సాక్షి, సినిమా : బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ మరోసారి తన దయా గుణాన్ని ప్రదర్శించాడు. బాక్సింగ్ దిగ్గజం కౌర్ సింగ్(69)కు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించాడు. గుండె జబ్బుతో బాధపడుతున్న కౌర్ కొంత కాలంగా మొహలీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ మధ్యే డిశ్చార్జి అయ్యారు.
1982లో ఏషియన్ గేమ్స్‌లో బాక్సింగ్ గోల్డ్ మెడలిస్ట్ అయిన కౌర్ మెడికల్ బిల్లులు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నారంటూ ఈ మధ్యే టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనాన్ని ప్రచురించింది. అది చూసి స్పందించిన షారూఖ్ తన జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ పేరు మీదుగా కౌర్‌సింగ్ కుటుంబానికి అందజేశారు. ‘‘ఆటగాళ్లుగా ఇలాంటి దిగ్గజాలు తమ కృషి ద్వారా దేశానికి ఎంతో పేరు తెచ్చారు. అలాంటప్పుడు వారి బాగోగులు పట్టించుకోవాల్సిన బాధ్యత సమాజానికి ఉంటుంది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా’’ అంటూ షారూఖ్ ఓ ప్రకటనలో తెలియజేశారు.
ఈ మధ్యే పంజాబ్ ప్రభుత్వం రెండు లక్షల చెక్‌ను ఆయనకు అందజేయగా.. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఎఫ్‌ఐ) కూడా లక్ష రూపాయాలను ఆయన చికిత్స కోసం అందజేసిన విషయం తెలిసిందే. బాక్సింగ్ లెజెండ్ ముహమద్ అలీతో రింగ్‌లో తలపడిన ఏకైక భారతీయుడిగా కౌర్ సింగ్ ఘనత సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment