తుంటారు. దీంతో ఒకసారి గుంటూరుకు పోయి రావాలంటే కనీసం రూ.500 చొప్పున రవాణా, ఇతర అవసరాల కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఒక రోజంతా పని మానుకోవాల్సి రావడంతో కూలి డబ్బులు నష్టపోవాల్సి వస్తుంది.

ఈ ఖర్చులకు భయపడి ఇదే గ్రామానికి చెందిన దస్తగిరి కొంత కాలంగా మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నప్పటికీ మందులు వేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. సురక్ష క్యాంప్‌లో స్పెషలిస్ట్‌ వైద్య సేవలుంటాయని స్థానిక ఏఎన్‌ఎం చెప్పడంతో హాజరయ్యాడు. తన సమస్యకు వైద్య సేవలు పొందాడు. క్యాంప్‌లోనే ఉచితంగా మందులు ఇచ్చారు. ఆ మందులు వాడినా సమస్య నయం అవ్వకపోతే తదుపరి వైద్యం ఉచితంగా అందిస్తామని చెప్పారు. 


చాలా సంతోషంగా ఉంది
నాకు 72 ఏళ్లు. రక్తపోటు, మధుమేహం సమస్యతో కొన్నేళ్లుగా బాధ పడుతున్నాను. గతంలో ప్రతి నెలా గుంటూరుకు మెడికల్‌ చెకప్‌ కోసం వెళ్లేవాడిని. ఒకసారి గుంటూరుకు పోయి, రావడానికి రూ.వెయ్యికి పైనే ఖర్చు అయ్యేది. ఈ ప్రభుత్వం వచ్చాక మా గ్రామంలోనే వైద్య సేవలు అందుతున్నాయి. ప్రతి నెలా మా గ్రామానికే డాక్టర్‌ వస్తున్నారు. దీంతో గుంటూరుకు వెళ్లడం మానేశాను. మందులు బాగా పని చేస్తున్నాయి. దీనికి తోడు ఈ మధ్య ఆరోగ్య సురక్ష క్యాంప్‌ పెట్టారు. గతంలో మేం వైద్యం కోసం వేరే ప్రాంతాలకు వ్యయ ప్రయాసలకోర్చి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మా వద్దకే వచ్చి వైద్యం చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది.  
– కె. పౌలేశు, యండ్రాయి, పల్నాడు జిల్లా

కిడ్నీ సమస్యను గుర్తించి చికిత్స
కొద్ది నెలలుగా నడుము భాగంలో నొప్పి వస్తుండేది. గుంటూరు వరకు పోయి చూపించుకోలేక ఏవో మందులు తెప్పించుకుని నొప్పి నుంచి విముక్తి పొందేదాన్ని. గ్రామంలో క్యాంప్‌ పెట్టడంతో వెళ్లాను. వైద్యులకు నా సమస్య వివరించాను. కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. క్యాంప్‌లోనే పలు మందులు ఇచ్చారు. జీజీహెచ్‌కు వెళ్లమని చీటీ ఇచ్చారు. ఆ మందులు వాడాక నొప్పి తగ్గుముఖం పట్టింది. జీజీహెచ్‌ కూడా వెళ్లొచ్చాను. క్యాంప్‌లో ఇచ్చిన మందులన్నీ వాడాక రమ్మన్నారు. 
– మొగల్‌ సబీరా, యండ్రాయి, పల్నాడు జిల్లా 

ఇంత శ్రద్ధ ఏ ప్రభుత్వం చూపలేదు
ఎనిమిదేళ్ల క్రితం నా గుండెకు స్టెంట్‌ వేశారు. రోజూ మందులు వాడటంతో పాటు, రెండు, మూడేళ్లకు ఓసారి పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. మందులు అయితే వాడుతున్నా కానీ పరీక్షలు చేయించుకోలేదు. మా ఊళ్లో పెద్ద డాక్టర్‌లతో క్యాంప్‌ పెడుతున్నారని చెబితే వెళ్లి చూపించుకున్నాను. వాళ్లు ఈసీజీ తీశారు. ఎందుకైనా మంచిదని గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లండని చెప్పారు. వెళ్లాను.. పరీక్షలు చేశారు. అంతా బాగుందని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చాక మా గ్రామంలోనే బీపీ, రక్తం పలుచబడే బిళ్లలు ఇస్తున్నారు. నెలనెలా డాక్టర్‌ వస్తున్నారు. వైఎస్సార్‌ కంటి వెలుగు కింద ఉచితంగా కంటి ఆపరేషన్‌ చేశారు. ఇన్ని విధాలుగా గతంలో ఏ ప్రభుత్వం మా ఆరోగ్యాలపై శ్రద్ధ చూపలేదు. 
– ఎస్‌.ఆదం, ధరణికోట, పల్నాడు జిల్లా

పెద్ద ఊరట కల్పించారు
వయోభారం రీత్యా కాళ్లు, నడుము నొప్పులతో కొన్నాళ్లుగా బాధపడుతున్నాను. పట్టణంలోని ఆస్పత్రికి వెళ్లాలంటే ఎవరో ఒకరు తోడుండాలి. దీనికి తోడు రానుపోను చార్జీలు, ఇతర ఖర్చులు పెట్టుకోవాలి. ఇంట్లో ఎవరైనా పట్టణానికి పోయినప్పుడు తెచ్చి ఇచ్చే మాత్రలు వేసుకుంటూ కాలం వెల్లదీస్తుండేదాన్ని. ఈ పరిస్థితుల్లో గ్రామంలో క్యాంప్‌ పెట్టారని వలంటీర్‌ చెప్పడంతో వెళ్లాను. నాకున్న సమస్యలు చెప్పాను. మందులు ఇచ్చారు. అవి వేసుకుంటుంటే నొప్పులు తగ్గాయి. గ్రామంలోనే వైద్య శిబిరం పెట్టి చాలా పెద్ద ఊరట కల్పించారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులకు నెలనెలా ఇంటి వద్దకే పింఛన్‌ పంపిణీ చేస్తున్నట్టే, వైద్య సేవలను చేరువ చేసి పుణ్యం కట్టుకున్నారు. 
– కింతలి రాజేశ్వరమ్మ, తోనంగి, గార మండలం, శ్రీకాకుళం జిల్లా.

ప్రతి కేసుపై ప్రత్యేక శ్రద్ధ
పీహెచ్‌సీ పరిధిలోని సురక్ష శిబిరాల్లో సుమారు ఏడు వేల మంది వైద్య సేవలు అందుకున్నారు. 168 మందిని ఆస్పత్రులకు రెఫర్‌ చేశారు. ప్రతి రెఫరల్‌ కేసుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. రెఫరల్‌ కేసుల్లో సంబంధిత వ్యక్తులను ఆస్పత్రులకు తరలించి, అక్కడ వైద్య సేవలు అందేలా పర్యవేక్షిస్తున్నాం. అవసరం మేరకు ఆశ వర్కర్‌ను తోడు పంపి మరీ వైద్య సేవలు అందిస్తున్నాం. చికిత్స అనంతరం డిశ్చార్జి అయిన రోగుల ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్యంపై వాకబు చేస్తున్నాం. 
– డాక్టర్‌ రవిబాబు, మెడికల్‌ ఆఫీసర్, అత్తలూరు పీహెచ్‌సీ, పల్నాడు జిల్లా

నెలలో మండలంలో నాలుగు చోట్ల
నిరంతరాయంగా ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టాలని సీఎం ఆదేశించారు. జనవరి నుంచి ప్రతి మండలంలో నెలలో నాలుగు చోట్ల సురక్ష శిబిరాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇక ఇప్పటికే శిబిరాల నుంచి వచ్చిన రెఫరల్‌ కేసులన్నింటికీ వంద శాతం మెరుగైన, నాణ్యమైన చికిత్సలు అందించడానికి చర్యలు వేగవంతంగా చేపడుతున్నాం.
– జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement