మా పెద్దమ్మకు బైపాస్ సర్జరీ అయ్యింది. ఆమె విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. – అమరనాథరెడ్డి, కర్నూలు
బైపాస్ సర్జరీ చేయించుకున్న వాళ్లు మొదటి ఆరు వారాల్లో ఈ కింద సూచించిన జాగ్రత్తలు తీసుకోవాలి.∙శస్త్రచికిత్స కోసం శరీరంపై గాటు పెట్టిన చోట ఎలాంటి ఒత్తిడీ పడకుండా చూసుకోండి ∙డాక్టర్లు సూచించిన మందులు క్రమం తప్పకుండా తీసుకోండి ∙కొలెస్ట్రాల్ పాళ్లను అదుపులో ఉంచుకోండి. అందుకోసం డాక్టర్లు సూచించిన ఆహార, వ్యాయామ నియమాలను తప్పక పాటించండి ∙రక్తపోటును అదుపులో ఉంచుకోండి. ఇందుకోసం డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూనే... రిలాక్సేషన్ ప్రక్రియలైన ధ్యానం, యోగా వంటివి చేయండి ∙రక్తంలో చక్కెర పాళ్లను తెలుసుకునే పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకుంటూ, మీ డాక్టర్‌కు తెలియజేస్తూ ఉండండి. అందులో వచ్చిన మార్పులను బట్టి వైద్యులు మీ మందులను మార్చడం వంటివి చేస్తారు ∙సిగరెట్ పొగకు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎక్స్‌పోజ్ కావద్దు. అది రక్తనాళాల మృదుత్వాన్ని దెబ్బతీయడంతో పాటు అవి రక్తనాళాలు సన్నబారేలా చేస్తుంది; గుండె వేగాన్ని పెంచుతుంది. కాబట్టి పొగాకు ఏరూపంలోనైనా మంచిది కాదు ∙మద్యంకూడా గుండెకు హానిచేసేదే
∙ఒత్తిడికి గురికావడం రక్తపోటును పెంచి, గుండెపోటుకు దారితీసేలా చేసే అంశం. కాబట్టి ఒత్తిడి లేకుండా చూసుకోండి ∙ఒకే చోట కూర్చొని ఉండకండి. చురుగ్గా ఉండే జీవనశైలి మార్పుతోనూ గుండెజబ్బును నివారించుకోండి ∙డాక్టర్లు సూచించిన ఆరోగ్యకరమైన వ్యాయామాలను రోజుకు రెండుసార్లు... పదినిమిషాల పాటు చేయాలి ∙ఏమాత్రం భారం పడకుండా పది పదిహేను నిమిషాల పాటు రోజుకు రెండుసార్లు నడక (వాకింగ్)కు ఉపక్రమించాలి
∙అకస్మాత్తుగా ముందుకు, వెనక్కు, పక్కలకు ఒంగడం వంటివి చేయకూడదు ∙మూడు కిలోలకు మించిన బరువు కనీసం నెలరోజుల పాటు ఎత్తవద్దు ∙నేల మీద కూర్చోవడం, కాలుమీద కాలేసుకోవడం వంటివి చేయకండి.
అరిథ్మియా అంటే ఏమిటి?
నా వయసు 35 ఏళ్లు. రెండు వారాల క్రితం అకస్మాత్తుగా స్పృహ కోల్పోయాను. స్పృహవచ్చాక చాలా నీరసంగా అనిపించింది. కళ్లు తిరుగుతున్నట్లుగా అనిపించడం, ఆయాసంగా ఉండటం, ఊపిరితీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం వంటి లక్షణాలు కనిపించాయి. డాక్టర్‌ను కలిస్తే ఎరిథ్మియా ఉండవచ్చు అని అన్నారు. అసలు అరిథ్మియా అంటే ఏమిటి? నాకు చాలా ఆందోళనగా ఉంది. తగిన సలహా ఇవ్వండి. – సుబ్బారావు, పెందుర్తి
సాధారణంగా మన గుండె మామూలుగా నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకోవాలి. అలా కాకుండా 60 కన్నా తగ్గినా లేదా 100 కన్నా పెరిగినా ఆ కండిషన్‌ను అరిథ్మియా అంటారు. కానీ ఎవరైనా తీవ్ర భయాందోళనలకు గురైనప్పుడు, వ్యాయామం చేసినప్పుడు గుండె వేగం 100 నుంచి 160 మధ్యన ఉంటుంది. దీన్ని సైనస్ టాకికార్డియా అంటారు. ఇలా కాకుండానే గుండె వేగం దానంతట అదే ఇంకా పెరిగితే అది జబ్బువల్ల కావచ్చు. ఈ లక్షణంతో మరికొన్ని రకాల గుండెజబ్బులు ఉండవచ్చు. సమస్య ఏదైనా గుండె వేగం మరింత పెరిగినా లేదా తగ్గినా స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. మీరు కూడా స్పృహ కోల్పోయినట్లు చెప్పారు కాబట్టి వెంటనే దగ్గర్లోని కార్డియాలజిస్ట్‌ని కలిసి ఈసీజీ, ఎకో, హోల్టర్ పరీక్షల్లాంటివి చేయించండి. మీరు స్పృహ కోల్పోడానికి గుండె జబ్బే కారణమా, మరి ఇంకేదైనా సమస్య వల్ల ఇలా జరిగిందా తెలుసుకొని దానికి తగిన విధంగా చికిత్స తీసుకోవడం అవసరం. ఇప్పుడు ఆధునిక వైద్య విజ్ఞానం వల్ల అన్ని రకాల జబ్బులకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ఆందోళన చెందకండి.
డాక్టర్ హేమంత్ కౌకుంట్ల
కార్డియో థొరాసిక్ సర్జన్, సెంచరీ హాస్పిటల్స్,
బంజారాహిల్స్, హైదరాబాద్.
Comments
Please login to add a commentAdd a comment