
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న చిన్నారి తల్లిదండ్రులు, స్థానిక నాయకులు
సాక్షి, నందిగామ(కృష్ణా): అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తమ బిడ్డ గుండె శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావడంతో కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కృష్ణాజిల్లా నందిగామలోని 13వ వార్డుకు చెందిన ముంగి కోటయ్య 10 నెలల బాబు సంతోష్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు.
తొలుత విజయవాడలోని ఆంధ్ర ఆస్పత్రిలో చేర్చగా, అక్కడ నుంచి హైదరాబాద్‌లోని కిమ్స్‌కు తరలించారు. రూ.10 లక్షల ఖరీదైన శస్త్ర చికిత్స ఈనెల 8న కిమ్స్‌లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా జరిగింది. చిన్నారి సంతోష్ సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా శుక్రవారం ఇంటికి చేరుకున్నాడు.
దీంతో బాలుడి కుటుంబసభ్యులు పట్టరాని సంతోషంతో వారి ఇంటి ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్‌మోహన్‌రావు, ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్ డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. ఆరోగ్యశ్రీ పథకం వల్లే తమ బిడ్డ తిరిగి వచ్చాడని, ముఖ్యమంత్రికి తాము జీవితాంతం రుణపడి ఉంటామని చిన్నారి తండ్రి కోటయ్య పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment