లంక ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ విజేతగా బి లవ్ క్యాండీ అవతరించింది. కొలొంబోలోని ప్రేమదాస స్టేడియంలో నిన్న (ఆగస్ట్ 20) జరిగిన ఫైనల్లో క్యాండీ టీమ్.. డంబుల్లా ఔరాను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి తొలిసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. కెప్టెన్ హసరంగ లేకుండానే ఫైనల్ మ్యాచ్ బరిలోకి దిగిన క్యాండీ.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి విజేతగా నిలిచింది. తాత్కాలిక కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (21 బంతుల్లో 25 నాటౌట్; 3 ఫోర్లు) టెయిలెండర్ల సాయంతో ఎంతో ఓర్పుగా బ్యాటింగ్ చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.
అంతకుముందు మాథ్యూస్ బంతితోనూ (2-0-11-0) పర్వాలేదనిపించాడు. గాయం కారణంగా చాలాకాలంగా బంతి పట్టని మాథ్యూస్ రెగ్యులర్ కెప్టెన్ హసరంగ గైర్హాజరీలో తప్పనిసరి పరిస్థితుల్లో బౌలింగ్ చేసి మెప్పించాడు. ఫలితంగా అతనికే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డంబుల్లా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. అవిష్క ఫెర్నాండో (10 బంతుల్లో 5), విఫలం కాగా, కుశాల్ మెండిస్ (22), సమరవిక్రమ (36), కుశాల్ పెరీరా (31 నాటౌట్), ధనంజయ డిసిల్వ (40) రాణించారు. క్యాండీ బౌలర్లలో చతురంగ డిసిల్వ 2, నువాన్ ప్రదీప్, మహ్మద్ హస్నైన్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బి లవ్ క్యాండీ మరో బంతి మిగిలుండగా (19.5 ఓవర్లలో) 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. క్యాండీ ఇన్నింగ్స్‌లో మహ్మద్ హరీస్ (26), కమిందు మెండిస్ (44), దినేశ్ చండీమల్ (24), ఏంజెలో మాథ్యూస్ (25 నాటౌట్), ఆసిఫ్ అలీ (19) రాణించగా.. చతురంగ డిసిల్వ డకౌటయ్యారు. డంబుల్లా బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. బినుర ఫెర్నాండో 2 వికెట్లు దక్కించుకున్నాడు.
సిరీస్ ఆధ్యాంతరం అద్భుతంగా రాణించిన క్యాండీ కెప్టెన్ హసరంగ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు. ప్రస్తుత ఎడిషన్‌లో హసరంగ లీడింగ్ రన్ స్కోరర్‌గా (10 మ్యాచ్‌ల్లో 279 పరుగులు), లీడింగ్ వికెట్ టేకర్‌గా (10 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు), అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా (10 మ్యాచ్‌ల్లో 14 సిక్సర్లు) పలు అవార్డులు సొంతం చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment