నటుడు సోనూసూద్ కరోనా టైం నుంచి అందిస్తున్న సాయం గురించి చెప్పనక్కర్లేదు. అయితే అడిగిన వెంటనే సాయం అందిస్తున్న ఆయన వైఖరిపై కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో సోనూసూద్ సహా కొందరు సెలబ్రిటీలకు వ్యతిరేకంగా బాంబే హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. ప్రభుత్వాలకు, ప్రభుత్వ విభాగాలకు సైతం వీలుపడని రీతిలో మందుల్ని సోనూ సరఫరా చేస్తున్నాడని, ఇందులో అధికారికత ఎంత ఉందో తెల్చాలని, ఒకవేళ అక్రమాలుంటే నిగ్గు తేల్చాలని అందులో కోర్టును కోరారు. అయితే ఆ ఆరోపణలను తోసిపుచ్చుతూ ఆయన అభ్యర్థన పిటిషన్‌ను దాఖలు చేశాడు.
ముంబై: తనకు వ్యతిరేకంగా బాంబే హైకోర్టులో దాఖలైన ఒక పిల్‌పై సోనూసూద్ అభ్యర్థన పిటిషన్ దాఖలు చేశాడు. కరోనా టైంలో ట్రీట్‌మెంట్ కోసం మందుల్ని సోనూసూద్ అక్రమంగా కలిగి ఉన్నాడని, అవి ఎక్కడి నుంచి వచ్చాయనేదానిపై అనుమానాలూ ఉన్నాయని పేర్కొంటూ యాక్టివిస్ట్ నిలేష్ నవలఖా, అడ్వకేట్ స్నేహమర్జాది పిల్ దాఖలు చేశారు. సోనూతో పాటు మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ అందిస్తున్న సాయాన్ని ప్రస్తావిస్తూ ఆయన పేరు కూడా చేర్చారు. ఈ అంశంపై బాంబే హైకోర్టు వాళ్లిద్దరినీ వివరణ కూడా కోరింది. అయితే ఈ ఆరోపణలను ఖండించిన సోనూ.. అభ్యర్థన పిటిషన్‌ను దాఖలు చేయగా కోర్టు మన్నించింది.
కాగా, మందుల కొనుగోలు, నిల్వ, దాచడం, డీలింగ్, పంపిణీ చేయడం.. ఇలా ఏ విషయంలోనూ తాను తప్పుడు దారిలో వెళ్లడం లేదని సోనూసూద్, బాంబే కోర్టుకు వివరించాడు. తాను, తన ఫౌండేషన్ కేవలం మధ్యవర్తిగానే వ్యవహరిస్తున్నామని, కరోనా మొదటి వేవ్ టైంలో చేసిన సాయాన్ని సైతం ఆయన ప్రస్తావించాడు. ‘శక్తి అన్నదానం’ ద్వారా 45 వేల మందికి రోజూ భోజన సదుపాయం కల్పించామని వెల్లడించిన సోనూ.. కంపెనీల సహకారంతో 3 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపాడు.
దశల వారీగా కన్ఫర్మేషన్
అఫిడవిట్‌లో సోనూసూద్.. ఫౌండేషన్ పనితీరును, సాయం అందిస్తున్న తీరును వివరంగా వెల్లడించాడు. ఫ్రంట్ లైన్ వర్కర్స్, వలస కాలర్మికులకు, అవసరంలో ఉన్నవాళ్లకు భోజనం, ఆరోగ్య సదుపాయాల్ని ఫౌండేషన్ తరపున కల్పిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతరత్రా అధికార విభాగాలతో పరస్పర సమన్వయం కలిగి ఉంటున్నామని వెల్లడించాడు. పిల్‌లో రెమిడిసివర్ తదితరు మందుల అక్రమ పంపిణీ అంశాన్ని ప్రస్తావించిన సోనూసూద్.. సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్ అవుతున్న వాళ్లకు సాయం ఎలా అందుతున్నదనేది వివరంగా తెలిపాడు.
పేషెంట్ల ఆధార్ కార్డ్, కొవిడ్ రిపోర్ట్, డాక్టర్ ప్రిస్కిప్షన్, ఇలా.. అన్ని పరిశీలిస్తున్నామని, ఆస్పత్రులను సంప్రదించి.. కన్ఫర్మ్ చేసుకుంటున్నామని, ఆ తర్వాత వలంటీర్లు మరోసారి ధృవీకరించుకుంటున్నారని వెల్లడించాడు సోనూ. ఒకవేళ ఆ మందులు దొరక్కపోతే.. జిల్లా కలెక్టర్‌ను, ఎంపీలను, చీఫ్ మెడికల్ ఆఫీసర్లను సంప్రదిస్తున్నామని తెలిపాడు. ఈ విషయంలో ఆస్ప్రతులు, ఫార్మసీ ఫ్రాంచైజీలు కూడా సహకరిస్తున్నాయని పేర్కొన్నాడు. తాము కేవలం మధ్యవర్తిగానే వ్యవహరిస్తున్నామని, సమాచారాన్ని సంబంధిత అధికారులకు, నేతలకు అందించడం ద్వారా అవసరం ఉన్నవాళ్లకు సాయం చేస్తున్నామని స్పష్టం చేశాడు. కాగా, సోనూసూద్ అభ్యర్థనపై పిటిషనర్ అభ్యంతరాలను తర్వాతి వాదనకు వాయిదా వేసింది బాంబే హైకోర్టు.
చదవండి: కొడుక్కి బహుమతి.. సోనూ క్లారిటీ!
Comments
Please login to add a commentAdd a comment