ఇప్పుడు హైదరాబాద్‌లోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్‌టిట్యూట్‌లోనే... | Now in Hyderabad, the American Institute of Oncology ... | Sakshi
Sakshi News home page

ఇప్పుడు హైదరాబాద్‌లోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్‌టిట్యూట్‌లోనే...

Published Sat, Jan 4 2014 11:11 PM | Last Updated on Thu, Apr 4 2019 3:19 PM

Now in Hyderabad, the American Institute of Oncology ...

రెండు దశాబ్దాల క్రితం వరకు కూడా బైపాస్ సర్జరీ అంటే మన దగ్గర ఓ అబ్బురం. ఆర్థికంగా ఉన్నవారు, పలుకుబడిగల వారు అమెరికా వెళ్లి సర్జరీ చేయించుకుని వచ్చేవారు. కారణం... అప్పట్లో బైపాస్ సర్జరీ చేసే డాక్టర్లు అమెరికాలోనే ఉండేవారు. కానీ ఇప్పుడా చికిత్స ఇక్కడి  ఓ మోస్తరు ఆసుపత్రుల్లో సైతం రోజూ జరిగే ప్రక్రియ. అలాగే ఇప్పుడు కేవలం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు జరిగే ఉన్నతస్థాయి శస్త్రచికిత్సలు అమెరికాలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. మనదేశంలోని అత్యంత పెద్దస్థాయి వైద్యకేంద్రాల్లోనూ కేవలం ప్రస్తావనాపూర్వకంగా ఉన్న ఈ విభాగంలో ప్రత్యేక శిక్షణను అమెరికాలోని అత్యంత ఉన్నతస్థాయి సంస్థల్లో పొంది వచ్చిన డాక్టర్ సాయి యండమూరి... ఇప్పుడు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో ఈ విభాగంలో ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు చేసే అత్యంత నైపుణ్యమైన శస్త్రచికిత్స గురించి చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే...
 
 ప్ర: మన దేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాప్తి, విస్తృతి గురించి చెప్పండి  
 డా. సాయి యండమూరి: మన దేశంలో... పురుషుల్లో వచ్చే క్యాన్సర్లలో అది గణనీయమైన స్థానంలోనే ఉంది. పాశ్చాత్యదేశాల్లోలాగా అది తగ్గుముఖం పట్టాలంటే మరో పాతికేళ్లు పడుతుంది. అప్పటివరకూ ఇక్కడ ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా సంభవించే మరణాలను అరికట్టాలి కదా. అందుకు ఆ స్థాయి చికిత్స అవసరం.
 
 ప్ర: మరి అలా అరికట్టడం సాధ్యమేనా?
 డా. సాయి: ఇది జబ్బు ఏ దశలో ఉందనే అంశంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మొదటి దశలో గుర్తిస్తే 70% నుంచి 75% ప్రాణహాని పూర్తిగా తగ్గుతుంది. అదే రెండోదశలో గుర్తిస్తే 50 శాతం, మూడోదశలో గుర్తిస్తే కేవలం 20% నుంచి 25శాతం మాత్రమే కాపాడగలం. నాలుగోదశలోకి ప్రవేశిస్తే నయం కావడం చాలా కష్టం. ఇంతగా నయం చేయగలగడానికి అవకాశం ఉన్న ఈ క్యాన్సర్‌కు స్క్రీనింగ్ చాలా సులభం. కేవలం ఒక్క సీటీ స్కాన్‌తోనే దీన్ని గుర్తుపట్టవచ్చు.
 
 ప్ర: మీరు చేసే చికిత్స తీరుతెన్నులు...?
 డా. సాయి: నేను అమెరికాలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, అత్యున్నత స్థాయి సంస్థల్లో పనిచేశా. అక్కడ సూపర్‌స్పెషాలిటీలో శిక్షణ తర్వాత మళ్లీ అందులోనే మరింత నైపుణ్యం సాధించడానికి సబ్-స్పెషాలిటీని ఎంచుకోవాలి. అప్పుడు నేను కార్డియోథొరాసిక్ విభాగాన్ని గాక... కేవలం థొరాసిక్ సర్జరీని ఎంచుకున్నా. కార్డియోథొరాసిక్‌లో శిక్షణ పొందినవారు గుండె, ఛాతీ భాగంలోని ఊపిరితిత్తులు ఈ రెండింటినీ అధ్యయనం చేస్తారు. అయితే నేను గుండెను మినహాయించి... అంతే శిక్షణను కేవలం ఊపిరితిత్తుల భాగానికే కేటాయించి, నైపుణ్యం పొందగలిగాను. అంత సబ్-స్పెషాలిటీ స్థాయి శిక్షణ పొందినవారు అమెరికాలోనే కాస్త తక్కువ. మా శిక్షణ  ఎంత నిశితంగా ఉంటుందంటే... ఇప్పుడు కేవలం నాలుగు సెం.మీ. గాటుతో ఊపిరితిత్తుల్లో దాదాపు సగభాగానికి సమర్థమైన శస్త్రచికిత్స చేయడం సాధ్యం. ఇక ఈ నాలుగు సెం.మీ. గాటుతో పాటు మరో రెండు చోట్ల ఒక సెం.మీ., ఒక సెం.మీ. పరిమాణం గల రెండు గాట్లతో పూర్తి ఊపిరితిత్తులకు శస్త్రచికిత్స చేయగల సామర్థ్యాన్ని మా టీమ్ సాధించింది. ఎండోబ్యాగ్ అనే చిన్న సంచిలో ఊపిరితిత్తులను ఉంచి ఈ చిన్నపాటి రంధ్రాల నుంచే వాటిని బయటకు తీసి, క్యాన్సర్ కణుతులను, గడ్డలను పూర్తిగా తొలగించవచ్చు. పైగా మేం శిక్షణ పొందిన తరహా శస్త్రచికిత్సలో గాటు చాలా తక్కువ కావడంతో అది తగ్గడానికీ పట్టే సమయం తక్కువ. ఇన్ఫెక్షన్లు తక్కువ. నిమోనియా వంటి కాంప్లికేషన్లూ తక్కువ. కేవలం రెండు వారాల్లోనే నయమవుతుంది. ఆసుపత్రిలో ఉండే సమయం కూడా తగ్గుతుంది. పైగా శస్త్రచికిత్స చేసిన చోట నొప్పి ఉండదు.
 
 ప్ర: ఇంత శిక్షణ పొంది, ఆ స్థాయిలో శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్న మీరు ఇక్కడికి రావడానికి కారణం?
 డా. సాయి: రెండు మూడు దశాబ్దాల క్రితం బైపాస్‌ను ఎంత సంక్లిష్టంగా పరిగణించేవారో అందరికీ తెలిసిందే. అప్పుడు అదెంతటి సంక్లిష్టమో, ఇప్పుడు నేను నిర్వహించే తరహా ఆపరేషన్లు సైతం అంతే సంక్లిష్టం. ఒకప్పుడు అమెరికన్ నిపుణులు ఇక్కడికి వచ్చి ఇక్కడా వారి స్థాయి నైపుణ్యం గల వారిని తయారు చేశారు. అదే తరహా నైపుణ్యం (ఎక్స్‌పర్టైజ్) ఇప్పుడు ఊపిరితిత్తుల విషయంలో మనకు అవసరం. ఎందుకంటే ఇక్కడి రోగుల సంఖ్య, ఇక్కడి ఊపిరితిత్తుల జబ్బుల వ్యాప్తి, విస్తృతి, డిమాండ్‌కు తగినట్లుగా నిపుణులు లేరు. మనకూ ఆ స్థాయి నిపుణుల అవసరం ఉంది. అందుకే నేను కేవలం శస్త్రచికిత్సలు చేయడం కంటే... నా స్థాయిలో చేయగలిగేవారిని పదిమందిని తయారు చేస్తే ఇక్కడి రోగుల అవసరాలను సమర్థంగా తీర్చగలనని అనిపించింది. అమెరికా స్థాయి నైపుణ్యం మనకూ కావాలన్న సంకల్పంతో నేనీదేశానికి వచ్చా. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా... మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉన్న పెద్దవైద్యకేంద్రాల్లోనూ అమెరికా స్థాయి వైద్యం అందేలా నిపుణులను తయారు చేసే పనిలో కొందరు ఉన్నారు. నాదీ అదే ఉద్దేశం కావడంతో నాలాంటి దృష్టికోణంతో పనిచేసే వారితో పాటు ఆ  క్రతువులో నేనూ భాగస్వామిని అవుతున్నాను. ఇప్పుడు బైపాస్ విషయంలో ఏం జరుగుతోందో... త్వరలో ఊపిరితిత్తుల సర్జరీల విషయంలోనూ అదే జరగాలని నా కోరిక.
 
 ప్ర:హైదరాబాద్‌నే కేంద్రంగా ఎంచుకోడానికి కారణం?
 డా. సాయి: నేను అమెరికాలోని అంతర్జాతీయ స్థాయి సంస్థలో, ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సంస్థల్లో పనిచేశానని చెప్పాను కదా. అదే తరహా ప్రొటోకాల్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో ఉంది. ఒక వాతావరణంలో పనిచేశాక మళ్లీ మన దేశంలో అదే తరహా వాతావరణంలో పనిచేయడం సులువు కదా.  ఆ స్థాయి చికిత్స జరిగే ప్రదేశంగా నేను అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌ను గుర్తించాను. ఇక్కడి చాలా పెద్ద సంస్థల్లోనూ సర్జరీ, రేడియేషన్, కీమో తరహా చికిత్సలు వేటికవే స్వతంత్రంగా జరుగుతాయి. కానీ ఈ సంస్థలో మాత్రం అన్నీ సంయుక్తప్రభావంతో జరిగేలా చూస్తారు. ఇలాంటి మల్టీడిసిప్లినరీ అప్రోచ్ విషయంలో మిగతా సంస్థలు... అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కంటే కాస్త వెనకే ఉన్నాయనిపించింది.
 
 ప్ర: విదేశాలతో పోలిస్తే ఊపిరితిత్తుల క్యాన్సర్ విషయంలో మన దేశ పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా?
 డా. సాయి: ఆఁ... ఉన్నాయి. పైగా ఆ అంశాలు కూడా ఇక్కడే నా సేవలు అవసరమని భావనను పెంచి నన్నిక్కడే ఉంచేలా చేశాయి. ఉదాహరణకు... ఆస్‌బెస్టాస్ వాడకం వల్ల మీసోథీలియోమా అనే తరహా క్యాన్సర్ వస్తుంది. దీన్ని గుర్తించిన విదేశాలు ఆస్‌బెస్టాస్‌ను పూర్తిగా నిషేధించాయి. కానీ మన దేశంలో ఆస్‌బెస్టాస్ ఉపయోగం ఎక్కువే. అందుకే ఈ తరహా క్యాన్సర్లు విదేశాలతో పోలిస్తే మన దగ్గర ఎక్కువ. పైగా ఈ మీసోధీలియోమా క్యాన్సర్‌కు చికిత్స అత్యంత సంక్లిష్టం, చాలా కష్టం. అందుకే ఇక్కడ ఆ తరహా క్యాన్సర్‌ను ఎదుర్కొనే బృందాన్ని  ఇక్కడ రూపొందేలా కృషి చేస్తున్నాం. నాకు తెలిసి ఈ తరహా టీమ్ గత 72 ఏళ్లలో ఇదే మొదటి శ్రేణిది అని చెప్పవచ్చు. అంతేకాదు... ఈ మీసోథీలియోమా చికిత్సలో మొత్తం ఛాతీ క్యావిటీని కడిగేయడం కూడా చేస్తున్నాం. దీన్నే వైద్య పరిభాషలో ఇంట్రాప్లూరల్ కీమో థెరపీ అంటారు. ఈ తరహా అత్యున్నత స్థాయి చికిత్సలు ఇక్కడ అందుబాటులోకి రావాలన్నదే ప్రస్తుతం మా లక్ష్యం.
 
 సంప్రదించాల్సిన చిరునామా...
 అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్,
 ఎట్ సిటిజన్ హాస్పిటల్, శేరిలింగంపల్లి, హైదరాబాద్ - 500 019;
 వెబ్‌సైట్ : www.americanoncology.com

 
 డాక్టర్ సాయి యండమూరి
 కన్సల్టెంట్ - హెడ్ ఆఫ్ థొరాసిక్ సర్జరీ,
 అమెరికల్ ఆంకాలజీ ఇన్స్‌టిట్యూట్ ఎట్ సిటిజన్స్ హాస్పిటల్స్,
 ఫోన్: 67199835

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement