కుప్పకూలిన బంగ్లా
ఢాకా: శ్రీలంక పేసర్లు షమింద ఎరంగ (4/49), సురంగ లక్మల్ (3/66) పదునైన బంతులకు బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలింది. పిచ్ నుంచి అందివచ్చిన సహకారంతో చెలరేగిన ఈ జోడి సంయుక్తంగా ఏడు వికెట్లను తీయడంతో బంగ్లా జట్టు కోలుకోలేకపోయింది. ఫలితంగా షేరే బంగ్లా జాతీయ స్టేడియంలో సోమవారం ప్రారంభమైన తొలి టెస్టులో 63.5 ఓవర్లలో 232 పరుగులకే తమ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది.
కెప్టెన్ ముష్ఫికర్ రహీం (122 బంతుల్లో 61; 9 ఫోర్లు), షకీబ్ అల్ హసన్ (91 బంతుల్లో 55; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించగా... గజీ (56 బంతుల్లో 42; 6 ఫోర్లు; 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న తమ కెప్టెన్ నిర్ణయాన్ని లంక బౌలర్లు వమ్ము చేయలేదు. వీరి ధాటికి ఏడుగురు బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరును కూడా చేయలేకపోయారు.
బంగ్లాదేశ్ 59 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో షకీబ్, ముష్ఫికర్ కలిసి 86 పరుగులు జోడించి ఆదుకున్నారు. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్‌లో లంక 19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసింది. కరుణరత్నే (58 బంతుల్లో 28 బ్యాటింగ్; 4 ఫోర్లు), సిల్వ (57 బంతుల్లో 30 బ్యాటింగ్; 5 ఫోర్లు) నిలకడగా ఆడుతున్నారు.