అతడికి తగిన శాస్తే జరిగింది.. కానీ ఇకపై అలా చేయొద్దు! బదులుగా.. | Sakshi
Sakshi News home page

అతడికి తగిన శాస్తే జరిగింది.. కానీ ఇకపై అవుట్‌ ఇవ్వొద్దు! ఇలా చేస్తే..

Published Fri, Nov 10 2023 7:15 PM

Angelo Mathews Got Exactly What He Deserved Brad Hogg On Timed Out - Sakshi

Angelo Mathews Timed Out Row: ‘టైమ్డ్‌ అవుట్‌’ విషయంలో శ్రీలంక ఆల్‌రౌండర్‌ ఏంజెలో మాథ్యూస్‌ను ఉద్దేశించి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ బ్రాడ్‌ హాగ్‌ ఘాటు విమర్శలు చేశాడు. చేసిన తప్పునకు అతడికి తగిన శాస్తే జరిగిందంటూ కుండబద్దలు కొట్టాడు. అయితే, ఇలాంటి నిబంధన మాత్రం తనకు నచ్చలేదని పేర్కొన్నాడు.

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా శ్రీలంక క్రికెటర్‌ ఏంజెలో మాథ్యూస్‌ టైమ్డ్‌ అవుట్‌ అయిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం.. క్రీజులోకి వచ్చిన తర్వాత నిర్ణీత సమయం(2 నిమిషాల్లో)లో తొలి బంతిని ఎదుర్కోని కారణంగా పెవిలియన్‌కు చేరుకున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి ఆటగాడిగా
హెల్మెట్‌ విషయంలో జరిగిన పొరపాటును సరిచేసుకునే క్రమంలో మాథ్యూస్ మైదానాన్ని వీడక తప్పలేదు. బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ అప్పీలుతో ఏకీభవించిన అంపైర్లు అతడిని టైమ్డ్‌ అవుట్‌గా ప్రకటించారు. దీంతో ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో ఇలా వెనుదిరిగిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.

ఈ విషయంపై క్రికెట్‌ వర్గాలు రెండు చీలిపోయి చర్చలు సాగిస్తున్నాయి. మాథ్యూస్‌ పట్ల షకీబ్‌ క్రీడాస్ఫూర్తి కనబరిచాల్సిందని కొంతమంది అంటుండగా.. నిబంధనల ప్రకారం షకీబ్‌ చేసింది సరైందే అంటూ మరికొంత మంది మాథ్యూస్‌ను తప్పుబడుతున్నారు.

అందుకు సంసిద్ధంగా లేరనే అర్థం
ఈ నేపథ్యంలో ఆసీస్‌ మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్‌ సైతం ఈ విషయంలో షకీబ్‌ వైపే నిలిచాడు. ‘‘బ్యాటర్లుకు సమయం చాలా ముఖ్యమైంది. ఒకవేళ టైమ్‌కి రాకపోతే ఫలితం అనుభవించాల్సి ఉంటుంది.

ఏంజెలో మాథ్యూస్‌ దేనికైతే అర్హుడో అదే జరిగింది. మీకు రెండు నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. కాబట్టి వికెట్‌ పడిన వెంటనే క్రీజులోకి వెళ్లి రెండు నిమిషాల్లోపే బంతిని ఎదుర్కోవాలి. ఒకవేళ మీరలా చేయలేదంటే బ్యాటింగ్‌కు చేసేందుకు మీరు సంసిద్ధులు కాలేదనే అర్థం కదా!’’ అంటూ సోషల్‌ మీడియాలో వీడియో షేర్‌ చేశాడు. 

12 పరుగులు పెనాల్టీ విధించాలి
మాథ్యూస్‌ విషయంలో బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌తో పాటు అంపైర్లు నిబంధనల ప్రకారమే వ్యవహరించాని బ్రాడ్‌ హాగ్‌ పరోక్షంగా వారిని సమర్థించాడు. అయితే, ఇలా బ్యాటర్‌ను టైమ్డ్‌ అవుట్‌ చేయడం తనకు నచ్చలేదన్న ఈ మాజీ బౌలర్‌ ఓ పరిష్కారాన్ని సూచించాడు.

‘‘నాకు ఇలాంటి డిస్మిసల్‌ నచ్చలేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలా జరగడం ఇదే తొలిసారి. అయితే, మళ్లీ ఇలాంటివి జరగాలని నేను కోరుకోవడం లేదు. ఇలాంటి సందర్భాల్లో బ్యాటర్‌ను అవుట్‌గా ప్రకటించే బదులు.. బ్యాటింగ్‌ జట్టుకు 12 పరుగుల మేర కోత విధిస్తే బాగుంటుంది.

అపుడైనా ఇలా ఆలస్యం చేసేవాళ్లు కాస్త తొందరగా రెడీ అవుతారు. వికెట్‌ పడగానే క్రీజులోకి పరిగెత్తుకుని వచ్చి బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు’’ అని బ్రాడ్‌ హాగ్‌ అభిప్రాయపడ్డాడు. 

చదవండి: ఇలాంటి తోడు ఉంటే ఏదైనా సాధ్యమే! ప్రేమ, పెళ్లి.. రెయిన్‌బో బేబీ!

Advertisement
Advertisement