ప్రేమశాంతి రెడ్డి
గుండెలో తడి ఉండాలంటే గుండె పదిలంగా ఉండాలి కదా! కానీ ప్రేమశాంతి గుండెకు రంధ్రం ఉంది. ఆయుష్షును మింగేస్తున్న రంధ్రం అది. కానీ తను ఆ రంధ్రంలో నుంచి ప్రపంచంలోని తనలాంటి అభాగ్యులను చూసింది. ధైర్యంతో, మనోబలంతో, ఆత్మవిశ్వాసంతో తనలాంటి ఎంతో మంది అభాగ్యుల ఆయుష్షు తగ్గకుండా చెయ్యి అడ్డు పెడుతోంది. ప్రేమను పంచుతోంది.
సాక్షి, చెన్నై : ఎవరి కోసం వారు బతకడం సహజం. మరొకరి కోసం బతకడం మానవత్వం. బతికి ఉన్నంతకాలం వారిని కాపాడుకుంటాను...నేను చనిపోయినా వారు మాత్రం నిండునూరేళ్లూ జీవించాలని కోరుకోవడం దైవత్వం. మానసికంగా, శారీరకంగా పిన్న వయసులోనే జీవితంలో చితికిపోయిన తిరుపతికి చెందిన ప్రేమశాంతి రెడ్డి అలాంటి దైవత్వాన్నే పదుగురికీ పంచుతోంది. ‘ఏ క్షణాన్నైనా నేను చనిపోవచ్చు... అయితే నన్ను నమ్ముకున్న రోగులు మాత్రం తమ జీవన ప్రయాణాన్ని కొనసాగించాలి. ఇందుకు దయార్ద్ర హృదయులు స్వచ్చందంగా ముందుకు రావాలి’’ అని ముకుళిత హస్తాలతో ఆమె వేడుకుంటున్నారు.
తిరుపతి మల్లంగుంటకు చెందిన పార్లపల్లి చిన్నస్వామిరెడ్డి, సుదర్శనమ్మ దంపతుల కుమార్తె ప్రేమ శాంతికి తిరుపతి పద్మావతి మహిళా కళాశాలలో ఇంటర్ చదువుతున్న సమయంలోనే వివాహం అయింది. ఆ కొత్తల్లోనే ఆమె గర్భం ధరించింది. ఐదో నెలలో వైద్య పరీక్షలు చేయించుకున్న సమయంలో ప్రేమశాంతికి పుట్టినప్పుడే గుండెలో రంధ్రం ఉన్న సంగతి బయటపడింది. వేలూరు సీఎంసీలో చేర్చగా ‘తల్లో, బిడ్డో ఎవరో ఒకరే’ అని వైద్యులు సూచించారు.
దీంతో ప్రేమ శాంతి తల్లిదండ్రులు తమ కుమార్తె దక్కితే చాలని చెప్పడంతో అబార్షన్‌కు అవసరమైన చికిత్స ప్రారంభించారు. ప్రేమ శాంతి శారీరక పరిస్థితుల వల్ల శస్త్ర చికిత్స చేయకుండానే బిడ్డను బయటకు తీయాల్సి ఉండడంతో వైద్యులు కృత్రిమ నొప్పులతో నార్మల్ డెలివరీ కోసం ఇంజక్షన్ ఇచ్చారు.
52 గంటల పాటు నొప్పులను భరించిన ప్రేమశాంతి ఏడోనెల ఆరంభంలో అతి కష్టం మీద.. గర్భంలోనే మరణించిన మగ బిడ్డను ప్రసవించింది. ఆమె కూడా ఇక కొన్నిరోజుల్లో చనిపోతుందని వైద్యులు చెప్పినా ఆత్మస్థైర్యంతో కోలుకుంది. వైవాహిక జీవితానికి పూర్తిగా దూరమై ఒంటరిగా మిగిలింది. భవిష్యత్తు శూన్యంగా గోచరించింది. అయినప్పటికీ తల్లిదండ్రులు, అన్నదమ్ముల ఒత్తిడి మీద ఏడు నెలల పాటు చికిత్స తీసుకుంది.
వెయిటింగ్ రూమ్‌లో తనలాంటి వారెందరో!
అలా నాలుగు గోడలకు పరిమితమై దిగాలుతో కృంగిపోతున్న దశలో ఆమె ఇంటికి సమీపంలో ఒకరు స్కూల్‌ను ప్రారంభించారు. ప్రైవేటుగా ఎం.ఏ పూర్తి చేసి మానసికవ్యధ నుంచి బయటపడేందుకు ఆ స్కూల్‌లో టీచర్‌గా చేరారు ప్రేమశాంతి. మరోవైపు స్విమ్స్ కార్డియాలజీ విభాగం స్పెషలిస్ట్ డాక్టర్ వనజ వద్దకు వైద్యపరీక్షలకు వెళుతున్న సమయంలో గుండె రంధ్రాలతో బాధపడుతున్న రోగులు ప్రేమశాంతికి తారసపడేవారు.
తనలా ఇంకా ఎందరో ఉన్నారని తెలిసి తల్లడిల్లిపోయింది. తాను పడిన కష్టం మరొకరికి రాకూడదని నిర్ణయానికి వచ్చి వారిని ఆదుకోవడం ప్రారంభించింది. వైఎస్‌ఆర్ కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన జగదీష్, చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన రమేష్ అనే రోగులకు అవసరమైన మందులను ప్రతినెలా కొరియర్‌లో పంపడం మొదలైంది. పాకెట్‌మనీగా ఇంట్లో ఇచ్చే డబ్బును వారి మందుల కొనుగోలుకు ఖర్చు చే సేది.
2015లో తండ్రి చనిపోయిన తర్వాత ఆయనకు వచ్చే రూ.23 వేల పింఛన్ మొత్తాన్ని తల్లి, సోదరులు ఆమెకే ఇచ్చేస్తున్నారు. ఈ డబ్బుతో మందులు కొని ఇంటికి తెచ్చి రోగుల వారీగా విభజించి ప్యాకెట్లు కట్టి మూడు నెలలకొకసారి కొరియర్ ద్వారా రోగుల ఇళ్లకు పంపుతోంది. క్రమంగా ఆమెను నమ్ముకున్న రోగుల సంఖ్య క్రమేణా 46కు చేరుకుంది. ఇలా కడప, అనంతపురం, ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు చెందిన రోగులు గత పద్నాలుగేళ్లుగా ఆమె నుంచి ఉచితంగా మందులు పొందుతున్నారు.
ఈ విధంగా తన గుండెలోని రంధ్రాన్ని ఆపరేషన్‌తో కాక పరులకు పంచే ప్రేమ, శాంతి, సేవా కార్యక్రమాలతో పూడ్చుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న తిరుపతిలో జరిగిన స్విమ్స్ సిల్వర్ జూబ్లి వేడుకల్లో స్విమ్స్ డైరక్టర్ రవికుమార్ ప్రేమశాంతిని సన్మానించి ఆమె చేస్తున్న సేవలను కొనియాడారు.
అర్థిస్తున్నా... అక్కున చేర్చుకోండి
‘‘1995లో పెళ్లయిన కొత్తల్లోనే గర్భం దాల్చగా తల్లి ప్రాణాలకు ముప్పు అని వైద్యులు చెప్పారు. దీంతో కడుపులోని బిడ్డను చేజేతులా చంపుకోవాల్సి వచ్చింది. అబార్షన్ జరిగిన అరగంటలో నేనూ చనిపోతానని వైద్యులు తెలిపినా అదృష్టవశాత్తూ ఓ మేరకు కోలుకున్నాను. మెరుగైన చికిత్స కోసం స్విమ్స్‌లోని డాక్టర్ వనజ మేడమ్ వద్దకు వెళుతున్నపుడు నాలాంటి ఎందరో రోగులు ఎదురయ్యేవారు.
ఎలాగోలా పరీక్షలు చేయించుకున్నా మందులు కొనే స్థోమతలేక అల్లాడిపోయేవారు. తోచినంతలో వారిని ఆదుకోవాలనే నిర్ణయానికి వచ్చి మందులు పంపడం ప్రారంభించాను. అయితే మందులు కొనలేని స్థితిలో ఇంకా యాభై మందికి పైగా ఉన్నారు. మాది మధ్యతరగతి కుటుంబం కావడం వల్ల వారందరికీ సాయం చేయడం వీలు కాలేదు. అలాగని వారిని వదిలివేయలేను. పాతికేళ్ల క్రితం చనిపోవాల్సిన నేను వైద్యుల అండదండలు, దేవుడి ఆశీర్వాదం, రోగుల అభిమానంతో ఇంకా బతికి ఉన్నాను.
వైవాహిక జీవితం, సంతానం లేదనే చింతలేదు, నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే నలభై ఆరు మంది పిల్లలున్నారని గర్వపడుతున్నాను. ఈ రోగం ఏ క్షణాన నా ప్రాణాన్ని కబళిస్తుందో చెప్పలేను. నేను అకస్మాత్తుగా చనిపోతే నా ద్వారా మందులు పొందుతున్న రోగుల పరిస్థితి ఏమిటని ఆందోళన ఇటీవలే మొదలైంది. నేను గతించినా వారు జీవించాలని నా ఆశయం. దాతల కోసం పలువురు రోగులు ఎదురు చూస్తున్నారని లోకానికి తెలియజేయడం కోసమే పద్నాలుగేళ్లుగా గోప్యంగా ఉంచిన నా జీవితాన్ని బహిరంగపరుస్తున్నాను.
దేశంలో ఎందరో దయార్ద్ర హృదయులున్నారు. వారందరికీ ఇలాంటి రోగుల వివరాలు చేరాలంటే ఒక వెబ్‌సైట్ తీసుకురావడం మంచిదని తలంచాను. జీవితాంతం నన్ను కంటికి రెప్పలా కాపాడి, చనిపోయిన తరువాత కూడా పింఛన్ రూపంలో నాసేవలకు సహకరిస్తున్న కన్నతండ్రి పేరున pcrsevasamstha.com అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించాను. విశాల హృదయం కలిగిన దాతలు ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమకు తోచిన రోగిని దత్తత తీసుకోవాలని కోరుతున్నాను.
అవసరమైన మందులు రోగి చిరునామాకు నేరుగా పంపడం ద్వారా వారి ప్రాణాలు కాపాడాలని ప్రార్థిస్తున్నాను. రోగులకు సేవాహస్తం అందించే దాతలకు ఏమైనా సందేహాలుంటే 7680870322 సెల్‌ఫోన్‌లో అందుబాటులో ఉంటాను’’ అని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment