
ఏంజెలో మాథ్యూస్‌ను టైమ్ ఔట్‌గా ప్రకటించే విషయంలో క్రీడాస్పూర్తికి విరుద్దంగా వ్యవహరించాడని విమర్శలు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ ఈ విషయమై మ్యాచ్ అనంతరం స్పందించాడు. మాథ్యూస్ టైమ్ ఔట్ కోసం అప్పీల్ చేసినందుకు నాకు ఎలాంటి బాధలేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు.
మా ఫీల్డర్‌లలో ఒకరు నా దగ్గరకు వచ్చి అప్పీల్ చేస్తే మాథ్యూస్ ఔట్ అవుతాడని తెలిపాడు. అలాగే చేశాను. అంపైర్లు నేను సీరియస్‌గా అప్పీల్ చేస్తున్నానా లేదా అని అడిగారు. అవునని చెప్పాను. ఇది తప్పో ఒప్పో నాకు తెలీదు. రూల్స్‌లో ఉంది కాబట్టి అప్పీల్ చేశాను.
యుద్ధంలో ఉన్నప్పుడు జట్టు ప్రయోజనాల కోసం ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవాల్సి వస్తుంది. అందుకు నేనెప్పుడూ సిద్దంగా ఉంటాను. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోనంటూ కామెంట్స్ చేశాడు. పైగా మాథ్యూస్‌తో వాగ్వాదం తమ గెలుపుకు కలిసొచ్చిందని అన్నాడు.
కాగా, వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ నిర్ణీత సమయం (2 నిమిషాలు) కంటే నిమిషం ఆలస్యంగా బ్యాటింగ్‌కు వచ్చి టైమ్ ఔట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే.
ఈ విషయంలో బంగ్లా కెప్టెన్ షకీబ్ క్రీడాస్పూర్తి విరుద్దంగా వ్యవహరించి అందరి చీత్కారాలకు గురవుతున్నాడు. మాథ్యూస్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయనప్పటికీ షకీబ్ కనీస క్రీడా ధర్మాన్ని మరిచి ప్రవర్తించడం క్రికెట్ అభిమానులను విస్మయానికి గురి చేస్తుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై బంగ్లాదేశ్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.
Comments
Please login to add a commentAdd a comment