జిల్లావాసులకు ‘జయశంకర్’ అవార్డు
కామారెడ్డి రూరల్ : కామారెడ్డి మండలంలోని తిమ్మక్‌పల్లి (కే) ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మార బాల్‌రెడ్డికి ఆచార్య జయశంకర్ సార్ రాష్ట్రస్థాయి అవార్డును రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి ఈటెల రాజేందర్ కరీంనగర్‌లోని కళాభారతి కళావేదికలో అందజేశారు. విద్యారంగంలో వీరి సేవలను గుర్తించిన తెలంగాణ ఆత్మబంధువు హెల్పింగ్ ఫౌండేషన్ కరీంనగర్ వారు ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
ఆదుకునే చేతులు ఉంటే అనాథలెవరుండరు అనే ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని అనాథ, పేద, కిడ్నీ, గుండెజబ్బు, హెచ్‌ఐవీ పిల్లల సహాయ సంస్థలకు మార బాల్‌రెడ్డి అందించిన సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ ఉపాధ్యాయుడి స్వగ్రామంలో ఎస్సెస్సీ ఇంటర్ విద్యార్థుల ప్రతిభ వెలికి తీయడానికి ప్రతిభ పురస్కారాలను అందజేసి వాళ్లను ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బల్క సుమన్, తెలంగాణ ఆత్మబంధువు హెల్పింగ్ పౌండేషన్ ప్రతినిధులు, కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
మనోహర్‌కు..
కామారెడ్డిటౌన్ : తాడ్వాయి మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అంబీర్ మనోహర్‌రావుకు స్వర్గీయ ఆచార్య జయశంకర్ రాష్ట్ర స్థాయి అవార్డు దక్కింది. 14వ తేదీన కరీంనగర్ జిల్లా కళావేదికలో తెలంగాణ పితామహుడు ఆచార్య జయశంకర్ స్మారకంగా సామాజిక, సాహిత్య, విద్య, వైద్యం, ఉద్యోగ, కళా, క్రీడా రంగంలో విశిష్ట సేవలందించిన వారికి జయశంకర్ రాష్ట్రస్థాయి, లైఫ్‌టైం, అచీవ్‌మెంట్ అవార్డులను సత్కరించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి చేతుల మీదుగా ఈ అవార్డును మనోహర్ అందుకున్నారు. ఈ సందర్భంగా మనోహర్‌ను పలువురు అభినందించారు.
ఠాణాకలాన్ పీఈటీకి..
ఎడపల్లి: మండలంలోని ఠాణా కలాన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఈటీగా విధులు నిర్వహిస్తున్న సాయిలుకు ఆదివారం రాత్రి కరీంనగర్‌లో ప్రొఫెసర్ జయశంకర్ అవార్డును ప్రదానం చేశారు. తెలంగాణలోని పది జిల్లాలలో వివిధ రంగాలలో గుర్తింపు పొందిన పలువురిని ఆత్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. జిల్లాలో సన్మానం పొందిన 11 మందిలో ఠాణాకలాన్ పీఈటీ సాయిలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్,పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్,ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. పీఈటీ సాయిలుకు అవార్డు రావడంపై ఉపాధ్యాయులు,విద్యార్థులు,గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.