డబ్లిన్: గుండె సమస్యతో ఆస్పత్రిలో చేరిన శ్రీలంక పేసర్ షమిందా ఎరంగా డిశ్చార్జయ్యాడు. ఇటీవల గుండె జబ్బు కారణంగా డబ్లిన్ ఆస్పతిలో చికిత్స తీసుకున్న ఎరంగా ఆరోగ్యం సాధారణ స్థితికి రావడంతో అతన్ని డిశ్చార్జి చేసినట్లు జట్టు మేనేజ్మెంట్ సోమవారం తెలిపింది. గత శనివారం ఐర్లాండ్ మ్యాచ్ సందర్భంగా ఎరంగా హృదయ స్పందన తీవ్రంగా ఉండటంతో అతన్ని ఆస్పత్రిలో జాయిన్ చేసి అత్యవసర చికిత్స అందించారు.
ఇదిలా ఉండగా, ఎరంగాపై ఐసీసీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేయడంతో శ్రీలంక పేసర్ షమిందా ఎరంగా అంతర్జాతీయ మ్యాచ్ల్లో బౌలింగ్ కు దూరమయ్యాడు. ఇంగ్లండ్ మ్యాచ్ సందర్భంగా అతని బౌలింగ్ శైలిపై ఫీల్డ్ అంపైర్లు అనుమానం వ్యక్తం చేసి ఐసీసీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎరంగా బౌలింగ్ ను తాజాగా పరిశీలించిగా అతని యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేలింది. దీంతో అతని బౌలింగ్ పై వేటు వేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. కాగా, దేశవాళీ క్రికెట్లో పాల్గొని బౌలింగ్ ను సరిచేసుకోవచ్చని ఐసీసీ తెలిపింది. శ్రీలంక జట్టుకు బౌలింగ్ చేయాలంటే ముందుగా దేశవాళీ టోర్నీల్లో బౌలింగ్ను మెరుగుపరుచుకోవాల్సి ఉందని అతనికి ఐసీసీ మరో అవకాశం ఇచ్చింది.