
‘‘ఎవరో హాస్పటల్‌లో ఉంటే నాలుగైదుసార్లు చూడ్డానికి వెళ్లితే చాలు.. నేనేదో హాస్పటల్ చూట్టూ చక్కర్లు కొడుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అది తప్పు కదా! మనిషి ఆరోగ్యంతో వ్యాపారం ఏంటి? అలా చేయకూడదు. ఎవరికైనా డౌట్ ఉంటే ‘శ్రీనివాసరావుగారూ... హెల్త్ ఎలా ఉంది’ అని నన్నే అడగండి! అసత్య ప్రచారాల వల్ల కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ప్రచారాన్ని అరికట్టడానికి ప్రభుత్వం సహకరించాలి’’ అని కోట శ్రీనివాసరావు అన్నారు. సోషల్ మీడియాలో ఆయనకు హార్ట్ ప్రాబ్లమ్ వచ్చిందనీ, ఊపిరితిత్తులు సరిగా లేవనీ, డాక్టర్లు వద్దంటున్నా నడుస్తున్నారనీ జరుగుతున్న ప్రచారాలపై శుక్రవారం హైదరాబాద్‌లో కోట స్పందించారు.
ఆయన మాట్లాడుతూ– ‘‘కొందరు పిచ్చి పిచ్చిగా పోస్టులు పెడుతున్నారు. వాళ్లకి ఎవరు చెప్పారు? ఇప్పుడు నాకు 74 ఏళ్లు. ఈ వయసులో కాళ్ల నొప్పులు, చేతి నొప్పులు ఉండవా? అది రోగమనుకుంటే ఎలా? డయాబెటిస్ వచ్చింది. ఈ వయసులో నాకు రాకూడదా? అంతే తప్ప... సాధారణంగా నా ఆరోగ్యం చాలా బాగుంది. ఈరోజు ఉదయం నుంచి సుమారు 50 ఫోన్లు... ఫ్యాన్స్, మీడియా నా హెల్త్ ఎలా ఉందోనని ఎంక్వయిరీలు. ఇటీవలే సుశీలగారిపై, అంతకు ముందు కొందరిపై ఇలాంటి వదంతులే వచ్చాయి. ‘70 ఏళ్లొచ్చినా పాడగలగడం నా అదృష్టం’ అని బాలుగారు అప్పుడప్పుడు చెప్తుంటారు. 74 ఏళ్లొచ్చినా ఇంకా నటించే ఓపిక ఇచ్చాడని నేను దేవుడికి దండం పెట్టుకుంటుంటా.
ఇప్పుడు సినిమా వాతావరణంలో మార్పు వచ్చింది. ఓ ఐదారుగురు హీరోలు మినహాయిస్తే మిగతా వాళ్లందరూ పాతికేళ్లలోపు వారే. వాళ్లకు తండ్రిగా నటించడానికి నేను సరిపోను. అప్పుడెప్పుడో చేసిన విలన్ పాత్రలు ఇప్పుడు ఎలా ఇస్తారు? అందువల్ల, నాకు తగ్గ పాత్రలు వచ్చినప్పుడు చేస్తున్నా. ఇప్పుడు తెలుగులో ‘బాలకృష్ణుడు, ఆచారి అమెరికా యాత్ర’, తమిళంలో ‘సామి 2’ వంటి చిత్రాల్లో నటిస్తున్నా. డబ్బింగ్ కూడా చెప్పుకుంటున్నా. ఎవరైనా సినిమా చేయమని నా దగ్గరకు వస్తే కాళ్ల నొప్పుల గురించి చెబుతున్నా. కానీ, నిజం తెలుసుకోకుండా కొందరు అసత్యాలు ప్రచారం చేసినప్పుడు కోపం వస్తోంది. బాధగా ఉంటోంది. ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఆందోళన చెందుతున్నారని ఈ వివరణ ఇస్తున్నా. నా మీద జోక్‌లేసినా పట్టించుకోను. దయచేసి చెడు ప్రచారాలు చేయడం మానుకోండి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment