
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆర్సీబీ విజయం సాధించింది. శుక్రవారం చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో సీఎస్‌కేను ఆర్సీబీ చిత్తు చేసింది. దీంతో సీఎస్‌కే కంచుకోటను ఆర్సీబీ బద్దలు కొట్టింది. 2008 సీజన్ తర్వాత చెపాక్‌లో సీఎస్‌కేను ఆర్సీబీ ఓడించడం ఇదే తొలిసారి.
అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. 30 బంతులు ఎదుర్కొని కేవలం 31 పరుగులు మాత్రమే చేసి విరాట్ ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో కోహ్లి ఇన్నింగ్స్‌పై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు.
"ఈ మ్యాచ్‌లో చెన్నై బౌలర్లను ఎదుర్కొనేందుకు విరాట్ కోహ్లి ఇబ్బందిపడ్డాడు. తను ఎదుర్కొన్న తొలి బంతి నుంచే కోహ్లి అంత కంఫార్ట్‌గా కన్పించలేదు. ఎక్కువగా లెగ్ సైడ్ షాట్లు ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతిని మిడిల్ చేయలేకపోయాడు. పతిరానా బౌలింగ్‌లో తన హెల్మెట్‌కు బంతి బలంగా తగిలింది.
వెంటనే ఓ సిక్స్, ఫోరు కొట్టి టచ్‌లోకి వచ్చినట్లు కన్పించాడు. కానీ వెంటనే నూర్ అహ్మద్ బౌలింగ్‌లో లాఫ్టెడ్ స్వీప్ ఆడుతూ డీప్ స్క్వేర్ లెగ్‌లో దొరికిపోయాడు. అస్సలు ఇది కోహ్లి ఇన్నింగ్సే కాదు. కోహ్లి ఫెయిల్ అయినప్పటికి మిగితా ప్లేయర్లు అద్బుతంగా రాణించారు.
విరాట్ 30 బంతుల్లో 31 పరుగులు చేస్తే.. మిగిలిన ప్లేయర్ చెలరేగడంతో ఆర్సీబీ 196 పరుగులు చేసింది. అంటే కోహ్లి 5 ఓవర్లు ఆడినప్పటికి.. మిగితా ప్లేయర్ల 15 ఓవర్లలో జట్టుకు 166 పరుగులు అందించారు. గతంలో కోహ్లి బాగా ఆడితే మిగితా ఆర్సీబీ బ్యాటర్లు నిరాశపరిచేవారు.
దీంతో ప్రతీసారి జట్టు 15 నుంచి 20 పరుగులు వెనకబడి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కోహ్లి ఇబ్బంది పడుతున్నప్పటికీ.. మిగితా ప్లేయర్లు ఎటాక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉంది" అని తన యూట్యూబ్ ఛానల్‌లో చోప్రా పేర్కొన్నాడు.
చదవండి: PAK vs NZ: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ ప్లేయర్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా