మనం బతకడమే కాదు.. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనేదే ఆయన తత్వం.పేదవాళ్లకు ఎంతోకొంత సహాయం చేయాలనేదే ఆయన మనస్తత్వం. సినీ రంగంతో పాటు సమాజంలోని అసహాయులకు ఆసరాగా నిలవాలన్నదే ఆయన ఆశయం. ఆ దిశగా తనవంతు కృషి చేస్తున్నారు సినీ, టీవీ ఆర్టిస్ట్ కాదంబరి కిరణ్. ఇందుకు ‘మనం సైతం’ పేరుతో గ్రూప్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కిరణ్.. సినీరంగ ప్రస్థానం, సేవా కార్యక్రమాల విశేషాలు ఆయన మాటల్లోనే...
నేను చిన్నప్పటి నుంచే పేదలకు సహాయం చేస్తుండేవాణ్ని. ఇందులో నా సన్నిహితులనూ భాగస్వాములను చేసేవాణ్ని. సినీ కార్మికులు, సమాజంలోని పేదలను చూసి చలించిపోయాను. వారికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో మూడేళ్ల క్రితం ‘మనం సైతం’ గ్రూప్ ఏర్పాటు చేశాను. ఫేస్‌బుక్, వాట్సప్, వెబ్‌సైట్ ద్వారా పేదల సమస్యలు వివరిస్తూ... నా వంతు సహాయాన్ని అందిస్తున్నాను. ఇందులో సినీ, రాజకీయ, సన్నిహితులను భాగస్వాములు చేస్తున్నాను. అన్ని రంగాలకు చెందిన వారు ఇందులో పాల్గొని సహాయం చేస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ రూ.2 లక్షలు విరాళమిచ్చారు. పలువురు సినీ పెద్దలు సైతం తోడ్పాటునందిస్తుండటం ఆహ్వానించదగిన పరిణామం.
అలా మొదలైంది..
సిటీలో ఉంటున్న మా మేనమామల దగ్గర ఉండి చదువుకునేందుకు 1973లో కాకినాడ నుంచి హైదరాబాద్ వచ్చాను. సినిమాలపై ఆసక్తి ఉన్నా నాటకాల్లో రాణించాలని నాటక రంగంలో చేరాను. అయితే నాటకాల్లో అవకాశాలు తక్కువగా వచ్చేవి. 1986లో టీవీ రంగంలో అడుగుపెట్టాను. దర్శకుడిగా, నిర్మాతగా ‘లవ్ ఆల్ ఫస్ట్ సైట్’ అనే టెలీఫిలిం తీశాను. అది హిట్ అవడంతో టీవీ రంగంలోని అన్ని విభాగాల్లో పనిచేశాను. ‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’, ‘కస్తూరి’ సీరియళ్లతో పాటు టీవీ ప్రోగ్రామ్స్ చేశాను.
అదే టర్నింగ్ పాయింట్..
నా తొలి సినిమా జంధ్యాల దర్శకత్వం వహించిన ‘ప్రేమా జిందాబాద్’. ఆ తర్వాత బావా బావా పన్నీర్ తదితర సినిమాలు చేశాను. అయితే ‘అమ్మా.. నాన్మ.. ఓ తమిళ అమ్మాయి’లో ‘ఏమిరా బాలరాజు.. నీవల్ల దేశానికి ఏమిరా ఉపయోగం’ అంటూ కమెడియన్ ధర్మవరపు సుబ్రమణ్యం రివర్స్ పంచ్‌తో కుదేలైన బాలరాజు పాత్ర నాకు టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఆ తర్వాత దేశముదురు, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, శ్రీమంతుడు, లై, గోవిందుడు అందరి వాడేలే సినిమాల్లో చేశాను. ఇప్పటికి 270 సినిమాల్లో నటించాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో మొదటి నుంచీ భాగస్వామిగా ఉన్నాను. ప్రస్తుతం రంగస్థలం, వీవీ వినాయక్, కొరటాల శివ సినిమాల్లో నటిస్తున్నాను.
కేటీఆర్, పవన్ ఇష్టం
రాజకీయాల్లో మంత్రి కేటీఆర్ చాలా ఇష్టం. నిరాడంబరంగా, ముక్కుసూటిగా వ్యవహరిస్తున్న కేటీఆర్ సమర్థవంతమైన నాయకుడు. నటుడు పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా చాలా ఇష్టం. ఎదుటివారు కష్టాల్లో ఉంటే చలించి ఎంతదూరానికైనా వెళ్లే మనస్తత్వం ఆయనది.
అనాథ చిన్నారులతో...
Comments
Please login to add a commentAdd a comment