Angelo Mathews
-
చండీమల్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా శ్రీలంక
గాలే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. ఆ జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తూ తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 306 పరుగులు (తొలి ఇన్నింగ్స్‌లో) చేసింది.దినేశ్ చండీమల్ (116) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. ఏంజెలో మాథ్యూస్ (78 నాటౌట్), కమిందు మెండిస్ (51 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. దిముత్ కరుణరత్నే 46 పరుగులతో పర్వాలేదనిపించగా.. పథుమ్ నిస్సంక కేవలం ఒక్క పరుగుకే ఔటై నిరాశపరిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, గ్లెన్ ఫిలిప్స్ తలో వికెట్ పడగొట్టగా.. కరుణరత్నే రనౌటయ్యాడు.కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో శ్రీలంక 63 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో కమిందు మెండిస్ సెంచరీతో.. ప్రభాత్ జయసూర్య తొమ్మిది వికెట్లు తీసి లంక గెలుపులో ప్రధానపాత్ర పోషించారు.తుది జట్లు..శ్రీలంక: పథుమ్ నిస్సంక, దిముత్ కరుణరత్నే, దినేశ్ చండిమాల్, ఏంజెలో మాథ్యూస్, కమిందు మెండిస్, ధనంజయ డిసిల్వా (కెప్టెన్), కుసాల్ మెండిస్ (వికెట్‌కీపర్), మిలన్ రత్నాయక్, ప్రభాత్ జయసూర్య, నిషాన్ పెరిస్, అసిత ఫెర్నాండోన్యూజిలాండ్: టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్‌కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ (కెప్టెన్), అజాజ్ పటేల్, విలియమ్ ఓరూర్కీచదవండి: 21వ శతాబ్దపు అత్యుత్తమ జట్టు.. ధోని, రోహిత్‌లకు నో ప్లేస్..! -
ఇంగ్లండ్‌తో టెస్టు.. ఎట్టకేలకు లంక పేసర్ అరంగేట్రం!
ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు శ్రీలంక క్రికెట్ బోర్డు తమ తుదిజట్టును ప్రకటించింది. పేసర్ మిలన్ రత్నాయకేకు ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టే అవకాశం కల్పించింది. మిలన్ ఆగమనం మినహా.. ఈ ఏడాది ఆరంభంలో బంగ్లాదేశ్‌తో తలపడ్డ జట్టుతోనే ఇంగ్లండ్‌తో టెస్టులోనూ బరిలోకి దిగనున్నట్లు తెలిపింది.కాగా టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య ఆగష్టు 21న మొదటి టెస్టు ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించగా.. మంగళవారం శ్రీలంక సైతం తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను వెల్లడించింది.ధనంజయ డి సిల్వ సారథ్యంలోని ఈ జట్టులో వెటరన్ బ్యాటర్ దిముత్ కరుణరత్నె.. యువ క్రికెటర్ నిషాన్ మదుష్కతో కలిపి లంక ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. ఇక మిడిలార్డర్లో కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, దినేశ్ చండిమాల్ ఆడనుండగా.. కెప్టెన్ ధనంజయ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు.అతడి తర్వాతి స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కమిందు మెండిస్ రానున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో పేసర్లు అసితా ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండోతో పాటు కొత్తగా రత్నాయకే కూడా చోటు దక్కించుకున్నాడు. ఇప్పటికి రెండు సార్లు జాతీయ జట్టు సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నా తుదిజట్టులో మాత్రం అతడికి స్థానం దక్కలేదు. అయితే, ఇంగ్లండ్‌తో సిరీస్ సందర్భంగా ఆ లోటు తీరనుంది.కాగా 28 ఏళ్ల మిలన్ రత్నాయకే ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 39 మ్యాచ్‌లు ఆడి 79 వికెట్లు తీశాడు. ఇందులో మూడు నాలుగు వికెట్ల హాల్స్, ఒక ఐదు వికెట్ల హాల్ ఉంది. ఇక 45 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడిన మిలన్ రత్నాయకే 47 వికెట్లు పడగొట్టాడు. 22 టీ20లలో 24 వికెట్లు తీశాడు.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఒకే ఒక్క స్పెషలిస్టు స్పిన్నర్ ప్రభాత్ జయసూర్యకు మాత్రమే చోటు దక్కింది. ఇక పాతుమ్ నిసాంక, సదీర సమరవిక్రమ, రమేశ్ మెండిస్, నిసాల తారక, లాహిరు కుమార, కసున్ రజిత, జెఫ్రే వాండర్సె బెంచ్‌కే పరిమితం కానున్నారు. కాగా 2016లో చివరగా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక 0-2తో ఓటమిని చవిచూసింది. గత మూడు సందర్భాల్లోనూ ఇంగ్లండ్ చేతిలో ఓటమి(ఎనిమిది టెస్టుల్లో ఏడు పరాజయం, ఒకటి డ్రా) పాలైంది.ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక తొలి టెస్టు:తుదిజట్లుఇంగ్లండ్డాన్ లారెన్స్, బెన్ డకెట్, ఓలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గుస్ అట్కిన్సన్, మాథ్యూ పాట్స్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్.శ్రీలంకదిముత్ కరుణరత్నే, నిషాన్ మదుష్క, కుసల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, దినేశ్ చండిమాల్, ధనంజయ డిసిల్వా (కెప్టెన్), కమిందు మెండిస్, ప్రభాత్ జయసూర్య, అసిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో, మిలన్ రత్నాయకే. -
సిక్సర్ల మోత మోగించిన ఫ్లెచర్, మాథ్యూస్
లంక ప్రీమియర్ లీగ్‌లో భాగంగా డంబుల్లా సిక్సర్స్‌తో ఇవాళ (జులై 15) జరిగిన మ్యాచ్‌లో క్యాండీ ఫాల్కన్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ఐదుగురు బ్యాటర్లు కలిసి ఏకంగా 17 సిక్సర్లు బాదారు. వీరిలో ఆండ్రీ ఫ్లెచర్ (7), ఏంజెలో మాథ్యూస్ (5) మాత్రమే 12 సిక్సర్లు కొట్టారు. కమిందు మెండిస్, మొహమ్మద్ హరీస్ తలో 2, చండీమల్ ఓ సిక్సర్ బాదారు. బ్యాటర్లంతా తలో చేయి వేసి సిక్సర్ల మోత మోగించడంతో ఫాల్కన్స్ భారీ స్కోర్ చేసింది.ఫ్లెచర్, మెండిస్ అర్ద సెంచరీలుఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాండీ ఫాల్కన్స్.. ఆండ్రీ ఫ్లెచర్ (34 బంతుల్లో 60; ఫోర్, 7 సిక్సర్లు), కమిందు మెండిస్ (24 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్ (23 బంతుల్లో 44 నాటౌట్; 5 సిక్సర్లు), మొహమ్మద్ హరీస్ (13 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. డంబుల్లా బౌలర్లలో దుషన్ హేమంత ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 3 వికెట్లు తీశాడు. సోనల్ దినుషకు ఓ వికెట్ దక్కింది.హసరంగ మాయాజాలం223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సిక్సర్స్.. హసరంగ (4-0-35-4), దసున్ షకన (4-0-29-3) దెబ్బకు నిర్ణీత ఓవర్లలో 168 పరుగులు (9 వికెట్ల నష్టానికి) మాత్రమే చేసి, 54 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సిక్సర్స్ ఇన్నింగ్స్‌లో కుశాల్ పెరీరా (74) ఒక్కడే రాణించాడు. -
శ్రీలంక, బంగ్లాదేశ్ ఆటగాళ్ల మధ్య కొనసాగుతున్న "రివెంజ్ వార్"
ఇటీవలికాలంలో శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెటర్ల మధ్య ప్రతీకార చర్యలు ఎక్కువై పోయాయి. ఈ ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో ఎప్పుడు ఎదురుపడ్డా కొట్టుకున్నంత పని చేస్తున్నారు. వన్డే వరల్డ్‌కప్ 2023 సందర్భంగా మొదలైన ఈ రివెంజ్ వార్.. తాజాగా జరిగిన ఓ మ్యాచ్ అనంతరం పతాక స్థాయి చేరింది. THE CINEMA OF WORLD CRICKET. - The Nagin Rivalry. 😄💪 pic.twitter.com/hiNpdUD0MD — Mufaddal Vohra (@mufaddal_vohra) March 18, 2024 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా హెల్మెట్ సమస్య కారణంగా లంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ను టైమ్డ్ అవుట్‌గా ప్రకటించారు. బంగ్లా ఆటగాళ్ల అనైతిక అప్పీల్ కారణంగా ఆ మ్యాచ్‌లో మాథ్యూస్ అరుదైన రీతిలో ఔటయ్యాడు. During World Cup - Mathews was timed out vs Bangladesh due to helmet issue. After the T20I series - Sri Lanka celebrated the win with a timed-out move. Now after the ODI series - Mushfiqur bought his helmet to celebrate the win. This is Cinema. 😁👌pic.twitter.com/qgDXgY6FmN — Johns. (@CricCrazyJohns) March 18, 2024 అప్పట్లో బంగ్లా ఆటగాళ్ల అనైతికతను బహిరంగంగా ఎండగట్టిన లంక ఆటగాళ్లు తాజాగా జరిగిన ఓ సిరీస్ సందర్భంగా వారిపై ప్రతీకారం తీర్చుకున్నారు. ఇటీవల బంగ్లాదేశ్‌పై టీ20 సిరీస్ నెగ్గిన లంకేయులు.. అనంతరం జరిగిన గెలుపు సంబురాల్లో "టైమ్డ్ అవుట్" అంశాన్ని సూచిస్తూ ఓవరాక్షన్ చేశారు. The Lanka-Bangla encounters never fail to impress us🦁🐯 📸: Fan Code pic.twitter.com/1EIlBcoQ5o — CricTracker (@Cricketracker) March 18, 2024 ఆ చర్యకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం బంగ్లాదేశ్‌కు ఇవాళ (మార్చి 18) వచ్చింది. వన్డే సిరీస్‌లో శ్రీలంకను 2-1 తేడాతో చిత్తు చేసిన అనంతరం బంగ్లాదేశ్ వెటరన్ ముష్ఫికర్ రహీం హెల్మట్‌ను పట్టుకుని శ్రీలంక టైమ్డ్ అవుట్ యాక్షన్‌కు రీకౌంటర్ ఇచ్చాడు. శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెటర్ల మధ్య జరుగుతున్న ఈ ప్రతీకార చర్యల యుద్దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ అంశానికి నెటిజన్లు "నాగిన్ రైవల్రీ" అని నామకరణం చేశారు. కాగా, శ్రీలంకతో ఇవాళ జరిగిన సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 40.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను చేతిక్కించుకుంది. -
దుమ్ములేపుతున్న శ్రీలంక.. వరుసగా మూడో సిరీస్ విజయం
దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో 72 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే సిరీస్‌ను 2-0 తేడాతో శ్రీలంక కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో సమరవిక్రమ(51) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మాథ్యూస్(22 బంతుల్లో 42, 2ఫోర్లు, 4సిక్స్‌లు), హసరంగా(9 బంతుల్లో 22) మెరుపులు మెరిపించారు. అఫ్గాన్ బౌలర్లలో నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ఫరూఖీ, నవీన్ తలా వికెట్ పడగొట్టారు. అనంతరం 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్.. లంక బౌలర్ల దాటికి 17 ఓవర్లలో కేవలం 115 పరుగులకే కుప్పకూలింది. లంక బౌలర్లలో మాథ్యూస్, బినార ఫెర్నాండో, హసరంగా,థీక్షణ, పతిరానా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో కరీం జనత్(28) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టీ20 దంబుల్లా వేదికగా బుధవారం జరగనుంది. కాగా లంక ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
రాణించిన సమరవిక్రమ.. చెలరేగిన హసరంగ, మాథ్యూస్
డంబుల్లా వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక జట్టు ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవరల్లో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. మిడిలార్డర్ ఆటగాడు సమరవిక్రమ (42 బంతుల్లో 51; 5 ఫోర్లు) అర్దసెంచరీతో రాణించాడు. ఆఖర్లో హసరంగ (9 బంతుల్లో 22; ఫోర్, 2 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్ (22 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. ఓపెనర్లు పథుమ్ నిస్సంక (11 బంతుల్లో 25; 5 ఫోర్లు), కుశాల్ మెండిస్‌లకు (14 బంతుల్లో 23; 4 ఫోర్లు) శుభారంభం లభించినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ధనంజయ డిసిల్వ 14, అసలంక 4 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఫ్ఘన్ బౌలర్లలో అజ్మతుల్లా, మొహమ్మద్ నబీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఫజల్ హాక్ ఫారూకీ, నవీన్ ఉల్ హాక్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్ (1), ఇబ్రహీం జద్రాన్ (10) ఔట్ కాగా.. రహ్మానుల్లా గుర్బాజ్ (9), గుల్బదిన్ నైబ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. బ్యాటింగ్‌లో చెలరేగిన ఏంజెలో మాథ్యూస్ బౌలింగ్‌లోనూ సత్తా చాటి రెండు వికెట్లు పడగొట్టాడు. మూడు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో శ్రీలంక తొలి మ్యాచ్‌లో విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
ఏంటి అన్న నీకే ఎందుకు ఇలా.. ఫోర్ కొట్టి అదే బంతికి ఔటయ్యాడు!
కొలంబో వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో శ్రీలంక పట్టుబిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. లంక ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో శ్రీలంక వెటరన్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ దురదృష్టం వెంటాడింది. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ చేసిన మాథ్యూస్(141)ఊహించని విధంగా ఔటయ్యాడు. హిట్‌వికెట్‌గా మథ్యూస్ వెనుదిరిగాడు. ఏం జరిగిందంటే? శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 102 ఓవర్లో స్పిన్నర్ కైస్ అహ్మద్ రెండో బంతిని మథ్యూస్కు లెగ్ సైడ్ బాగా వైడ్ వేశాడు. అయితే షాట్ ఆఫర్ ఉండడంతో మథ్యూస్ కూడా కొంచెం లెగ్ సైడ్ జరిగి స్వీప్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతిని సరిగ్గా కనక్ట్ చేసిన మథ్యూస్ ఆ డెలివరినీ ఫోర్‌గా మలిచాడు. కానీ ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటు చేసుకుంది. బంతిని బౌండరీకి తరిలించే క్రమంలో మథ్యూస్ సమన్వయం కోల్పోయి తన బ్యాట్‌తో స్టంప్స్‌ను పడగొట్టాడు. దీని ఫలితంగా మాథ్యూస్ హిట్ వికెట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఏంటి బ్రో నీకే ఎందుకు ఇలా జరుగుతుందని కామెంట్లు చేస్తున్నారు. కాగా గతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో కూడా మథ్యూస్ టైమ్డ్ ఔట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అప్పటిలో అది వరల్డ్ క్రికెట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. చదవండి: #Jasprit Bumrah: వారెవ్వా బుమ్రా.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ బాల్! బ్యాటర్ మైండ్ బ్లాంక్ Angelo Mathew’s with a four and bowled pic.twitter.com/IZITIq1Pmy — Jarrod Kimber (@ajarrodkimber) February 3, 2024 -
SL Vs ZIM, 3rd T20I: హసరంగ మ్యాజిక్.. చిత్తుగా ఓడిన జింబాబ్వే
జింబాబ్వేతో జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20 శ్రీలంక స్పిన్ సెన్సేషన్, ఆ జట్టు కెప్టెన్ వనిందు హసరంగ (4-0-15-4) మ్యాజిక్ చేశాడు. ఫలితంగా శ్రీలంక 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. హసరంగ, తీక్షణ (3.1-0-14-2), ఏంజెలో మాథ్యూస్ (2-0-15-2), ధనంజయ డిసిల్వ (1-0-1-1), మధుషంక (2-0-22-1) ధాటికి 14.1 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కమున్హుకామ్వే (12), బ్రియన్ బెన్నెట్ (29), సీన్ విలియమ్స్ (15), కెప్టెన్ సికందర్ రజా (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక.. 10.5 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. పథుమ్ నిస్సంక (39 నాటౌట్), కుశాల్ మెండిస్ (33) రాణించగా.. ధనంజయ డిసిల్వ 15 పరుగులతో అజేయంగా నిలిచాడు. కుశాల్ మెండిస్ వికెట్ సీన్ విలియమ్స్‌కు దక్కింది. ఈ సిరీస్‌లో తొలి టీ20లో శ్రీలంక గెలువగా.. రెండో మ్యాచ్ జింబాబ్వే, ఇప్పుడు మూడో మ్యాచ్ మళ్లీ శ్రీలంకనే గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. -
ఏంజెలో మాథ్యూస్ చెత్త బౌలింగ్.. శ్రీలంకకు ఊహించని పరాభవం
కొలొంబో: పసికూన జింబాబ్వే.. తమకంటే చాలా రెట్లు మెరుగైన శ్రీలంకకు ఊహించని షాకిచ్చింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నిన్న (జనవరి 16) జరిగిన రెండో మ్యాచ్‌లో లంకేయులు ఓ మోస్తరు స్కోర్ చేసినా, దాన్ని కాపాడుకోవడంలో విఫలమయ్యారు. అనుభవజ్ఞుడైన ఏంజెలో మాథ్యూస్ (1.5-0-35-0) చివరి ఓవర్లో 24 పరుగులిచ్చి లంక ఓటమికి కారకుడయ్యాడు. లూక్ జాంగ్వే.. మాథ్యూస్ వేసిన చివరి ఓవర్లో 2 సిక్సర్లు, బౌండరీ బాది జింబాబ్వేకు అద్భుత విజయాన్నందించాడు. ఈ గెలుపుతో జింబాబ్వే 1-1తో సిరీస్‌ను సమం చేసింది. తొలి మ్యాచ్‌లో శ్రీలంక గెలువగా.. నిర్ణయాత్మక మూడో టీ20 జనవరి 18న జరుగనుంది. మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. చరిత్ అసలంక (39 బంతుల్లో 69; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్ (51 బంతుల్లో 66 నాటౌట్, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో అసలంక, మాథ్యూస్ మినహా అంతా విఫలమయ్యారు. నిస్సంక 1, కుశాల్ మెండిస్ 4, కుశాల్ పెరీరా 0, సమరవిక్రమ 16, షనక 9 పరుగులు చేసి ఔటయ్యారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ, లూక్ జాంగ్వే చెరో 2 వికెట్లు పడగొట్టగా.. నగరవ, మసకద్జ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే.. ఆఖరి ఓవర్లో జాంగ్వే మెరుపులు (12 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిపించడంతో మరో బంతి మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. అంతకుముందు క్రెయిగ్ ఎర్విన్ (70) జింబాబ్వే ఇన్నింగ్స్‌కు పునాది వేయగా.. బ్రియాన్ బెన్నెట్ (25) పర్వాలేదనిపించాడు. వరుస హాఫ్ సెంచరీలతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన సికందర్ రజా (8) ఐదు మ్యాచ్‌ల తర్వాత తొలిసారి విఫలమయ్యాడు. ఆఖర్లో జాంగ్వే.. క్లైవ్ మదండే (15 నాటౌట్) సాయంతో జింబాబ్వేను గెలిపించాడు. లంక బౌలర్లలో తీక్షణ, చమీరా తలో 2 వికెట్లు పడగొట్టగా.. కెప్టెన్ హసరంగ భారీ పరుగులు (4 ఓవర్లలో 41) సమర్పించుకుని ఓ వికెట్ తీశాడు. -
రాణించిన మాథ్యూస్, హసరంగ.. సికందర్ రజా ఆల్‌రౌండ్ షో వృధా
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జింబాబ్వేతో (కొలొంబో వేదికగా) జరిగిన తొలి టీ20లో శ్రీలంక 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. సికందర్ రజా (62) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. సికందర్ రజా మినహా జింబాబ్వే ఇన్నింగ్స్‌లో అందరూ తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. కమున్హుకంవే 26, క్రెయిగ్ ఎర్విన్ 10, సీన్ విలియమ్స్ 14, ర్యాన్ బర్ల్ 5 పరుగులు చేసి ఔట్ కాగా.. బ్రియాన్ బెన్నెట్ 10, జోంగ్వే 13 పరుగులతో అజేయంగా నిలిచారు. లంక బౌలర్లలో తీక్షణ (4-0-16-2), హసరంగ (4-0-19-2), చమీరా (4-0-38-1) వికెట్లు పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో శ్రీలంక సైతం తడబడింది. ఆ జట్టు అతి కష్టం మీద చివరి బంతికి విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో ఏంజెలో మాథ్యూస్ (38 బంతుల్లో 46; 5 ఫోర్లు, సిక్స్) వరుసగా రెండు బౌండరీలు బాది లంక విజయాన్ని ఖరారు చేశాడు. ఆతర్వాత చమీరా ఐదు, ఆరు బంతులకు ఆరు పరుగులు (4, 2) సాధించి లంకను విజయతీరాలకు చేర్చాడు. లంక ఇన్నింగ్స్‌లో మాథ్యూస్, షనక (18 బంతుల్లో 26 నాటౌట్; 4 ఫోర్లు) రాణించగా.. జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా (4-0-13-3) బంతితోనూ సత్తా చాటాడు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబానీ 2, రిచర్డ్ నగరవ, వెల్లింగ్టన్ మసకద్జ తలో వికెట్ పడగొట్టారు. రెండో టీ20 ఇదే వేదికపై జనవరి 16న జరుగనుంది. -
మాథ్యూస్ ఒక్క బంతినైనా ఆడాల్సింది.. అలా చేసి ఉంటే: దినేష్ కార్తీక్
వన్డే వరల్డ్‌కప్-2023లో శ్రీలంక ఆటగాడు ఏంజులో మాథ్యూస్ టైమ్డ్ ఔట్‌తో చరిత్రకెక్కిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయం లో తొలి బంతిని ఎదుర్కోని కారణంగా ఔట్‌గా మాథ్యూస్ వెనుదిరిగాడు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఇలా వెనుదిరిగిన తొలి క్రికెటర్‌గా మాథ్యూస్ నిలిచాడు. ఇది జరిగి దాదాపు ఐదు రోజులు అవుతున్నప్పటకీ ఇంకా చర్చ జరగుతూనే ఉంది. కొంత మంది బంగ్లా కెప్టెన్ షకీబ్ చేసింది సరైందే అంటూ మరికొంత మంది మాథ్యూస్‌ను తప్పుబడుతున్నారు. తాజాగా ఇదే విషయంపై టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. మాథ్యూస్ కనీసం ఒక్క బంతినైనా ఎదుర్కొని హెల్మెట్‌ను మార్చకోవాల్సందని కార్తీక్ అన్నాడు. "హెల్మెట్ మార్చమని అభ్యర్థించడానికి ముందు మాథ్యూస్ కనీసం ఒక బంతిని ఫేస్ చేసి ఉంటే బాగుండేది. అప్పుడు ఎటువంటి సమస్య ఉండకపోయేది. అయితే ఆ సమయంలో అతడికి ఆ ఆలోచిన వచ్చి ఉండదు. ఆ దిశగా అతడు అస్సలు ఆలోచించలేదు. ఎందుకంటే టైమ్డ్ ఔట్‌కు ప్రత్యర్ధి జట్టు అప్పీలు చేస్తారని మాథ్యూస్ ఊహించి ఉండడు. అదే ఇక్కడ కీలకమైన అంశమని" క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు. చదవండి: World Cup 2023: క్వింటన్ డికాక్ అరుదైన ఘనత.. గిల్‌క్రిస్ట్ రికార్డు సమం! -
అతడికి తగిన శాస్తే జరిగింది.. కానీ ఇకపై అలా చేయొద్దు! బదులుగా..
Angelo Mathews Timed Out Row: ‘టైమ్డ్ అవుట్’ విషయంలో శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌ను ఉద్దేశించి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ ఘాటు విమర్శలు చేశాడు. చేసిన తప్పునకు అతడికి తగిన శాస్తే జరిగిందంటూ కుండబద్దలు కొట్టాడు. అయితే, ఇలాంటి నిబంధన మాత్రం తనకు నచ్చలేదని పేర్కొన్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా శ్రీలంక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ అవుట్ అయిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం.. క్రీజులోకి వచ్చిన తర్వాత నిర్ణీత సమయం(2 నిమిషాల్లో)లో తొలి బంతిని ఎదుర్కోని కారణంగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో తొలి ఆటగాడిగా హెల్మెట్ విషయంలో జరిగిన పొరపాటును సరిచేసుకునే క్రమంలో మాథ్యూస్ మైదానాన్ని వీడక తప్పలేదు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అప్పీలుతో ఏకీభవించిన అంపైర్లు అతడిని టైమ్డ్ అవుట్‌గా ప్రకటించారు. దీంతో ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇలా వెనుదిరిగిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ విషయంపై క్రికెట్ వర్గాలు రెండు చీలిపోయి చర్చలు సాగిస్తున్నాయి. మాథ్యూస్ పట్ల షకీబ్ క్రీడాస్ఫూర్తి కనబరిచాల్సిందని కొంతమంది అంటుండగా.. నిబంధనల ప్రకారం షకీబ్ చేసింది సరైందే అంటూ మరికొంత మంది మాథ్యూస్‌ను తప్పుబడుతున్నారు. అందుకు సంసిద్ధంగా లేరనే అర్థం ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ సైతం ఈ విషయంలో షకీబ్ వైపే నిలిచాడు. ‘‘బ్యాటర్లుకు సమయం చాలా ముఖ్యమైంది. ఒకవేళ టైమ్‌కి రాకపోతే ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. ఏంజెలో మాథ్యూస్ దేనికైతే అర్హుడో అదే జరిగింది. మీకు రెండు నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. కాబట్టి వికెట్ పడిన వెంటనే క్రీజులోకి వెళ్లి రెండు నిమిషాల్లోపే బంతిని ఎదుర్కోవాలి. ఒకవేళ మీరలా చేయలేదంటే బ్యాటింగ్‌కు చేసేందుకు మీరు సంసిద్ధులు కాలేదనే అర్థం కదా!’’ అంటూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశాడు. 12 పరుగులు పెనాల్టీ విధించాలి మాథ్యూస్ విషయంలో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌తో పాటు అంపైర్లు నిబంధనల ప్రకారమే వ్యవహరించాని బ్రాడ్ హాగ్ పరోక్షంగా వారిని సమర్థించాడు. అయితే, ఇలా బ్యాటర్‌ను టైమ్డ్ అవుట్ చేయడం తనకు నచ్చలేదన్న ఈ మాజీ బౌలర్ ఓ పరిష్కారాన్ని సూచించాడు. ‘‘నాకు ఇలాంటి డిస్మిసల్ నచ్చలేదు. అంతర్జాతీయ క్రికెట్లో ఇలా జరగడం ఇదే తొలిసారి. అయితే, మళ్లీ ఇలాంటివి జరగాలని నేను కోరుకోవడం లేదు. ఇలాంటి సందర్భాల్లో బ్యాటర్‌ను అవుట్‌గా ప్రకటించే బదులు.. బ్యాటింగ్ జట్టుకు 12 పరుగుల మేర కోత విధిస్తే బాగుంటుంది. అపుడైనా ఇలా ఆలస్యం చేసేవాళ్లు కాస్త తొందరగా రెడీ అవుతారు. వికెట్ పడగానే క్రీజులోకి పరిగెత్తుకుని వచ్చి బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు’’ అని బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. చదవండి: ఇలాంటి తోడు ఉంటే ఏదైనా సాధ్యమే! ప్రేమ, పెళ్లి.. రెయిన్బో బేబీ! View this post on Instagram A post shared by Brad Hogg (@brad_hogg) -
అతడు శ్రీలంకకు వస్తే జరిగేది ఇదే: ఏంజెలో మాథ్యూస్ సోదరుడి వార్నింగ్
Angelo Mathews- Shakib Al Hasan- Timed Out: బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌కు శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ సోదరుడు ట్రెవిన్ మాథ్యూస్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ‘టైమ్డ్ అవుట్’ విషయంలో షకీబ్ వ్యవహరించిన తీరుకు కచ్చితంగా మూల్యం చెల్లించాల్సి వస్తుందంటూ హెచ్చరించాడు. క్రీడాస్ఫూర్తిని మరిచిన అతడు శ్రీలంకలో అడుగుపెడితే అభిమానుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రెవిన్ పేర్కొన్నాడు. షకీబ్‌కు రాళ్లతో సన్మానం ఖాయమంటూ తీవ్ర విమర్శలు చేశాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో శ్రీలంక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ అనూహ్య, అరుదైన రీతిలో అవుటైన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by ICC (@icc) ఆలస్యం చేశాడు.. అనుభవించకతప్పలేదు న్యూఢిల్లీలో జరిగిన ఈ మ్యాచ్‌లో.. లంక ఇన్నింగ్స్ 25వ ఓవర్ రెండో బంతికి సమరవిక్రమ అవుటయ్యాడు. నిబంధనల ప్రకారం తర్వాతి బ్యాటర్ 2 నిమిషాల్లోగా బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. క్రీజ్‌లోకి మాథ్యూస్ సరైన సమయానికే వచ్చినా బంతిని ఎదుర్కోవడంలో ఆలస్యం చేశాడు. తన హెల్మెట్‌ను సరి చేసుకుంటుండగా దాని స్ట్రాప్ తెగింది. దాంతో మరో హెల్మెట్ కోసం సైగ చేయగా, చమిక మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చాడు. అప్పటికే సమయం మించిపోవడంతో బౌలర్, బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ ‘టైమ్డ్ అవుట్’ కోసం అప్పీల్ చేశాడు. ఈ అప్పీల్‌ను పరిగణనలోకి తీసుకున్న అంపైర్లు చర్చించి నిబంధనల ప్రకారం మాథ్యూస్‌ను ‘అవుట్’గా ప్రకటించారు. ఈ క్రమంలో తన హెల్మెట్ సమస్యను మాథ్యూస్ అంపైర్లకు వివరించినా వారు స్పందించలేదు. బతిమిలాడినా మనసు కరగలేదు ఆ తర్వాత అప్పీల్ వెనక్కి తీసుకోమని షకీబ్‌ను కూడా కోరినా అతను ససేమిరా అనడంతో మాథ్యూస్ వెనుదిరగక తప్పలేదు. దీంతో.. 146 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్లో ‘టైమ్డ్ అవుట్’ ద్వారా అవుట్ అయిన తొలి క్రికెటర్‌గా మాథ్యూస్ నిలిచాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ నేపథ్యంలో జెంటిల్మన్ గేమ్‌లో షకీబ్ క్రీడాస్ఫూర్తిని విస్మరించాడంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై స్పందించిన ఏంజెలో మాథ్యూస్ సోదరుడు ట్రెవిన్ మాథ్యూస్ షకీబ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాళ్లు విసరడం ఖాయం దక్కన్ క్రానికల్‌తో మాట్లాడుతూ.. ‘‘మేము నిరాశకు గురయ్యాం. బంగ్లాదేశీ కెప్టెన్‌కు క్రీడాస్ఫూర్తి అంటే ఏమిటో తెలిసినట్లు లేదు. జెంటిల్మన్ గేమ్‌లో అతడు మానవతా దృక్పథం కనబరచకలేకపోయాడు. ఇకపై అతడికి శ్రీలంకలో ఎవరూ స్వాగతం పలకరు. ఏదైనా అంతర్జాతీయ మ్యాచ్ లేదంటే లంక ప్రీమియర్ లీగ్ ఆడేందుకు ఇక్కడికి వస్తే.. అతడిపై రాళ్లు విసురుతారు. అభిమానుల నుంచి అతడు ఛీత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని ట్రెవిన్ మాథ్యూస్ షకీబ్‌కు హెచ్చరికలు జారీ చేశాడు. కాగా ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా బంగ్లాదేశ్ 2025లో శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. అప్పటికి షకీబ్- మాథ్యూస్ టైమ్డ్ అవుట్ వివాదం సమసిపోతుందో లేదో చూడాలి!! View this post on Instagram A post shared by ICC (@icc) ఫోర్త్ అంపైర్ చెప్పిందిదే లంక ఇన్నింగ్స్ అనంతరం.. మాథ్యూస్ టైమ్డ్ అవుట్‌పై ఫోర్త్ అంపైర్ ఏడ్రియన్ హోల్డ్‌స్టాక్ దీనిపై మరింత స్పష్టతనిచ్చారు. ‘మాథ్యూస్‌కు హెల్మెట్ సమస్య కూడా రెండు నిమిషాల తర్వాత వచ్చింది. అప్పటికీ అతను బంతిని ఎదుర్కోకుండా ఆలస్యం చేశాడు. క్రీజ్‌లోకి వచ్చే ముందు ఎక్విప్‌మెంట్‌లో అన్నింటినీ సరిగ్గా చూసుకోవడం కూడా బ్యాటర్‌దే బాధ్యత’ అని ఆయన చెప్పారు. దాంతో షకీబ్ క్రీడా స్ఫూర్తి అంశాన్ని పక్కన పెడితే నిబంధనల ప్రకారం మాథ్యూస్‌ను అవుట్‌గా ప్రకటించడం సరైందే కదా అని క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాగా షకీబ్‌ను అవుట్ చేసిన తర్వాత మాథ్యూస్ కూడా వాచీ చూసుకుంటున్నట్లుగా అభినయిస్తూ నీ టైమ్ అయిపోయిందిక అన్నట్లు సైగ చేయడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌లో లంకపై బంగ్లాదేశ్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా ప్రపంచకప్ టోర్నీలో శ్రీలంకపై తొలి విజయం నమోదు చేసింది. చదవండి: ఆస్ట్రేలియాతో టీమిండియా సిరీస్... అభిమానులకు బ్యాడ్‌న్యూస్! ఎక్కడ తగ్గాలో.. ఎలా నెగ్గాలో తెలిసిన వాళ్లు! ఇలాంటి ఆటగాళ్లు ఉంటే.. -
WC 2023: ‘టైమ్డ్ అవుట్’ అప్పీలుతో చరిత్రకెక్కిన బంగ్లాదేశ్‌కు భారీ షాక్!
ICC WC 2023- Shakib Al Hasan: ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి శ్రీలంకపై గెలిచి జోష్‌లో ఉన్న బంగ్లాదేశ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ షకీబ్ అల్ హసన్ జట్టుకు దూరమయ్యాడు. గాయం కారణంగా వన్డే వరల్డ్‌కప్-2023 ఈవెంట్ నుంచి నిష్క్రమించాడు. ఢిల్లీ వేదికగా సోమవారం శ్రీలంకతో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా వరల్డ్‌కప్ ఈవెంట్లో తొలిసారి లంకపై పైచేయి సాధించింది. అయితే, ఈ గెలుపు కంటే కూడా ‘టైమ్డ్ అవుట్’కు అప్పీలు చేసిన కారణంగానే బంగ్లా జట్టు వార్తల్లో నిలిచింది. టైమ్డ్ అవుట్ అప్పీలుతో చరిత్రకెక్కిన షకీబ్ లంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ నిర్ణీత సమయంలో బంతిని ఎదుర్కోవడంలో విఫలమయ్యాడనే కారణంగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అప్పీలు చేశాడు. ఐసీసీ వరల్డ్‌కప్ నిబంధనల ప్రకారం అతడు రెండు నిమిషాల్లోపు బాల్‌ను ఫేస్ చేయలేదన్న విషయాన్ని అంపైర్ల దృష్టికి తీసుకువెళ్లి తన పంతం నెగ్గించుకున్నాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో టైమ్డ్ అవుట్‌గా వెనుదిరిగిన తొలి బ్యాటర్‌గా మాథ్యూస్ చరిత్రకెక్కగా.. షకీబ్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడంటూ విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. క్రీడా వర్గాల్లో ఈ ఘటనకు సంబంధించిన చర్చ జరుగుతూ ఉండగానే.. బంగ్లాదేశ్‌కు ఓ షాక్ తగిలింది. చేతివేలికి గాయం శ్రీలంకతో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డ షకీబ్ అల్ హసన్ జట్టుకు దూరమయ్యాడు. ఎడమచేతి మధ్యవేలుకు తగిలిన గాయం తీవ్రతరం కావడంతో ఎక్స్‌రే తీయించగా.. ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. ఈ గాయం నుంచి కోలుకోవాలంటే షకీబ్‌కు కనీసం మూడు నుంచి నాలుగు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో పునరావాసం కోసం షకీబ్ అల్ హసన్ స్వదేశానికి తిరుగు పయనమయ్యాడు. ఈ మేరకు బంగ్లాదేశ్ జట్టు ఫిజియో బేజెదుల్ ఇస్లాం ఖాన్ తెలిపినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి వెల్లడించింది. View this post on Instagram A post shared by ICC (@icc) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ‘అవుట్’ కాగా శ్రీలంక ఇన్నింగ్స్ సమయంలో మాథ్యూస్ విషయంలో అప్పీలుతో మరోసారి వివాదాస్పద క్రికెటర్‌గా ముద్రపడ్డ షకీబ్.. లక్ష్య ఛేదనలో అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. 65 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 82 పరుగులు సాధించి.. బంగ్లాదేశ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకు ముందు 2 వికెట్లు కూడా కూల్చిన ఈ స్పిన్ ఆల్‌రౌండర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో షకీబ్ వికెట్‌ను మాథ్యూస్ తన ఖాతాలో వేసుకోవడం విశేషం. అయితే, మాథ్యూస్ విషయంలో బంగ్లా జట్టుకు వికెట్ దక్కినప్పటికీ.. అప్పటికి ఓవర్ కంటిన్యూ చేస్తున్న బౌలర్(షకీబ్ అల్ హసన్) ఖాతాలో మాత్రం జమకాదు. View this post on Instagram A post shared by ICC (@icc) సెమీస్ చేరకున్నా.. ఆ టోర్నీకి అర్హత సాధించేందుకు కాగా ప్రపంచకప్-2023లో బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాతో తమ చివరి మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే సెమీస్ నుంచి నిష్క్రమించినా.. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే చాంపియన్స్ ట్రోఫీ-2025కి అర్హత సాధించే అవకాశాలు బంగ్లాకు సజీవంగా ఉంటాయి. చదవండి: అది క్రీడా స్పూర్తి అంటే.. గ్రేమ్ స్మిత్ కూడా షకీబ్లా ఆలోచించి ఉంటే..! View this post on Instagram A post shared by ICC (@icc) -
టైమ్డ్ ఔట్ కాకుండా మరో విచిత్ర పద్దతిలో ఔట్.. అది కూడా ఈ ఏడాదిలోనే..!
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో ఇలా ఔటైన ఆటగాడు మాథ్యూసే కావడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్లో ఇలా ఎక్కువగా ప్రచారం లేని మరో విధానంలో ఓ బ్యాటర్ ఇదే ఏడాది ఔటయ్యాడు. మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నిబంధనల ప్రకారం బ్యాటర్లు మొత్తం పది విధాలుగా ఔట్‌గా ప్రకటించబడతారు. వాటిలో క్యాచ్ ఔట్, బౌల్డ్, ఎల్బీడబ్ల్యూ, రనౌట్,స్టంపౌట్ అతి సాధారణంగా ప్రకటించబడే ఔట్లు కాగా.. హిట్ వికెట్ (బ్యాటర్ వికెట్లను తగలడం), హ్యాండిల్డ్ బాల్ (బంతిని పట్టుకోవడం లేదా ఆపడం), అబ్స్ట్రక్టెడ్ ఫీల్డ్ (ఉద్దేశపూర్వకంగా ఫీల్డింగ్‌కు అడ్డుతగలడం) వంటివి అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. WATCH the only Hitting The Ball Twice dismissal in international cricket --- when Malta's Fanyan Mughal got out against Romania in the 2023 Men's Continental Cup on 20 August 2023 pic.twitter.com/PFerZJOM4u — Dhaarmik (@DhaarmikAi) November 6, 2023 అయితే పది విధానాల్లో మిగిలిన రెండు విధాల ఔట్లను మాత్రం క్రికెట్ ప్రపంచం ఈ ఏడాదికి ముందు చూసి ఎరుగదు. ఆ రెండు విధాల ఔట్లు ఏవంటే.. టైమ్డ్ ఔట్ (నిర్దేశిత సమయంలోపు బ్యాటింగ్‌కు దిగకపోవడం), హిట్ ట్వైస్ (బ్యాటర్ రెండుసార్లు బంతిని కొట్టడం). ఈ రెంటిలో టైమ్డ్ ఔట్‌ను నిన్నటి వరల్డ్‌కప్ మ్యాచ్‌లో తొలిసారిగా చూశాం. ఇందులో రెండోదైన హిట్ ట్వైస్ ఔట్ ఘటన కూడా ఇదే ఏడాది తొలిసారి జరిగిందన్న విషయం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. పురుషుల కాంటినెంటల్ కప్‌లో భాగంగా ఈ ఏడాది ఆగస్ట్ 20న రొమేనియాతో జరిగిన మ్యాచ్‌లో మాల్టా ఆటగాడు ఫన్యాన్ ముఘల్ ఓసారి బంతిని స్ట్రయిక్ చేసిన అనంతరం ఫీల్డర్ పట్టుకోకముందే మరోసారి బ్యాట్‌తో కొట్టి హిట్ ట్వైస్గా ఔటయ్యాడు. మాథ్యూస్ టైమ్డ్ ఔట్ విషయం వైరలైన నేపథ్యంలో హిట్ ట్వైస్కు సంబంధించిన వీడియో తెరపైకి వచ్చింది. ఈ వీడియో సైతం ప్రస్తుతం వైరలవుతుంది. ఏ ఆటగాడు, ఎప్పుడు తొలిసారి ఔట్‌గా ప్రకటించబడ్డాడంటే.. క్యాచ్ ఔట్ (టామ్ హోరన్, 1877), బౌల్డ్ (నాట్ థామ్సన్, 1877), ఎల్బీడబ్ల్యూ (హ్యారీ జప్, 1877), రనౌట్ (డేవ్ గ్రెగరీ, 1877), స్టంపౌట్ (ఆల్ఫ్రెడ్ షా, 1877), హిట్ వికెట్ (బ్యాటర్ వికెట్లను తగలడం, జార్జ్ బొన్నర్, 1884), హ్యాండిల్డ్ బాల్ (బంతిని పట్టుకోవడం లేదా ఆపడం, రసెల్ ఎండీన్, 1957), అబ్స్ట్రక్టెడ్ ఫీల్డ్ (ఉద్దేశపూర్వకంగా ఫీల్డింగ్‌కు అడ్డుతగలడం, లెన్ హటన్, 1951), హిట్ ట్వైస్ (బ్యాటర్ రెండుసార్లు బంతిని కొట్టడం, ఫన్యాన్ ముఘల్, 2023), టైమ్డ్ ఔట్ (నిర్దేశిత సమయంలోపు బ్యాటింగ్‌కు దిగకపోవడం, ఏంజెలో మాథ్యూస్, 2023) -
క్రికెట్లో ఔట్లు ఎన్ని విధంబులు అనిన...???
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ టైమ్ ఔట్‌గా ప్రకటించబడిన నేపథ్యంలో ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. అసలు క్రికెట్లో ఓ బ్యాటర్ ఎన్ని రకాలుగా ఔట్‌గా ప్రకటించబడతారని అభిమానులు గూగుల్ చేయడం ప్రారంభించారు. దీనికి సమాధానం పది. ఇందులో క్యాచ్ ఔట్, బౌల్డ్, ఎల్బీడబ్ల్యూ, రనౌట్,స్టంపౌట్ అతి సాధారణంగా ప్రకటించబడే ఔట్లు కాగా.. హిట్ వికెట్ (బ్యాటర్ వికెట్లను తగలడం), హిట్ ట్వైస్ (బ్యాటర్ రెండుసార్లు బంతిని కొట్టడం), టైమ్డ్ ఔట్ (నిర్దేశిత సమయంలోపు బ్యాటింగ్‌కు దిగకపోవడం), హ్యాండిల్డ్ బాల్ (బంతిని పట్టుకోవడం లేదా ఆపడం), అబ్స్ట్రక్టెడ్ ఫీల్డ్ (ఉద్దేశపూర్వకంగా ఫీల్డింగ్‌కు అడ్డుతగలడం) వంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి. వీటిలో బ్యాటర్లు దాదాపు అన్ని విధాల్లో ఒకటి అంత కంటే ఎక్కువసార్లు ఔట్ కాగా.. నిన్నటి మ్యాచ్‌లో (శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్) ఓ బ్యాటర్ (ఏంజెలో మాథ్యూస్) తొలిసారి టైమ్డ్ ఔట్‌గా ప్రకటించబడ్డాడు. మాథ్యూస్‌ను టైమ్ ఔట్‌గా ప్రకటించే విషయంలో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ క్రీడాస్పూర్తికి విరుద్దంగా వ్యవహరించాడని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఏదిఏమైనా రూల్ కాబట్టి, అంతిమంగా ఫలితం అతనికి అనుకూలంగానే వచ్చింది. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 3 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం సాధించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదు. ఆ జట్టు ఇదివరకే ప్రపంచకప్ నుంచి ఎలిమినేట్ (సెమీస్‌కు అర్హత సాధించలేదు) అయ్యింది. తాజా ఓటమితో శ్రీలంక కూడా బంగ్లాదేశ్‌తో పాటు ఎలిమినేషన్‌కు గురైంది. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్, శ్రీలంకలతో పాటు ఇంగ్లండ్ కూడా ఇదివరకే ఎలిమినేట్ కాగా.. భారత్, సౌతాఫ్రికా జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి. సెమీస్ రేసులో మూడు, నాలుగు స్థానాల కోసం పోటీ నడుస్తుంది. చదవండి: మాథ్యూస్ టైమ్ ఔట్.. అలా జరిగినందుకు బాధ లేదు.. రూల్స్‌లో ఉన్నదే చేశా: షకీబ్ -
మాథ్యూస్ టైమ్ ఔట్.. అలా జరిగినందుకు బాధ లేదు.. రూల్స్‌లో ఉన్నదే చేశా: షకీబ్
ఏంజెలో మాథ్యూస్‌ను టైమ్ ఔట్‌గా ప్రకటించే విషయంలో క్రీడాస్పూర్తికి విరుద్దంగా వ్యవహరించాడని విమర్శలు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ ఈ విషయమై మ్యాచ్ అనంతరం స్పందించాడు. మాథ్యూస్ టైమ్ ఔట్ కోసం అప్పీల్ చేసినందుకు నాకు ఎలాంటి బాధలేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. మా ఫీల్డర్లలో ఒకరు నా దగ్గరకు వచ్చి అప్పీల్ చేస్తే మాథ్యూస్ ఔట్ అవుతాడని తెలిపాడు. అలాగే చేశాను. అంపైర్లు నేను సీరియస్‌గా అప్పీల్ చేస్తున్నానా లేదా అని అడిగారు. అవునని చెప్పాను. ఇది తప్పో ఒప్పో నాకు తెలీదు. రూల్స్‌లో ఉంది కాబట్టి అప్పీల్ చేశాను. యుద్ధంలో ఉన్నప్పుడు జట్టు ప్రయోజనాల కోసం ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవాల్సి వస్తుంది. అందుకు నేనెప్పుడూ సిద్దంగా ఉంటాను. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోనంటూ కామెంట్స్ చేశాడు. పైగా మాథ్యూస్‌తో వాగ్వాదం తమ గెలుపుకు కలిసొచ్చిందని అన్నాడు. కాగా, వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ నిర్ణీత సమయం (2 నిమిషాలు) కంటే నిమిషం ఆలస్యంగా బ్యాటింగ్‌కు వచ్చి టైమ్ ఔట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంలో బంగ్లా కెప్టెన్ షకీబ్ క్రీడాస్పూర్తి విరుద్దంగా వ్యవహరించి అందరి చీత్కారాలకు గురవుతున్నాడు. మాథ్యూస్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయనప్పటికీ షకీబ్ కనీస క్రీడా ధర్మాన్ని మరిచి ప్రవర్తించడం క్రికెట్ అభిమానులను విస్మయానికి గురి చేస్తుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై బంగ్లాదేశ్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. చదవండి: మాథ్యూస్ 'టైమ్డ్ ఔట్'.. క్లారిటీ ఇచ్చిన అంపైర్ -
ప్రపంచ క్రికెట్‌కు చీకటి రోజు.. అది బంగ్లాదేశ్ కాబట్టే అలా జరిగింది..!
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ నిర్ణీత సమయం (2 నిమిషాలు) కంటే నిమిషం ఆలస్యంగా బ్యాటింగ్ చేసేందుకు వచ్చి టైమ్ ఔట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంలో బంగ్లా కెప్టెన్ షకీబ్ క్రీడాస్పూర్తి విరుద్దంగా వ్యవహరించి అందరి చీత్కారాలకు గురవుతున్నాడు. Even Aasif Sheikh from Nepal has a 1000 time better Sportsmanship then Shakib Al Hasan. Today, Cricket 🏏 has seen a Dark Day that too in a World Cup Match😞 Follow 🙏#BANvsSL #AngeloMatthews #ShakibAlHasan #CWC23 #AngeloMathews #ThugLife #timedout pic.twitter.com/EHL9X3lsW6 — Richard Kettleborough (@RichKettle07) November 6, 2023 మాథ్యూస్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయనప్పటికీ షకీబ్ కనీస క్రీడా ధర్మాన్ని మరిచి ప్రవర్తించడం క్రికెట్ అభిమానులను విస్మయానికి గురి చేస్తుంది. నెటిజన్లు సోషల్మీడియామ వేదికగా షకీబ్‌ను ఏకి పారేస్తున్నారు. Angelo Mathews speaks in Press conference and is whole fired up 🤣🔥#SLvBAN pic.twitter.com/GKXg8kf8UH— Div🦁 (@div_yumm) November 6, 2023 మ్యాచ్ అనంతరం ఈ విషయంపై మాథ్యూస్ స్వయంగా స్పందించాడు. షకీబ్ ప్రవర్తించిన తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ కాబట్టి అలా జరిగింది, మరే ఇతర జట్టు ఇలా స్పందిస్తుందని అనుకోను అంటూ కామెంట్స్ చేశాడు. మాథ్యూస్‌ను టైమ్ ఔట్‌గా ప్రకటించడంపై ప్రముఖ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బొరో కూడా స్పందించాడు. Angelo Mathews said, "it was Bangladesh that's why it happened, I don't think any other team would've done it". pic.twitter.com/cTzI9UM9SL — Mufaddal Vohra (@mufaddal_vohra) November 6, 2023 ప్రపంచ క్రికెట్‌కు ఇది చీకటి రోజు. ఇలాంటి ఘటన ప్రపంచకప్‌లో జరగడం విచారకరం అంటూ ట్వీట్ చేశాడు. ఇందుకు ఓ వీడియోను జోడిస్తూ.. క్రీడాస్పూర్తిని చాటుకోవడంలో నేపాల్‌కు చెందిన ఆసిఫ్ షేక్ షకీబ్ కంటే వెయ్యి రెట్లు నయమని కామెంట్ జోడించాడు. కాగా, నిన్నటి మ్యాచ్‌లో శ్రీలంకపై బంగ్లాదేశ్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. చదవండి: బంగ్లాదేశ్ అప్పీలు.. మాథ్యూస్ అవుట్! అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి! -
అది క్రీడా స్పూర్తి అంటే.. గ్రేమ్ స్మిత్ కూడా షకీబ్లా ఆలోచించి ఉంటే..!
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ టైమ్ ఔట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ ఓ ఆటగాడు టైమ్ ఔట్ కావడం ఇదే తొలిసారి. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ క్రీడా స్పూర్తికి విరుద్దంగా వ్యవహరించి మాథ్యూస్‌ను ఔట్‌గా ప్రకటించాలని అంపైర్‌పై ఒత్తిడి తీసుకురావడాన్ని యావత్ క్రీడా ప్రపంచం వ్యతిరేస్తుంది. ఈ విషయంలో షకీబ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే ఆ సందర్భంలో ప్రత్యర్ధి కెప్టెన్ క్రీడాస్పూర్తిని చాటుకుని, బ్యాటర్ టైమ్ ఔట్ కాకుండా కాపాడాడు. వివరాల్లోకి వెళితే.. 2007 జనవరి 5న భారత్-సౌతాఫ్రికా మధ్య కేప్‌టౌన్‌లో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు సౌరవ్ గంగూలీ ఆరు నిమిషాలు ఆలస్యంగా క్రీజ్‌లోకి వచ్చాడు. అయితే, ప్రత్యర్థి జట్టు కెప్టెన్ గ్రేమ్ స్మిత్ టైమ్ ఔట్ నిబంధనను అమలు చేయకూడదని అంపైర్‌ను కోరి క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) టైమ్ ఔట్ విషయంలో బ్యాటర్ ఆలస్యానికి సరైన కారణాలు ఉన్నాయని విశ్వసిస్తే, టైమ్ ఔట్ నిబంధనను విస్మరించమని అంపైర్‌ను అభ్యర్థించే విచక్షణ ప్రత్యర్థి కెప్టెన్ ఉంటుంది. ఆ సందర్భంలో గ్రేమ్ స్మిత్ తన విచక్షణను ఉపయోగించి, క్రీడాస్పూర్తిని చాటుతూ గంగూలీ ఔట్ కాకుండా సాయపడ్డాడు. నాడు గ్రేమ్ స్మిత్ చేసిన పనికి క్రికెట్ ప్రపంచం జేజేలు కొట్టింది. అయితే నిన్నటి మ్యాచ్‌లో షకీబ్.. అందుకు భిన్నంగా వ్యవహరించి జనాల చీత్కారాలకు గురవుతున్నాడు. ఒకవేళ ఆ రోజు గ్రేమ్ స్మిత్ కూడా షకీబ్లాగే పట్టుబట్టి గంగూలీని టైమ్ ఔట్‌గా ప్రకటించాలని అంపైర్‌పై ఒత్తిడి తెచ్చి ఉంటే, అంతర్జాతీయ క్రికెట్లో టైమ్ ఔట్ అయిన తొలి ఆటగాడిగా గంగూలీ రికార్డుల్లోకి ఎక్కి ఉండేవాడు. On January 5, 2007, Indian cricketer Sourav Ganguly nearly made history by being the first player to be declared 'timed out' in international cricket. He took six minutes to reach the batting crease. However, Graeme Smith, the opposing team's captain, chose not to enforce this… pic.twitter.com/JMhhs5Yaa5 — Anjula Hettige (@AnjulaHettige) November 6, 2023 నిన్నటి మ్యాచ్‌లో ఏం జరిగిందంటే..? శ్రీలంక ఇన్నింగ్స్ 24 ఓవర్ వేసిన షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో రెండో బంతికి సమరవిక్రమ ఔటయ్యాడు. వెంటనే ఏంజెలో మాథ్యూస్ క్రీజులోకి వచ్చాడు. అయితే క్రీజులోకి వచ్చిన మాథ్యూస్ సరైన హెల్మెట్‌ను తీసుకురాలేదు. క్రీజులో గార్డ్ తీసుకోనే సమయంలో తన హెల్మెట్ బాగో లేదని మాథ్యూస్ గమనించాడు. దీంతో వెంటనే డ్రెస్సింగ్ రూమ్‌వైపు కొత్త హెల్మెట్ కోసం సైగలు చేశాడు. View this post on Instagram A post shared by ICC (@icc) వెంటనే సబ్‌స్ట్యూట్ కరుణరత్నే పరిగెత్తుకుంటూ వచ్చి హెల్మెట్‌ను తీసుకువచ్చాడు. అయితే ఇదంతా జరగడానికి మూడు నిమషాల పైగా సమయం పట్టింది. ఈ క్రమంలో ప్రత్యర్ధి బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ టైమ్ ఔట్‌కు అప్పీలు చేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్లు చర్చించుకుని మాథ్యూస్‌ను ఔట్‌గా ప్రకటించారు. ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో శ్రీలంకపై బంగ్లాదేశ్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇదివరకే ఎలిమినేట్ అయిన బంగ్లాదేశ్‌కు ఇది కంటితుడుపు విజయం. ఈ మ్యాచ్‌లో ఓటమితో శ్రీలంక కూడా బంగ్లాదేశ్‌లా సెమీస్‌కు చేరకుండానే ఎలిమినేట్ అయ్యింది. ప్రస్తుత వరల్డ్‌కప్ ఎడిషన్‌లో బంగ్లాదేశ్, శ్రీలంకలతో పాటు ఇంగ్లండ్ కూడా ఇదివరకే ఎలిమినేట్ కాగా.. భారత్, సౌతాఫ్రికా జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. సెమీస్ రేసులో మూడు, నాలుగు స్థానాల కోసం పోటీ నడుస్తుంది. చదవండి: మాథ్యూస్ టైమ్ ఔట్.. అలా జరిగినందుకు బాధ లేదు.. రూల్స్‌లో ఉన్నదే చేశా: షకీబ్ -
మాథ్యూస్ 'టైమ్డ్ ఔట్'.. క్లారిటీ ఇచ్చిన అంపైర్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజులో మాథ్యూస్ ఔటైన విధానం తీవ్ర వివాదస్పదమైంది. ఈ మ్యాచ్‌లో మాథ్యూస్ దురదృష్టకర రీతిలో 'టైమ్డ్ ఔట్'గా పెవిలియన్‌కు చేరాడు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 'టైమ్డ్ ఔట్'గా వెనుదిరిగిన తొలి క్రికెటర్‌గా మాథ్యూస్ నిలిచాడు. నిర్ధేశించిన సమయంలోపు అతడు బంతిని ఎదర్కోనందుకు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్ టైమ్డ్ ఔట్‌కు అప్పీల్ చేశాడు. దీంతో రూల్స్ ప్రకారం మాథ్యూస్‌ను అంపైర్లు ఔట్‌గా ప్రకటించారు. ఏంటి టైమ్డ్ ఔట్.. మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) రూల్స్ ప్రకారం.. ఒక బ్యాటర్ ఔటైనా లేదా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగినా తర్వాత క్రీజులోకి వచ్చే బ్యాటర్ 3 నిమిషాల్లోపు(180 సెకన్లు) బంతిని ఎదుర్కొవాలి. ఒకవేళ అలా జరగని పక్షంలో ఇన్కమింగ్ బ్యాటర్‌ను టైమ్డ్ ఔట్ రూల్ కింద ఔట్‌గా ప్రకటిస్తారు. క్లారిటీ ఇచ్చిన ఫోర్త్ అంపైర్.. ఇక ఈ వివాదంపై ఫోర్త్ అంపైర్ అడ్రియన్ హోల్డ్‌స్టాక్ క్లారిటీ ఇచ్చాడు. "ఐసీసీ వరల్డ్‌కప్ రూల్స్ మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ చట్టాల కంటే కొంచెం భిన్నంగా ఉంటాయి. నిబంధనల ప్రకారం.. వికెట్ పడిన తర్వాత లేదంటే, బ్యాటర్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగితే ఇన్కమింగ్ బ్యాటర్ రెండు నిమిషాల్లో బంతిని ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలి. ప్లేయింగ్ కంట్రోల్ రూమ్‌లో ఉన్న మేము కొన్ని ప్రోటోకాల్‌లను అనుసరిస్తాము. వికెట్ పడిన వెంటనే టీవీ అంపైర్(థర్డ్ అంపైర్) ప్రాథమికంగా రెండు నిమిషాలు ఎదురుచూసి.. అప్పటికి ఆట తిరిగి ప్రారంభం కాకపోతే ఆన్‌ఫీల్డ్ అంపైర్లతో సంప్రదింపులు జరుపుతాడు. ఉదాహరణకు ఈ మ్యాచ్‌లో జరిగిన సంఘటను తీసుకుంటే.. బ్యాటర్‌కు తన హెల్మెట్ స్ట్రాప్ ఊడిపోయిందనే గమనించే సమయానికే రెండు నిమిషాలు దాటిపోయింది. నిర్ణీత సమయానికి అతడు బంతిని ఎదుర్కొనుందుకు సిద్దంగా లేడు. హోల్డ్‌స్టాక్ చెప్పుకొచ్చాడు. ఎవరు ముందుగా అప్పీలు చేశారు? ఈ మ్యాచ్‌లో ముందుగా ఫీల్డింగ్ కెప్టెన్ షకీబుల్ హసన్.. స్టాండింగ్ అంపైర్ మరైస్ ఎరాస్మస్‌కి అప్పీల్ చేశాడు. అప్పటికే సమయం ముగియడంతో షకీబుల్ అప్పీల్ చేయాలనుకున్నాడని ఆయన వెల్లడించాడు. ముందే చెక్ చేసుకోవాలి.. ఇక బ్యాటర్‌గా మనం క్రీజులోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నప్పుడు ముందే మనం చెక్ చేసుకోవాలి. మనకు సంబంధించిన హెల్మెట్, ప్యాడ్స్ వంటివి సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని ఫీల్డ్‌లోకి రావాలి. ఎందుకంటే ప్లేయర్ రెండు నిమిషాల్లో బంతిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలి. బ్యాటర్లు తమకు సంబంధించిన కిట్స్(హెల్మెట్, ప్యాడ్స్, గ్లావ్స్) సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి 50 సెకన్లలోపు క్రీజులోకి చేరుకోవాలి. లేదంటే ఇటువంటి పరిస్ధితులు ఎదురవతాయి అని హోల్డ్‌స్టాక్ పేర్కొన్నాడు. చదవండి: WC 2023: బంగ్లాదేశ్ అప్పీలు.. మాథ్యూస్ అవుట్! అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి! View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: అతడి విషయంలో అలా అనుకున్న వాళ్లదే తప్పు! మరి రూల్స్?
#BanvsSL- #Angelo Mathews- #ShakibAlHasan: వన్డే వరల్డ్‌కప్-2023.. ఢిల్లీ.. అరుణ్‌జైట్లీ స్టేడియం.. శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్.. ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన రెండు జట్ల మధ్య పోటీ.. ఇందులో గెలిచినా.. సెమీ ఫైనల్లో అడుగుపెట్టే అవకాశం లేదు.. కానీ.. చాంపియన్స్ ట్రోఫీ-2025కి అర్హత సాధించాలంటే మాత్రం ఇరు జట్లకు ఈ మ్యాచ్‌లో గెలుపు అత్యవసరం... పాయింట్ల పట్టికలో టాప్-7లో నిలిచి చాంపియన్స్ ట్రోఫీ బరిలో నిలవాంటే... అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌లో ఎలాగైనా పైచేయి సాధించాల్సిందేనన్న పట్టుదలతో బరిలోకి దిగాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. లంక ఓపెనర్ కుశాల్ పెరీరాను 4 పరుగులకే పెవిలియన్‌కు పంపి బంగ్లాకు శుభారంభం అందించాడు పేసర్ షోరిఫుల్ ఇస్లాం. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ కుశాల్ మెండిస్(19)ను షకీబ్ అవుట్ చేశాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ పాతుమ్ నిసాంక(41), సదీర సమరవిక్రమతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. నిసాంక అవుటైన తర్వాత చరిత్ అసలంక సమరవిక్రమకు తోడయ్యాడు. అయితే.. లంక ఇన్నింగ్స్ 25వ ఓవర్ రెండో బంతికి.. 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నపుడు.. సమరవిక్రమ షకీబ్ బౌలింగ్‌లో మహ్మదుల్లాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. హైడ్రామా మొదలైంది అప్పుడే దీంతో నాలుగు వికెట్లు కోల్పోయిన శ్రీలంక వ్యూహాత్మకంగా ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌ను బరిలోకి దింపింది. కానీ దురదృష్టవశాత్తూ మాథ్యూస్ రాంగ్ హెల్మెట్ వెంట తెచ్చుకున్నాడు. క్రీజులోకి వచ్చిన తర్వాత బ్యాటింగ్ పొజిషన్ తీసుకోకముందే ఈ విషయాన్ని గమనించిన అతడు.. వేరే హెల్మెట్ కావాలంటూ డ్రెస్సింగ్‌రూం వైపు సైగ చేశాడు. సబ్‌స్టిట్యూట్ కరుణరత్నె వెంటనే హెల్మెట్ తీసుకుని మైదానంలోకి వచ్చాడు. షకీబ్ బుర్ర పాదరసంలా పనిచేసింది! ఇదంతా జరగడానికి రెండు నిమిషాలకు పైగా సమయం పట్టింది. అప్పుడే షకీబ్ బుర్ర పాదరసంలా పనిచేసింది. అంతర్జాతీయ క్రికెట్ నిబంధనలకు అనుగుణంగా.. మాథ్యూస్ విషయంలో ‘టైమ్డ్ అవుట్’కి అప్పీలు చేశాడు. అంతేకాదు ఈ నిబంధన అమలు చేయాల్సిందేనంటూ పట్టుబట్టాడు. ప్రయత్నం చేయకుండానే వికెట్ దీంతో అంపైర్లు ఏంజెలో మాథ్యూస్ అవుటైనట్లు ప్రకటించారు. ఎలాంటి ప్రయత్నం చేయకుండానే వికెట్ దొరికిన సంబరంలో బంగ్లాదేశ్ మునిగిపోగా.. ఈ అనూహ్య ఘటనతో శ్రీలంక శిబిరంలో ఒక్కసారిగా అయోమయం నెలకొంది. బంగ్లా సంబరం.. శ్రీలంక అయోమయం ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్లో ఓ బ్యాటర్ ‘టైమ్డ్ అవుట్’గా వెనుదిరగడం ఇదే తొలిసారి. అలా.. నిర్ణీత సమయంలో బంతిని ఎదుర్కోవడంలో విఫలమైనందున ఏంజెలో మాథ్యూస్ ఈ ‘శిక్ష’ అనుభవించకతప్పలేదు. View this post on Instagram A post shared by ICC (@icc) బతిమిలాడినా కరుణించలేదు హెల్మెట్ కారణంగా జరిగిన తాత్సారం మూలంగా అతడు భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. అంపైర్లు, షకీబ్ దగ్గరికి వెళ్లి మరీ విషయం ఏమిటో వివరించేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. మాథ్యూస్ బాధను అర్థం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదన్నట్లు షకీబ్ నవ్వుతూ అలా చూస్తూ ఉండిపోయాడు. అప్పీలు వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదన్నట్లు ముందుకు సాగిపోయాడు. శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ సైతం బంగ్లాదేశ్ కోచ్ చండిక హతుర్సింఘతో ఈ విషయం గురించి చర్చించాడు. ఫోర్త్ అంపైర్ దృష్టికి కూడా విషయాన్ని తీసుకువెళ్లారు. తప్పు ఎవరిది? కానీ అప్పటికే కొత్త బ్యాటర్ క్రీజులోకి రావడం బ్యాటింగ్ మొదలుపెట్టడం జరిగిపోయింది. అంతగా ఆసక్తి కలిగించదనుకున్న మ్యాచ్ కాస్తా ఈ అనూహ్య ఘటన మూలంగా.. క్రీడా వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారిపోయింది. సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా విడిపోయి ఈ ఘటనపై చర్చిస్తున్నారు నెటిజన్లు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌లో క్రీడాస్ఫూర్తి కొరవడిందని చాలా మంది ట్రోల్ చేస్తుంటే.. ఇదంతా నిబంధనలకు అనుగుణమే కదా అని మరికొందరు వాదిస్తున్నారు. నిబంధనలు ఏం చెప్తున్నాయి? ఎంసీసీ నిబంధన ప్రకారం.. ఓ జట్టు బ్యాటింగ్ చేస్తున్నపుడు వికెట్ పడిన తర్వాత లేదంటే.. బ్యాటర్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగితే... సదరు ప్లేయర్ స్థానంలో వచ్చే ఆటగాడు.. మైదానంలోకి వచ్చిన మూడు నిమిషాల్లోపే బంతిని ఎదుర్కోవాలి. లేదంటే బ్యాటర్‌ను టైమ్డ్ అవుట్‌గా పరిగణిస్తారు. ఇక ఐసీసీ వరల్డ్‌కప్ నిబంధనల ప్రకారం.. రెండు నిమిషాల్లోపే బ్యాటర్ బాల్‌ను ఫేస్ చేయాలి. ఈ నిబంధనను ఆధారం చేసుకునే షకీబ్ అల్ హసన్ ఏంజెలో మాథ్యూస్ విషయంలో అప్పీలుకు వెళ్లి సఫలమయ్యాడు. అతడి విషయంలో అలా అనుకున్న వాళ్లదే తప్పు అయితే, దీని మూలంగా.. జెంటిల్మన్గేమ్లో క్రీడాస్ఫూర్తిని మరచిన ఆటగాడిగా అతడు చరిత్రలో మిగిలిపోతాడని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇందుకు సంబంధించి గతంలో.. తమకు(స్థానిక లీగ్ మ్యాచ్) ప్రతికూల ఫలితం వచ్చినపుడు అంపైర్ల పట్ల షకీబ్ వ్యవహరించిన తీరును గుర్తు చేస్తున్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) ఇలాంటి వ్యక్తి నుంచి స్పోర్ట్స్‌మెన్‌షిప్ ఆశించినవాళ్లదే తప్పు అంటూ ట్రోల్ చేస్తున్నారు. షకీబ్ తీరే అంత అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. టైమ్బ్యాడ్ అని సరిపెట్టుకోకతప్పదంటూ మాథ్యూస్‌కు హితవు పలుకుతున్నారు. సమయం వృథా చేయడం వల్ల మూల్యం చెల్లించావంటూనే సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో.. టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్‌లో.. మాథ్యూస్లాగే మహ్మద్ రిజ్వాన్ టైమ్ వేస్ట్ చేసినపుడు విరాట్ కోహ్లి చేతిగడియారం చూసుకుంటున్నట్లు అభినయించిన ఫొటోలు షేర్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీరు ఎటువైపు ఉంటారు?! చదవండి: Virat Kohli: అవును.. కోహ్లి స్వార్థపరుడే! ముమ్మాటికీ స్వార్థపరుడే..!! #BANvSL "Angelo Mathews" what is this? pic.twitter.com/JIsQo6cPut — Ankur Jain 🇮🇳 (@aankjain) November 6, 2023 Angelo Mathews becomes the first cricketer in history to be out on 'timed out' If you Expect sportsmanship from Shakib-al-hasan then it's your Mistake He didn't even respect Umpires 🤮#SLvBAN #ODIWorldCup2023 #ICCWorldCup2023 #SLvsBAN pic.twitter.com/PGqQfM9HFQ — Troll Mafia (@offl_trollmafia) November 6, 2023 -
బంగ్లాదేశ్ అప్పీలు.. మాథ్యూస్ అవుట్! అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి!
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ విచిత్రకర రీతిలో ఔటయ్యాడు. నిర్ణీత సమయంలో క్రీజులో గార్డ్ తీసుకుపోనుందున మాథ్యూస్ టైమ్డ్ అవుట్ పెవిలియన్‌కు చేరాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇలా జరగడం ఇదే తొలి సారి. ఏమి జరిగిందంటే? శ్రీలంక ఇన్నింగ్స్ 24 ఓవర్ వేసిన షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో రెండో బంతికి సమరవిక్రమ ఔటయ్యాడు. వెంటనే ఏంజెలో మాథ్యూస్ క్రీజులోకి వచ్చాడు. అయితే క్రీజులోకి వచ్చిన మాథ్యూస్ సరైన హెల్మెట్‌ను తీసుకురాలేదు. క్రీజులో గార్డ్ తీసుకోనే సమయంలో తన హెల్మెట్ బాగో లేదని మాథ్యూస్ గమనించాడు. దీంతో వెంటనే డ్రెస్సింగ్ రూమ్‌వైపు కొత్త హెల్మెట్ కోసం మాథ్యూస్ సైగలు చేశాడు. వెంటనే సబ్‌స్ట్యూట్ కరుణరత్నే పరిగెత్తుకుంటూ వచ్చి హెల్మెట్‌ను తీసుకువచ్చాడు. అయితే ఇదంతా జరగడానికి మూడు నిమషాల పైగా సమయం పట్టింది. ఈ క్రమంలో ప్రత్యర్ధి బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ టైమ్డ్ అవుట్‌కు అప్పీలు చేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్లు చర్చించుకుని మాథ్యూస్‌ను ఔట్‌గా ప్రకటించారు. టైమ్డ్ అవుట్ అంటే ఏంటి? ఎంసీసీ నిబంధన ప్రకారం.. వికెట్ పడిన తర్వాత లేదంటే.. బ్యాటర్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగితే... సదరు ప్లేయర్ స్థానంలో వచ్చే బ్యాటర్ నిర్ణీత సమయంలో బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. మైదానంలోకి వచ్చిన మూడు నిమిషాల్లోపే బాల్‌ను ఫేస్ చేయాలి. లేదంటే బ్యాటర్‌ను టైమ్డ్ అవుట్‌గా పరిగణిస్తారు. మాథ్యూస్ విషయంలో ఇదే జరిగింది. అయితే క్రీడా స్పూర్తిని మరిచి ఇలా చేసిన బంగ్లాదేశ్‌ను నెటిజన్లు తప్పబడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌ను దారుణంగా ట్రోలు చేస్తున్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
పేరుకు డిఫెండింగ్ చాంపియన్.. నెదర్లాండ్స్ కంటే ఘోరంగా! లంక దెబ్బకు..
WC 2023- Eng Vs SL: వన్డే వరల్డ్‌కప్-2023లో ఇంగ్లండ్ బ్యాటర్ల వైఫల్యం కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో సౌతాఫ్రికాలో బౌలర్ల ధాటికి చేతులెత్తేసిన ఇంగ్లండ్ ఆటగాళ్లు.. తాజాగా శ్రీలంక పేసర్ల దెబ్బకు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 33.2 ఓవర్లకే ఆలౌట్ అయి విమర్శలు మూటగట్టుకుంటున్నారు. భారత్ వేదికగా ప్రపంచకప్ టోర్నీలో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శ్రీలంకతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు జానీ బెయిర్ స్టో 30, డేవిడ్ మలన్ 28 పరుగులతో ఫర్వాలేదనిపించారు. View this post on Instagram A post shared by ICC (@icc) స్టోక్స్ 43 పరుగులతో వన్‌డౌన్ బ్యాటర్ జో రూట్(3) పూర్తిగా విఫలం కాగా.. బెన్ స్టోక్స్ 43 పరుగులతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా వాళ్లలో మొయిన్ అలీ(15), డేవిడ్ విల్లే(14- నాటౌట్) మినహా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. లంక పేసర్ల దెబ్బకు తోకముడిచిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌తో తుది జట్టులోకి వచ్చిన పేసర్లు లాహిరు కుమార, ఏంజెలో మాథ్యూస్ దెబ్బకు ఇంగ్లండ్ బ్యాటర్లంతా తోకముడిచారు. వీరిద్దరితో పాటు మరో ఫాస్ట్ బౌలర్ కసున్ రజిత కూడా చెలరేగడంతో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ 156 పరుగులకే కుప్పకూలింది. లంక బౌలర్లలో కుమార.. స్టోక్స్, బట్లర్, లివింగ్‌స్టోన్ రూపలో మూడు కీలక వికెట్లు పడగొట్టగా.. మాథ్యూస్, రజిత రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. స్పిన్నర్ మహీశ్ తీక్షణ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లోనూ బ్యాటర్ల వైఫల్యం కారణంగా 170 పరుగులకే ఆలౌట్ అయిన ఇంగ్లండ్ 229 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు ఓడిన బట్లర్ బృందం.. లంకతో మ్యాచ్‌లోనూ ఓడిపోతే సెమీస్ అవకాశాలు సంక్లిష్టమవుతాయి. పేరుకు డిఫెండింగ్ చాంపియన్.. వన్డే వరల్డ్‌కప్-2023లో ఇంగ్లండ్ అత్యల్ప స్కోరు నమోదు చేయడం ఇది రెండోసారి. గత మ్యాచ్‌లో వాంఖడేలో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో 170 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. తాజా ఎడిషన్‌లో అఫ్గనిస్తాన్(139, 156)తో పాటు రెండుసార్లు అత్యల్ప స్కోర్లు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. నెదర్లాండ్స్ కంటే ఘోరంగా ఈ రెండు జట్ల కంటే నెదర్లాండ్స్ మెరుగ్గా ఉంది. ఆస్ట్రేలియాతో బుధవారం నాటి మ్యాచ్‌లో 90 పరుగులకు డచ్ జట్టు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్, అఫ్గన్లతో పోలిస్తే ఇంతవరకు ఒకే ఒక్కసారి లోయస్ట్ స్కోరు నమోదు చేసింది. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: శ్రీలంకతో మ్యాచ్.. ఇంగ్లండ్‌కు భారీ షాక్! తుది జట్లు ఇవే
ICC Cricket World Cup 2023- England vs Sri Lanka: వన్డే వరల్డ్‌కప్-2023లో శ్రీలంకతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో తాము మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ వెల్లడించాడు. ఇంగ్లండ్‌కు షాక్.. అతడు దూరం క్రిస్ వోక్స్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్ తుదిజట్టులోకి వచ్చినట్లు తెలిపాడు. వేలికి గాయమైన కారణంగా స్టార్ పేసర్ రీస్ టోప్లే స్వదేశానికి తిరిగి వెళ్లిపోయినట్లు బట్లర్ పేర్కొన్నాడు. అట్కిన్సన్, హ్యారీ బ్రూక్‌లు కూడా లంకతో మ్యాచ్‌లో ఆడటం లేదని తెలిపాడు. వాళ్లిద్దరు అవుట్ ఇక ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు చమిక, హేమంత స్థానాల్లో ఏంజెలో మ్యాథ్యూస్, కుమార తుదిజట్టులోకి వచ్చినట్లు లంక సారథి కుశాల్ మెండిస్ తెలిపాడు. దసున్ షనక గైర్హాజరీలో కెప్టెన్సీ చేపట్టిన తనకు ఆటగాళ్లంతా పూర్తి మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొన్నాడు. బెంగళూరు మ్యాచ్‌లో తాము విజయం సాధిస్తామనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశాడు. కాగా డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా నెగ్గాల్సిందే! తుది జట్లు: శ్రీలంక కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(కెప్టెన్/ వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనుంజయ డిసిల్వా, ఏంజెలో మాథ్యూస్, మహీష్ దీక్షానా, కసున్ రజిత, లాహిరు కుమార, దిల్షాన్ మదుశంక. ఇంగ్లండ్ జానీ బెయిర్ స్టో, డేవిడ్ మలాన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్(కెప్టెన్/ వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్. చదవండి: WC 2023: ఇంగ్లండ్‌తో మ్యాచ్.. స్టార్ పేసర్‌కు రెస్ట్! జట్టులోకి అశ్విన్.. ఎందుకంటే? -
వరల్డ్‌కప్ నుంచి స్టార్ బౌలర్ ఔట్..
వన్డే ప్రపంచకప్-2023లో శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు యువ ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరానా గాయం కారణంగా ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. పతిరానా ప్రస్తుతం భుజం గాయంతో బాధపడుతున్నాడు. అతడు కోలుకోవడానికి దాదాపు 3 వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు టోర్నీ మధ్యలో తప్పకున్నాడు. ఇక పతిరానా స్ధానాన్ని సీనియర్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌తో శ్రీలంక క్రికెట్ భర్తీ చేసింది. ఇప్పటికే భారత్‌కు చేరుకున్న మాథ్యూస్.. ఇంగ్లండ్‌తో మ్యాచ్ జట్టు సెలక్షన్‌కు అందుబాటులోకి వచ్చాడు. ఈ మెగా టోర్నీలో ఆక్టోబర్ 26న బెంగళూరు వేదికగా ఇంగ్లండ్‌తో శ్రీలంక తలపడనుంది. కాగా ఇప్పటికే గాయం కారణంగా లంక కెప్టెన్ దసన్ శనక టోర్నీ మధ్యలోనే తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పతిరానా కూడా దూరం కావడం శ్రీలంకకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. చదవండి: నిజంగా సిగ్గు చేటు.. రోజూ 8 కేజీల మటన్ తింటున్నట్టు ఉన్నారు: పాకిస్తాన్ లెజెండ్ ఫైర్