Helping Foundation
-
ఆ ఆరోపణల్ని ఖండించిన సోనూసూద్
నటుడు సోనూసూద్ కరోనా టైం నుంచి అందిస్తున్న సాయం గురించి చెప్పనక్కర్లేదు. అయితే అడిగిన వెంటనే సాయం అందిస్తున్న ఆయన వైఖరిపై కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో సోనూసూద్ సహా కొందరు సెలబ్రిటీలకు వ్యతిరేకంగా బాంబే హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. ప్రభుత్వాలకు, ప్రభుత్వ విభాగాలకు సైతం వీలుపడని రీతిలో మందుల్ని సోనూ సరఫరా చేస్తున్నాడని, ఇందులో అధికారికత ఎంత ఉందో తెల్చాలని, ఒకవేళ అక్రమాలుంటే నిగ్గు తేల్చాలని అందులో కోర్టును కోరారు. అయితే ఆ ఆరోపణలను తోసిపుచ్చుతూ ఆయన అభ్యర్థన పిటిషన్‌ను దాఖలు చేశాడు. ముంబై: తనకు వ్యతిరేకంగా బాంబే హైకోర్టులో దాఖలైన ఒక పిల్‌పై సోనూసూద్ అభ్యర్థన పిటిషన్ దాఖలు చేశాడు. కరోనా టైంలో ట్రీట్మెంట్ కోసం మందుల్ని సోనూసూద్ అక్రమంగా కలిగి ఉన్నాడని, అవి ఎక్కడి నుంచి వచ్చాయనేదానిపై అనుమానాలూ ఉన్నాయని పేర్కొంటూ యాక్టివిస్ట్ నిలేష్ నవలఖా, అడ్వకేట్ స్నేహమర్జాది పిల్ దాఖలు చేశారు. సోనూతో పాటు మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ అందిస్తున్న సాయాన్ని ప్రస్తావిస్తూ ఆయన పేరు కూడా చేర్చారు. ఈ అంశంపై బాంబే హైకోర్టు వాళ్లిద్దరినీ వివరణ కూడా కోరింది. అయితే ఈ ఆరోపణలను ఖండించిన సోనూ.. అభ్యర్థన పిటిషన్‌ను దాఖలు చేయగా కోర్టు మన్నించింది. కాగా, మందుల కొనుగోలు, నిల్వ, దాచడం, డీలింగ్, పంపిణీ చేయడం.. ఇలా ఏ విషయంలోనూ తాను తప్పుడు దారిలో వెళ్లడం లేదని సోనూసూద్, బాంబే కోర్టుకు వివరించాడు. తాను, తన ఫౌండేషన్ కేవలం మధ్యవర్తిగానే వ్యవహరిస్తున్నామని, కరోనా మొదటి వేవ్ టైంలో చేసిన సాయాన్ని సైతం ఆయన ప్రస్తావించాడు. ‘శక్తి అన్నదానం’ ద్వారా 45 వేల మందికి రోజూ భోజన సదుపాయం కల్పించామని వెల్లడించిన సోనూ.. కంపెనీల సహకారంతో 3 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపాడు. దశల వారీగా కన్ఫర్మేషన్ అఫిడవిట్లో సోనూసూద్.. ఫౌండేషన్ పనితీరును, సాయం అందిస్తున్న తీరును వివరంగా వెల్లడించాడు. ఫ్రంట్ లైన్ వర్కర్స్, వలస కాలర్మికులకు, అవసరంలో ఉన్నవాళ్లకు భోజనం, ఆరోగ్య సదుపాయాల్ని ఫౌండేషన్ తరపున కల్పిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతరత్రా అధికార విభాగాలతో పరస్పర సమన్వయం కలిగి ఉంటున్నామని వెల్లడించాడు. పిల్లో రెమిడిసివర్ తదితరు మందుల అక్రమ పంపిణీ అంశాన్ని ప్రస్తావించిన సోనూసూద్.. సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్ అవుతున్న వాళ్లకు సాయం ఎలా అందుతున్నదనేది వివరంగా తెలిపాడు. పేషెంట్ల ఆధార్ కార్డ్, కొవిడ్ రిపోర్ట్, డాక్టర్ ప్రిస్కిప్షన్, ఇలా.. అన్ని పరిశీలిస్తున్నామని, ఆస్పత్రులను సంప్రదించి.. కన్ఫర్మ్ చేసుకుంటున్నామని, ఆ తర్వాత వలంటీర్లు మరోసారి ధృవీకరించుకుంటున్నారని వెల్లడించాడు సోనూ. ఒకవేళ ఆ మందులు దొరక్కపోతే.. జిల్లా కలెక్టర్‌ను, ఎంపీలను, చీఫ్ మెడికల్ ఆఫీసర్లను సంప్రదిస్తున్నామని తెలిపాడు. ఈ విషయంలో ఆస్ప్రతులు, ఫార్మసీ ఫ్రాంచైజీలు కూడా సహకరిస్తున్నాయని పేర్కొన్నాడు. తాము కేవలం మధ్యవర్తిగానే వ్యవహరిస్తున్నామని, సమాచారాన్ని సంబంధిత అధికారులకు, నేతలకు అందించడం ద్వారా అవసరం ఉన్నవాళ్లకు సాయం చేస్తున్నామని స్పష్టం చేశాడు. కాగా, సోనూసూద్ అభ్యర్థనపై పిటిషనర్ అభ్యంతరాలను తర్వాతి వాదనకు వాయిదా వేసింది బాంబే హైకోర్టు. చదవండి: కొడుక్కి బహుమతి.. సోనూ క్లారిటీ! -
గుండె రంధ్రం నుంచి చూస్తే...
గుండెలో తడి ఉండాలంటే గుండె పదిలంగా ఉండాలి కదా! కానీ ప్రేమశాంతి గుండెకు రంధ్రం ఉంది. ఆయుష్షును మింగేస్తున్న రంధ్రం అది. కానీ తను ఆ రంధ్రంలో నుంచి ప్రపంచంలోని తనలాంటి అభాగ్యులను చూసింది. ధైర్యంతో, మనోబలంతో, ఆత్మవిశ్వాసంతో తనలాంటి ఎంతో మంది అభాగ్యుల ఆయుష్షు తగ్గకుండా చెయ్యి అడ్డు పెడుతోంది. ప్రేమను పంచుతోంది. సాక్షి, చెన్నై : ఎవరి కోసం వారు బతకడం సహజం. మరొకరి కోసం బతకడం మానవత్వం. బతికి ఉన్నంతకాలం వారిని కాపాడుకుంటాను...నేను చనిపోయినా వారు మాత్రం నిండునూరేళ్లూ జీవించాలని కోరుకోవడం దైవత్వం. మానసికంగా, శారీరకంగా పిన్న వయసులోనే జీవితంలో చితికిపోయిన తిరుపతికి చెందిన ప్రేమశాంతి రెడ్డి అలాంటి దైవత్వాన్నే పదుగురికీ పంచుతోంది. ‘ఏ క్షణాన్నైనా నేను చనిపోవచ్చు... అయితే నన్ను నమ్ముకున్న రోగులు మాత్రం తమ జీవన ప్రయాణాన్ని కొనసాగించాలి. ఇందుకు దయార్ద్ర హృదయులు స్వచ్చందంగా ముందుకు రావాలి’’ అని ముకుళిత హస్తాలతో ఆమె వేడుకుంటున్నారు. తిరుపతి మల్లంగుంటకు చెందిన పార్లపల్లి చిన్నస్వామిరెడ్డి, సుదర్శనమ్మ దంపతుల కుమార్తె ప్రేమ శాంతికి తిరుపతి పద్మావతి మహిళా కళాశాలలో ఇంటర్ చదువుతున్న సమయంలోనే వివాహం అయింది. ఆ కొత్తల్లోనే ఆమె గర్భం ధరించింది. ఐదో నెలలో వైద్య పరీక్షలు చేయించుకున్న సమయంలో ప్రేమశాంతికి పుట్టినప్పుడే గుండెలో రంధ్రం ఉన్న సంగతి బయటపడింది. వేలూరు సీఎంసీలో చేర్చగా ‘తల్లో, బిడ్డో ఎవరో ఒకరే’ అని వైద్యులు సూచించారు. దీంతో ప్రేమ శాంతి తల్లిదండ్రులు తమ కుమార్తె దక్కితే చాలని చెప్పడంతో అబార్షన్‌కు అవసరమైన చికిత్స ప్రారంభించారు. ప్రేమ శాంతి శారీరక పరిస్థితుల వల్ల శస్త్ర చికిత్స చేయకుండానే బిడ్డను బయటకు తీయాల్సి ఉండడంతో వైద్యులు కృత్రిమ నొప్పులతో నార్మల్ డెలివరీ కోసం ఇంజక్షన్ ఇచ్చారు. 52 గంటల పాటు నొప్పులను భరించిన ప్రేమశాంతి ఏడోనెల ఆరంభంలో అతి కష్టం మీద.. గర్భంలోనే మరణించిన మగ బిడ్డను ప్రసవించింది. ఆమె కూడా ఇక కొన్నిరోజుల్లో చనిపోతుందని వైద్యులు చెప్పినా ఆత్మస్థైర్యంతో కోలుకుంది. వైవాహిక జీవితానికి పూర్తిగా దూరమై ఒంటరిగా మిగిలింది. భవిష్యత్తు శూన్యంగా గోచరించింది. అయినప్పటికీ తల్లిదండ్రులు, అన్నదమ్ముల ఒత్తిడి మీద ఏడు నెలల పాటు చికిత్స తీసుకుంది. వెయిటింగ్ రూమ్‌లో తనలాంటి వారెందరో! అలా నాలుగు గోడలకు పరిమితమై దిగాలుతో కృంగిపోతున్న దశలో ఆమె ఇంటికి సమీపంలో ఒకరు స్కూల్‌ను ప్రారంభించారు. ప్రైవేటుగా ఎం.ఏ పూర్తి చేసి మానసికవ్యధ నుంచి బయటపడేందుకు ఆ స్కూల్లో టీచర్‌గా చేరారు ప్రేమశాంతి. మరోవైపు స్విమ్స్ కార్డియాలజీ విభాగం స్పెషలిస్ట్ డాక్టర్ వనజ వద్దకు వైద్యపరీక్షలకు వెళుతున్న సమయంలో గుండె రంధ్రాలతో బాధపడుతున్న రోగులు ప్రేమశాంతికి తారసపడేవారు. తనలా ఇంకా ఎందరో ఉన్నారని తెలిసి తల్లడిల్లిపోయింది. తాను పడిన కష్టం మరొకరికి రాకూడదని నిర్ణయానికి వచ్చి వారిని ఆదుకోవడం ప్రారంభించింది. వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన జగదీష్, చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన రమేష్ అనే రోగులకు అవసరమైన మందులను ప్రతినెలా కొరియర్లో పంపడం మొదలైంది. పాకెట్‌మనీగా ఇంట్లో ఇచ్చే డబ్బును వారి మందుల కొనుగోలుకు ఖర్చు చే సేది. 2015లో తండ్రి చనిపోయిన తర్వాత ఆయనకు వచ్చే రూ.23 వేల పింఛన్ మొత్తాన్ని తల్లి, సోదరులు ఆమెకే ఇచ్చేస్తున్నారు. ఈ డబ్బుతో మందులు కొని ఇంటికి తెచ్చి రోగుల వారీగా విభజించి ప్యాకెట్లు కట్టి మూడు నెలలకొకసారి కొరియర్ ద్వారా రోగుల ఇళ్లకు పంపుతోంది. క్రమంగా ఆమెను నమ్ముకున్న రోగుల సంఖ్య క్రమేణా 46కు చేరుకుంది. ఇలా కడప, అనంతపురం, ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు చెందిన రోగులు గత పద్నాలుగేళ్లుగా ఆమె నుంచి ఉచితంగా మందులు పొందుతున్నారు. ఈ విధంగా తన గుండెలోని రంధ్రాన్ని ఆపరేషన్‌తో కాక పరులకు పంచే ప్రేమ, శాంతి, సేవా కార్యక్రమాలతో పూడ్చుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న తిరుపతిలో జరిగిన స్విమ్స్ సిల్వర్ జూబ్లి వేడుకల్లో స్విమ్స్ డైరక్టర్ రవికుమార్ ప్రేమశాంతిని సన్మానించి ఆమె చేస్తున్న సేవలను కొనియాడారు. అర్థిస్తున్నా... అక్కున చేర్చుకోండి ‘‘1995లో పెళ్లయిన కొత్తల్లోనే గర్భం దాల్చగా తల్లి ప్రాణాలకు ముప్పు అని వైద్యులు చెప్పారు. దీంతో కడుపులోని బిడ్డను చేజేతులా చంపుకోవాల్సి వచ్చింది. అబార్షన్ జరిగిన అరగంటలో నేనూ చనిపోతానని వైద్యులు తెలిపినా అదృష్టవశాత్తూ ఓ మేరకు కోలుకున్నాను. మెరుగైన చికిత్స కోసం స్విమ్స్‌లోని డాక్టర్ వనజ మేడమ్ వద్దకు వెళుతున్నపుడు నాలాంటి ఎందరో రోగులు ఎదురయ్యేవారు. ఎలాగోలా పరీక్షలు చేయించుకున్నా మందులు కొనే స్థోమతలేక అల్లాడిపోయేవారు. తోచినంతలో వారిని ఆదుకోవాలనే నిర్ణయానికి వచ్చి మందులు పంపడం ప్రారంభించాను. అయితే మందులు కొనలేని స్థితిలో ఇంకా యాభై మందికి పైగా ఉన్నారు. మాది మధ్యతరగతి కుటుంబం కావడం వల్ల వారందరికీ సాయం చేయడం వీలు కాలేదు. అలాగని వారిని వదిలివేయలేను. పాతికేళ్ల క్రితం చనిపోవాల్సిన నేను వైద్యుల అండదండలు, దేవుడి ఆశీర్వాదం, రోగుల అభిమానంతో ఇంకా బతికి ఉన్నాను. వైవాహిక జీవితం, సంతానం లేదనే చింతలేదు, నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే నలభై ఆరు మంది పిల్లలున్నారని గర్వపడుతున్నాను. ఈ రోగం ఏ క్షణాన నా ప్రాణాన్ని కబళిస్తుందో చెప్పలేను. నేను అకస్మాత్తుగా చనిపోతే నా ద్వారా మందులు పొందుతున్న రోగుల పరిస్థితి ఏమిటని ఆందోళన ఇటీవలే మొదలైంది. నేను గతించినా వారు జీవించాలని నా ఆశయం. దాతల కోసం పలువురు రోగులు ఎదురు చూస్తున్నారని లోకానికి తెలియజేయడం కోసమే పద్నాలుగేళ్లుగా గోప్యంగా ఉంచిన నా జీవితాన్ని బహిరంగపరుస్తున్నాను. దేశంలో ఎందరో దయార్ద్ర హృదయులున్నారు. వారందరికీ ఇలాంటి రోగుల వివరాలు చేరాలంటే ఒక వెబ్సైట్ తీసుకురావడం మంచిదని తలంచాను. జీవితాంతం నన్ను కంటికి రెప్పలా కాపాడి, చనిపోయిన తరువాత కూడా పింఛన్ రూపంలో నాసేవలకు సహకరిస్తున్న కన్నతండ్రి పేరున pcrsevasamstha.com అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించాను. విశాల హృదయం కలిగిన దాతలు ఈ వెబ్సైట్లోకి వెళ్లి తమకు తోచిన రోగిని దత్తత తీసుకోవాలని కోరుతున్నాను. అవసరమైన మందులు రోగి చిరునామాకు నేరుగా పంపడం ద్వారా వారి ప్రాణాలు కాపాడాలని ప్రార్థిస్తున్నాను. రోగులకు సేవాహస్తం అందించే దాతలకు ఏమైనా సందేహాలుంటే 7680870322 సెల్ఫోన్లో అందుబాటులో ఉంటాను’’ అని విజ్ఞప్తి చేస్తున్నారు. -
ప్రవాసులకు అత్యవసర సమయాల్లో చేయూతగా..
కాలిఫోర్నియా : ప్రవాస భారతీయులకు అత్యవసర సమయాల్లో చేయూత ఇవ్వాలనే సంకల్పంతో టీం ఎయిడ్ అనే సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు నన్నపనేని మోహన్ ప్రకటించారు. ఈ సంస్థ గురించి అవగాహన కలిగించేదుకు బే ఏరియాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. లాభాపేక్షలేని ఈ సంస్థ పూర్తిగా స్వచ్ఛంద సేవకుల అంకితభావంతోనే నడుస్తున్నదనీ, తమ సేవలను అమెరికాలోని 50 రాష్ట్రాల్లో విస్తరింపజేయాలని భావిస్తోన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బే ఏరియాలోని వివిధ రాష్ట్రాల సంఘాలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన సిలికానాంధ్ర వైస్ ఛైర్మన దిలీప్ కొండిపర్తి మాట్లాడుతూ.. ‘ఎంతటి వివేకవంతులైనా ఆపద సమయాల్లో అయోమయంతో ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితుల్లో పడతారని, అలాంటివాళ్ళను ఆదుకోవాల్సిన అవసరం తోటి ప్రవాసుల నైతిక బాధ్యత. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం కన్నా వేరే సేవ ఉండదు. టీం ఎయిడ్ చేస్తున్న ఈ సేవా కార్యక్రమానికి సిలికానాంధ్ర తమ జగమంత కుటుంబంతో ఎల్లప్పుడూ సహకరిస్తుంది’ అని పేర్కొన్నారు. ‘బంగారు భవిష్యత్తును ఆశిస్తూ స్వదేశాన్ని విడిచి వచ్చిన వారికి ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా భుజం తట్టి సహాయం చేయాలనే సదుద్దేశంతో టీం ఎయిడ్ ప్రారంభించాము. టీం ఎయిడ్.. ఏ ఇతర కమ్యూనిటీ సంస్థలకు పోటీ కాదు. అమెరికా పోలీసులతో పాటు, విదేశాంగ ప్రతినిధులతో, భారతదేశంలోని అధికారులతో కలిసి పనిచేస్తుంది. అమెరికాలోని భారతీయ సంస్థలన్నిటినీ కలుపుకుంటూ, ఒక కేంద్రీయ సహాయ కేంద్రంగా పనిచేస్తుంది. ఆపద సమయాల్లో సమయం వృధా కాకుడదు, ఎంత త్వరగా మేలుచేస్తే అంతటి ఊరట కలుగుతుంది. అందుకే ఈ సంస్థను ఏర్పాటుచేస్తున్నాము' అని నన్నపనేని ఈ సంస్థ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సిలికానాంధ్ర సంస్థాపక అద్యక్షులు ఆనంద్ కూచిభొట్ల, సీ ఈ ఓ రాజు చమర్తి, సీఎఫ్ఓ దీనబాబు కొండుభట్ల, రవిప్రకాష్ ఇంకా ఇతర సభ్యులు పాల్గొన్నారు. రాజ్ భనోత్ (హిందూ టెంపుల్ అండ్ కమ్యునిటీ సెంటర్), నీరజ్ భాటియా (ఇండో-అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్) తో పాటు బే ఏరియాలోని బే ఏరియా తమిళ్మాండ్రమ్, మలయాళీ అసోసియేషన్ మాన్కా, బే మలయాళీ అసోసియేషన్, మైత్రీ , సన్నీవేల్ హిందూ టెంపుల్, స్పెక్ట్రమ్ చర్చ్, శాన్ జోస్ గురుద్వార, బే ఏరియా ఫభసి( బెంగాలీ అసోసియేషన్), ఉప్మా( ఉత్తరప్రదేశ్ అసోసియేషన్), మహారాష్ట్ర మండల్, ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఒరిస్సా అసోసియేషన్, భువనేశ్వర్ సిస్టిర్ సిటీస్ ఆఫ్ కూపర్టినో, కాశ్మీరీ అసోసియేషన్, ఇండియన్ ముస్లీం అండ్ చారీటీస్ (ఐఎమ్ఆర్సీ), పంజాబ్ షౌండేషన్, సేవా ఇంటర్నేషనల్, అప్పప, రాణా ( రాజాస్థాన్ అసోసియేషన్) సింధీ అసోసియేషన్, అకాలీ దళ్ (పంజాబీ) సంఘాల ప్రతినిధులు సభకు హాజరయ్యి తమ సంఘీభావాన్ని తెలిపారు. టీమ్ ఎయిడ్‌తో కలిసి పనిచేయడం తమకు ఆనందంగా ఉందని, సంస్థ కార్యకలాపాల్లో భాగస్వామ్యం అవుతామని, టీమ్ ఎయిడ్స్‌కు విస్తృత ప్రచారం కల్పించి అవసరమైన వారికి సహాయం అందించేందకు సహాకారం చేస్తామని అన్నారు. -
అసహాయులకు అండ..మనం సైతం
మనం బతకడమే కాదు.. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనేదే ఆయన తత్వం.పేదవాళ్లకు ఎంతోకొంత సహాయం చేయాలనేదే ఆయన మనస్తత్వం. సినీ రంగంతో పాటు సమాజంలోని అసహాయులకు ఆసరాగా నిలవాలన్నదే ఆయన ఆశయం. ఆ దిశగా తనవంతు కృషి చేస్తున్నారు సినీ, టీవీ ఆర్టిస్ట్ కాదంబరి కిరణ్. ఇందుకు ‘మనం సైతం’ పేరుతో గ్రూప్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కిరణ్.. సినీరంగ ప్రస్థానం, సేవా కార్యక్రమాల విశేషాలు ఆయన మాటల్లోనే... నేను చిన్నప్పటి నుంచే పేదలకు సహాయం చేస్తుండేవాణ్ని. ఇందులో నా సన్నిహితులనూ భాగస్వాములను చేసేవాణ్ని. సినీ కార్మికులు, సమాజంలోని పేదలను చూసి చలించిపోయాను. వారికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో మూడేళ్ల క్రితం ‘మనం సైతం’ గ్రూప్ ఏర్పాటు చేశాను. ఫేస్బుక్, వాట్సప్, వెబ్సైట్ ద్వారా పేదల సమస్యలు వివరిస్తూ... నా వంతు సహాయాన్ని అందిస్తున్నాను. ఇందులో సినీ, రాజకీయ, సన్నిహితులను భాగస్వాములు చేస్తున్నాను. అన్ని రంగాలకు చెందిన వారు ఇందులో పాల్గొని సహాయం చేస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ రూ.2 లక్షలు విరాళమిచ్చారు. పలువురు సినీ పెద్దలు సైతం తోడ్పాటునందిస్తుండటం ఆహ్వానించదగిన పరిణామం. అలా మొదలైంది.. సిటీలో ఉంటున్న మా మేనమామల దగ్గర ఉండి చదువుకునేందుకు 1973లో కాకినాడ నుంచి హైదరాబాద్ వచ్చాను. సినిమాలపై ఆసక్తి ఉన్నా నాటకాల్లో రాణించాలని నాటక రంగంలో చేరాను. అయితే నాటకాల్లో అవకాశాలు తక్కువగా వచ్చేవి. 1986లో టీవీ రంగంలో అడుగుపెట్టాను. దర్శకుడిగా, నిర్మాతగా ‘లవ్ ఆల్ ఫస్ట్ సైట్’ అనే టెలీఫిలిం తీశాను. అది హిట్ అవడంతో టీవీ రంగంలోని అన్ని విభాగాల్లో పనిచేశాను. ‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’, ‘కస్తూరి’ సీరియళ్లతో పాటు టీవీ ప్రోగ్రామ్స్ చేశాను. అదే టర్నింగ్ పాయింట్.. నా తొలి సినిమా జంధ్యాల దర్శకత్వం వహించిన ‘ప్రేమా జిందాబాద్’. ఆ తర్వాత బావా బావా పన్నీర్ తదితర సినిమాలు చేశాను. అయితే ‘అమ్మా.. నాన్మ.. ఓ తమిళ అమ్మాయి’లో ‘ఏమిరా బాలరాజు.. నీవల్ల దేశానికి ఏమిరా ఉపయోగం’ అంటూ కమెడియన్ ధర్మవరపు సుబ్రమణ్యం రివర్స్ పంచ్‌తో కుదేలైన బాలరాజు పాత్ర నాకు టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఆ తర్వాత దేశముదురు, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, శ్రీమంతుడు, లై, గోవిందుడు అందరి వాడేలే సినిమాల్లో చేశాను. ఇప్పటికి 270 సినిమాల్లో నటించాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో మొదటి నుంచీ భాగస్వామిగా ఉన్నాను. ప్రస్తుతం రంగస్థలం, వీవీ వినాయక్, కొరటాల శివ సినిమాల్లో నటిస్తున్నాను. కేటీఆర్, పవన్ ఇష్టం రాజకీయాల్లో మంత్రి కేటీఆర్ చాలా ఇష్టం. నిరాడంబరంగా, ముక్కుసూటిగా వ్యవహరిస్తున్న కేటీఆర్ సమర్థవంతమైన నాయకుడు. నటుడు పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా చాలా ఇష్టం. ఎదుటివారు కష్టాల్లో ఉంటే చలించి ఎంతదూరానికైనా వెళ్లే మనస్తత్వం ఆయనది. అనాథ చిన్నారులతో... -
జిల్లావాసులకు ‘జయశంకర్’ అవార్డు
కామారెడ్డి రూరల్ : కామారెడ్డి మండలంలోని తిమ్మక్‌పల్లి (కే) ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మార బాల్రెడ్డికి ఆచార్య జయశంకర్ సార్ రాష్ట్రస్థాయి అవార్డును రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి ఈటెల రాజేందర్ కరీంనగర్‌లోని కళాభారతి కళావేదికలో అందజేశారు. విద్యారంగంలో వీరి సేవలను గుర్తించిన తెలంగాణ ఆత్మబంధువు హెల్పింగ్ ఫౌండేషన్ కరీంనగర్ వారు ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఆదుకునే చేతులు ఉంటే అనాథలెవరుండరు అనే ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని అనాథ, పేద, కిడ్నీ, గుండెజబ్బు, హెచ్ఐవీ పిల్లల సహాయ సంస్థలకు మార బాల్‌రెడ్డి అందించిన సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ ఉపాధ్యాయుడి స్వగ్రామంలో ఎస్సెస్సీ ఇంటర్ విద్యార్థుల ప్రతిభ వెలికి తీయడానికి ప్రతిభ పురస్కారాలను అందజేసి వాళ్లను ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బల్క సుమన్, తెలంగాణ ఆత్మబంధువు హెల్పింగ్ పౌండేషన్ ప్రతినిధులు, కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. మనోహర్‌కు.. కామారెడ్డిటౌన్ : తాడ్వాయి మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అంబీర్ మనోహర్‌రావుకు స్వర్గీయ ఆచార్య జయశంకర్ రాష్ట్ర స్థాయి అవార్డు దక్కింది. 14వ తేదీన కరీంనగర్ జిల్లా కళావేదికలో తెలంగాణ పితామహుడు ఆచార్య జయశంకర్ స్మారకంగా సామాజిక, సాహిత్య, విద్య, వైద్యం, ఉద్యోగ, కళా, క్రీడా రంగంలో విశిష్ట సేవలందించిన వారికి జయశంకర్ రాష్ట్రస్థాయి, లైఫ్‌టైం, అచీవ్మెంట్ అవార్డులను సత్కరించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి చేతుల మీదుగా ఈ అవార్డును మనోహర్ అందుకున్నారు. ఈ సందర్భంగా మనోహర్‌ను పలువురు అభినందించారు. ఠాణాకలాన్ పీఈటీకి.. ఎడపల్లి: మండలంలోని ఠాణా కలాన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఈటీగా విధులు నిర్వహిస్తున్న సాయిలుకు ఆదివారం రాత్రి కరీంనగర్లో ప్రొఫెసర్ జయశంకర్ అవార్డును ప్రదానం చేశారు. తెలంగాణలోని పది జిల్లాలలో వివిధ రంగాలలో గుర్తింపు పొందిన పలువురిని ఆత్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. జిల్లాలో సన్మానం పొందిన 11 మందిలో ఠాణాకలాన్ పీఈటీ సాయిలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్,పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్,ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. పీఈటీ సాయిలుకు అవార్డు రావడంపై ఉపాధ్యాయులు,విద్యార్థులు,గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.