కృష్ణా జిల్లా వణుకూరు–2లోని వైఎస్సార్ విలేజ్ క్లినిక్.. ఓ వ్యక్తికి వైద్య పరీక్ష చేస్తున్న సిబ్బంది
ఆ గుండెకు ధైర్యం..
కృష్ణా జిల్లా వణుకూరుకు చెందిన కె.సరోపరాణి హృద్రోగ బాధితురాలు. రెండున్నరేళ్ల క్రితం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా స్టెంట్ వేసి ప్రాణాన్ని కాపాడారు. క్రమం తప్పకుండా మందులు వాడుకుంటూ బీపీ, షుగర్ పరీక్షించుకోవాలని డాక్టర్లు ఆమెకు సూచించారు. గతంలో ఐదు కి.మీ ప్రయాణించి కంకిపాడు లేదా విజయవాడ వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు గ్రామంలోనే డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ద్వారా ఉచితంగా పరీక్షలు, మందులు ఇవ్వడంతోపాటు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్టతో సొంతూరిలోనే వైద్య సేవలు అందడం ఆమెకు ఎంతో ఊరటనిస్తోంది. ‘గుండె జబ్బు బారిన పడ్డాక నేను కూలికి వెళ్లట్లేదు. మా అబ్బాయి సంపాదనే ఆధారం. వ్యయ ప్రయాసలకు భయపడి గతంలో వైద్య పరీక్షలకు వెళ్లకుండా చాలాసార్లు నిర్లక్ష్యం చేశా. ఇప్పుడు గ్రామంలోనే అన్నీ అందుతున్నాయి. డాక్టర్ వచ్చి పరామర్శిస్తున్నారు’ అని సంతోషం వ్యక్తం చేసింది.
(వడ్డే బాలశేఖర్ – వణుకూరు, బోళ్లపాడు గ్రామాల నుంచి సాక్షి ప్రతినిధి): రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో నెలకొల్పిన పది వేలకుపైగా వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ద్వారా వై ద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం రోగుల చెంతకే చేర్చింది. పల్లె పల్లెకు ఆరోగ్య భరోసా కల్పిస్తోంది. చాపకింద నీరులా గ్రామాల్లోనూ విస్తరిస్తున్న జీవన శైలి జబ్బులను ప్రాథమిక దశలోనే గుర్తించి అరికట్టే లక్ష్యంతో విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది. ఒక్కో పీహెచ్‌సీకి ఇద్దరు చొప్పున మండలానికి నలుగురు డాక్టర్లను నియమించి గ్రామీణ వైద్య వ్యవస్థను బలోపేతం చేసింది.
జీవన శైలి వ్యాధులను ఆదిలోనే గుర్తించడం ద్వారా ప్రాణాంతకం కాకుండా నివారించవచ్చు. రక్తపోటు లాంటి వాటికి సకాలంలో చికిత్స చేయకుంటే నరాల జబ్బులు, కార్డియాక్ అరెస్టు, పక్షవాతం బారిన పడే ప్రమాదం ఉంది. డయాబెటిస్‌కు సరైన సమయంలో చికిత్స చేయకుంటే కిడ్నీ సమస్యలకు దారి తీస్తుంది. గ్రామీణులకు సొంతూరిలోనే మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంటే ఇలాంటి వాటిని నియంత్రించడం సులభం అవుతుంది.
ఇప్పుడు వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థలు సరిగ్గా అదే పని చేస్తున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ క్రమం తప్పకుండా గ్రామాలను సందర్శించడంతో స్థానికులతో మంచి అనుబంధం ఏర్పడుతోంది. అందరినీ గుర్తు పట్టి పేరుతో పిలిచేంత సన్నిహితంగా మసలుకుంటున్నారు. వారు సూచించిన విధంగా ఆహార అలవాట్లను మార్చుకోవడం, తగిన వ్యాయామాల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు.
ఇక స్పెషలిస్టు డాక్టర్ల వైద్య సేవలు పొందాలంటే గతంలో ఎన్నో వ్యయ ప్రయాసలను అధిగమించాల్సి వచ్చేది. దూరాభారం కావడం వల్ల కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు తోడుగా రావాల్సిందే! ఇప్పుడా కష్టాలు లేవు. టెలీమెడిసిన్ ద్వారా గైనకాలజీ, పీడియాట్రిక్స్ లాంటి స్పెషలిస్ట్ డాక్టర్ల సేవలను సైతం గ్రామంలోని క్లినిక్స్ నుంచే పొందగలుగుతున్నారు. వారి సూచనల మేరకు మందులను సైతం ఉచితంగానే ఇస్తున్నారు.
ఈ–సంజీవని ఓపీ యాప్ ద్వారా కూడా స్మార్ట్ ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరు టెలీమెడిసిన్ సేవలను పొందవచ్చు. స్మార్ట్ ఫోన్‌ను వినియోగించడం రానివారు, విలేజ్ క్లినిక్ వరకూ వెళ్లలేని వృద్ధులు, వికలాంగులు, మంచానికే పరిమితం అయిన వారికి ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు ఇంటి వద్దకే వెళ్లి మొబైల్ ద్వారా టెలీమెడిసిన్ సేవలను అందిస్తున్నారు. టెలిమెడిసిన్ ద్వారా వృద్ధులు, మహిళలకు సేవలందించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంట్‌లో ప్రకటించడం గమనార్హం.
కృష్ణా జిల్లా వణుకూరు, బోళ్లపాడు గ్రామాల్లో పర్యటించిన ‘సాక్షి’ ప్రతినిధి వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ ద్వారా అందుతున్న సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. వణుకూరు విలేజ్ క్లినిక్–2 పరిధిలో 3,412 జనాభా ఉండగా 148 మంది బీపీ, 152 మంది షుగర్ బాధితులు ప్రయోజనం పొందుతున్నారు. ఈ రెండు సమస్యలున్న బాధితులు 70 మంది ఉన్నారు.
గర్భిణులు 18 మంది, బాలింతలు 10 మందికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ మందులు అందిస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా పీహెచ్‌సీ వైద్యుడు డాక్టర్ రవికుమార్ గ్రామానికి వస్తున్నారు. మంచానికే పరిమితం అయిన 12 మంది బాధితులకు ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. బోళ్లపాడులో 1,600 మందికిపైగా వైద్య సేవలు అందుతున్నాయి.
12 రకాల వైద్య సేవలు.. 14 పరీక్షలు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక గ్రామీణ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా 2,500 జనాభాకు ఒకటి చొప్పున 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను నెలకొల్పింది. వీటిల్లో వైద్య సేవలు అందించేందుకు బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల (ఎంఎల్‌హెచ్‌పీ) నియామకం చేపట్టి సీహెచ్‌వో హోదా కల్పించింది.
వీరితో పాటు సచివాలయాల ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు విలేజ్ క్లినిక్‌లలో సేవలు అందిస్తున్నారు. క్లినిక్‌లలో 12 రకాల వైద్య సేవలు, 14 రకాల వైద్య పరీక్షలు, 105 రకాల మందులు అందుబాటులో ఉంటున్నాయి. విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.1,692 కోట్లు వెచ్చించింది. ప్రతి విలేజ్ క్లినిక్‌కు శాశ్వత భవనాలను సమకూర్చారు.
గ్రామ స్థాయిలో పటిష్ట వ్యవస్థ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం అమలులో విలేజ్ క్లినిక్‌లే కేంద్ర బిందువులుగా ఉంటున్నాయి. విలేజ్ క్లినిక్ యూనిట్‌గా ప్రతి గ్రామాన్ని పీహెచ్‌సీ వైద్యులు నెలలో రెండు సార్లు సందర్శిస్తున్నారు. విలేజ్ క్లినిక్‌లోనే ఫ్యామిలీ డాక్టర్ క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. 10,032 విలేజ్ క్లినిక్స్‌ను ఇప్పటివరకూ 2.05 లక్షల సార్లు వైద్యులు సందర్శించారు.
1.70 కోట్లకు పైగా సేవలు ఫ్యామిలీ డాక్టర్ విధానంలో నమోదు అయ్యాయి. గ్రామ స్థాయిలోనే వైద్య సేవల కల్పనకు ఇంత పటిష్టమైన వ్యవస్థ ఉండటంతో చాలా వరకు ఆరోగ్య సమస్యలకు గ్రామాల్లోనే పరిష్కారం లభిస్తోంది. బీపీ, షుగర్, ఇతర జీవన శైలి జబ్బులను ప్రాథమిక దశలోనే గుర్తించగలుగుతున్నారు.
వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ సేవలు ఇలా
► గర్భిణులు, చిన్నారుల సంరక్షణ
► నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ
► బాల్యం, కౌమార దశ ఆరోగ్య సేవలు
► కుటుంబ నియంత్రణ, గర్భ నిరోధక సేవలు, పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ సేవలు
► జీవన శైలి జబ్బుల స్క్రీనింగ్, నివారణ, నియంత్రణ, నిర్వహణ
► అంటువ్యాధుల నిర్వహణ, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు
► సాధారణ అనారోగ్యాలు, చిన్న జబ్బులకు జనరల్ అవుట్ పేషెంట్ కేర్
► ఆఫ్తాల్మిక్ (కంటి సమస్యలు), ఈఎన్‌టీ సమస్యలపై జాగ్రత్తలు
► దంత ఆరోగ్య సంరక్షణ
► వృద్ధాప్య వ్యాధులకు చికిత్స, ఉపశమన ఆరోగ్య సంరక్షణ సేవలు
► కాలిన గాయాలు, ప్రమాదాల్లో గాయపడిన (ట్రామా) వారికి అత్యవసర వైద్య సేవలు
► మానసిక ఆరోగ్య వ్యాధుల స్క్రీనింగ్, ప్రాథమిక నిర్వహణ, అనారోగ్య సమస్యలను జయించడం, మానసిక ప్రశాంతత కోసం రోగులకు యోగాపై అవగాహన
7.12 కోట్ల ఓపీలు నమోదు
2020లో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ విలేజ్ క్లినిక్ సేవలను ప్రారంభించారు. ఇప్పటివరకూ 7,12,08,533 ఓపీ సేవలు నమోదు అయ్యాయి. వివిధ సమస్యలతో క్లినిక్స్‌కు వచ్చిన బాధితులకు డాక్టర్ సలహాల కోసం 3 కోట్ల టెలీ కన్సల్టేషన్‌లు నిర్వహించారు. ప్రస్తుతం ఒక్కో క్లినిక్‌లో రోజుకు సగటున 30 నుంచి 40 వరకూ ఓపీలు, 10 వైద్య పరీక్షలు, 10 టెలీ కన్సల్టేషన్లు నమోదవుతున్నాయి.
రోజంతా సరిపోయేది...
నాకు బీపీ, షుగర్ సమస్య ఉంది. గతంలో 15 రోజులకు ఒకసారి విజయవాడ ఆస్పత్రికి వెళ్లేదాన్ని. ఒక రోజంతా సరిపోయేది. ఇప్పుడు ఆ సమస్య లేదు. గ్రామంలోనే క్లినిక్‌కు రెండు వారాలకు ఒకసారి వెళ్తున్నా. అక్కడ ఇచ్చే మందులు బాగా పనిచేస్తున్నాయి.
– ఎం.రాణి, వణుకూరు, కృష్ణా జిల్లా
వ్యయప్రయాసలు తొలిగాయి
వయసు మళ్లడంతో ఆరోగ్య సమస్యల కారణంగా రెండు వారాలకు ఒకసారి విలేజ్ క్లినిక్‌కు వస్తుంటా. బీపీ, షుగర్ చెక్ చేయించుకుని దగ్గుకు మందులు తీసుకుంటున్నా. గతంలో పీహెచ్‌సీకి వెళ్లాలంటే ఆటో, బైక్‌లపై వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు గ్రామానికే పీహెచ్‌సీ డాక్టర్ వస్తున్నారు. గ్రామంలోనే విలేజ్ క్లినిక్ ఏర్పాటుతో వ్యయ ప్రయాసలు తొలిగాయి. అవసరమైతే కంప్యూటర్‌లో పెద్ద డాక్టర్‌తో మాట్లాడిస్తున్నారు.
– కె. మధు, వణుకూరు, కృష్ణా జిల్లా
రోజుకు 40 ఓపీలు
గ్రామస్తులకు ఏ చిన్న ఆరోగ్య సమస్య ఉన్నా ప్రస్తుతం విలేజ్ క్లినిక్‌కే వస్తున్నారు. ఇక్కడ రోజుకు 40 వరకూ ఓపీలు నమోదవుతుంటాయి. 30 ఏళ్లుపైబడిన వారందరికీ జీవనశైలి జబ్బుల స్క్రీనింగ్ చేశాం. బీపీ, షుగర్ బాధితులను గుర్తించి వారికి ఫ్యామిలీ డాక్టర్ ద్వారా రెగ్యులర్ హెల్త్ చెకప్ జరిగేలా ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది.
– యామిని, సీహెచ్‌వో వణుకూరు–2 వైఎస్సార్ విలేజ్ క్లినిక్, కృష్ణా జిల్లా
నైపుణ్యాలపై శిక్షణ..
ఇంజెక్షన్‌లు ఇవ్వడం, సెలైన్ ఎక్కించడం, కుట్లు వేయడం, కట్లు కట్టడం లాంటి ప్రాథమిక చికిత్స విధానాల్లోని నైపుణ్యాలపై మాకు ఇటీవలే శిక్షణ ఇచ్చారు. పీహెచ్‌సీ వైద్యుడి సూచన మేరకు సెలైన్, ఇంజెక్షన్లు చేయడం లాంటి విధులను నేను
ప్రధానంగా నిర్వహిస్తున్నా.
– శివకృష్ణ, సీహెచ్‌వో బోళ్లపాడు వైఎస్సార్ విలేజ్ క్లినిక్, కృష్ణా జిల్లా
సీహెచ్‌వోలకు ప్రత్యేక శిక్షణ
గ్రామ స్థాయిలోనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న సీఎం వైఎస్ జగన్ లక్ష్యానికి అనుగుణంగా వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలులోకి వచ్చాయి. సీహెచ్‌వోల్లో నైపుణ్యాల పెంపు ద్వారా ప్రజలకు మరింత మెరుగ్గా వైద్య సంరక్షణ అందించాలని సీఎం ఆదేశించారు. ప్రత్యేక కరిక్యులమ్‌ను రూపొందించి వారికి శిక్షణ ఇచ్చాం. ఇంజెక్షన్ చేయడం, కుట్లు వేయడం, సెలైన్ ఎక్కించడం, పాము కాట్లు, గుండె పోటు సందర్భాల్లో అందించాల్సిన ప్రాథమిక చికిత్సపై అవగాహన కల్పించాం. జబ్బులు రాకముందే నివారించడం ఎంతో కీలకం. ప్రపంచాన్ని వేధిస్తున్న జీవన శైలి జబ్బులతోపాటు ఇతర రుగ్మతలను నివారించడంలో విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ విధానం ముఖ్య పాత్ర
పోషిస్తున్నాయి.
– ఎం.టి. కృష్ణబాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ
కుటుంబమంతా.. గ్రామంలోనే వైద్యం
గతంలో వైద్యం కోసం చాలా ఇబ్బందులు పడ్డాం. జలుబు, జ్వరం లాంటి చిన్న సమస్యలకు ఐదు కిలోమీటర్లు ప్రయాణించి కాటూరు, ఉయ్యూరు వెళ్లాల్సి వచ్చేది. అంత దూరం వెళ్లలేక ఆర్‌ఎంపీలపై ఆధారపడేవాళ్లం. ఇప్పుడు గ్రామంలో విలేజ్ క్లినిక్ ఏర్పాటైంది. ప్రతి నెల ఒకటో శుక్రవారం, మూడో శనివారం పీహెచ్‌సీ డాక్టరమ్మ మా ఊరికే వస్తోంది. నాకు బీపీ, గ్యాస్ సమస్య ఉంది. ఇంట్లో ఎవరికి ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా క్లినిక్‌కే వెళ్తున్నాం.
– వీర వెంకటేశ్వరరెడ్డి, బోళ్లపాడు, కృష్ణా జిల్లా
ఇంటి పక్కనే నిశ్చింతగా..
ఉయ్యూరు మండలం బోళ్లపాడుకు చెందిన వి.శ్రీదేవి కొన్నేళ్లుగా బీపీ, గ్యాస్ సమస్యతో బాధపడుతోంది. 1,624 మంది జనాభా నివసించే గ్రామంలో విలేజ్ క్లినిక్ ఏర్పాటు కావడంతో శ్రీదేవి రెండున్నరేళ్లుగా అక్కడే వైద్యం, మందులు ఉచితంగా అందుకుంటోంది. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో) బీపీ, షుగర్ పరీక్షలు చేసిన తరువాత టెలీ మెడిసిన్ ద్వారా స్పెషలిస్ట్ వైద్యుడితో ఆన్‌లైన్‌లో మాట్లాడుతోంది.
ఫ్యామిలీ డాక్టర్ ద్వారా కాటూరు పీహెచ్ డాక్టర్ నెలకు రెండు సార్లు విలేజ్ క్లినిక్‌కు వస్తున్నారు. శ్రీదేవి ఆరోగ్యంపై ఆరా తీస్తూ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. ‘గతంలో హెల్త్ చెకప్, మందుల కోసం వెళ్లాలంటే ఓ ప్రహసనమే. కుటుంబ సభ్యుల్లో ఎవరో కచ్చితంగా తోడుండాల్సిందే. ఇప్పుడా సమస్య లేదు. మా ఇంటి పక్కనే విలేజ్ క్లినిక్ ఉంది. ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా ఇక భయం లేదు’ అని శ్రీదేవి నిశ్చింతగా చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment