![Tenth student suffering from heart problem](/styles/webp/s3/article_images/2024/09/13/14.jpg.webp?itok=Dv1c_vr8)
హృదయ సమస్యతో బాధపడుతున్న టెన్త్ విద్యార్థి..
ఆపరేషన్‌కు రూ.8 లక్షలు అవుతుందన్న వైద్యులు
సాయం కోసం అర్థిస్తున్న బాలుడి అమ్మమ్మ
జీడిమెట్ల (హైదరాబాద్): బాబు పుట్టగానే తల్లి చనిపోయింది.. నాన్న రెండో పెళ్లి చేసుకుని బంధాన్ని తెంచుకున్నాడు. చివరకు అమ్మమ్మ సుబ్బలక్ష్మి అక్కున చేర్చుకుని వృద్ధాప్యంలోనూ అట్టల పరిశ్రమలో పనిచేస్తూ అన్నీ తానై సాకుతోంది. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో బాబుకు ఉహించని విపత్తుగా గుండెకు సంబంధించిన సమస్య వచ్చి పడింది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం దూలపల్లి ప్రశాంత్‌నగర్‌లో ఉంటున్న నూకల లక్ష్మీనారాయణ (15) ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. వారం క్రితం బాబుకు ఛాతీలో నొప్పి రావడంతో అమ్మమ్మ ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లింది.
ఆయన సూచన మేరకు మల్లారెడ్డి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ డాక్టర్లు బాబుకు అపరేషన్ చేయాలని, ప్రాణాలకు భరోసా ఇవ్వలేమని చెప్పారు. దీంతో బాబును అమ్మమ్మ నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అరోగ్యశ్రీ లేదని తిప్పి పంపించారు. అనంతరం బాబును రెయిన్‌బో ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు బాబు గుండె నుంచి వచ్చే నాళానికి రంధ్రం పడిందని, ఆపరేషన్‌కు రూ.8 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. ఐదు రోజుల్లో బాబుకు అపరేషన్ చేయకపోతే ప్రాణానికి ముప్పు ఉందని తెలిపారు. రెక్కాడితేగానీ డొక్కాడని అమ్మమ్మ కంట నీరు పెట్టడమే తప్ప ఏమీ చేయలేని స్థితిలో ఉంది.
దీంతో ఆమె అందరి కాళ్ల మీద పడి తన మనవడిని రక్షించాలని రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేస్తుంది. ఆమె అట్టల కంపెనీలో పనిచేస్తే నెలకు రూ.7 వేలు వస్తుంది. ఇంటి అద్దె రూ.2,500 పోను మిగిలిన సొమ్ముతోనే మనవడిని చదివిస్తూ తిండిపెట్టాలి. దీంతో దాతల సహాయం కోసం ఆ చిన్ని గుండె ఎదురుచూస్తుంది. బాలుడికి ఆర్థికంగా సాయం చేయాలనుకునేవారు 9177376666 (సాయి), 912159 3999(కృష్ణ)లను సంప్రదించవచ్చు.
అకౌంట్ నంబర్: 240810100015391
పేరు: చింతలపూడి రామకృష్ణ,
బ్యాంక్: యూనియన్ బ్యాంక్, బ్రాంచ్: అపురూపా కాలనీ, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్: UBIN0824089
Comments
Please login to add a commentAdd a comment